– యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
నీట్ ప్రశ్నాపత్రం లీకేజిలో కేంద్ర మంత్రుల హస్తం ఉందనీ, వెంటనే పరీక్షను రద్దు చేయాలని యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి డిమాండ్ చేశారు. పరీక్షా పత్రం లీక్ చేసిన నిందితులను విచారిస్తే బీజేపీ నేతల బండారం బయటపడుతుందని తెలిపారు. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరా బాద్‌లోని నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడించేందుకు యత్నించింది. గాంధీభవన్ వద్ద వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది.
బీజేపీ ప్రభుత్వం విద్యార్థులకు తీరని అన్యాయం చేసిందని ఈ సందర్భంగా శివసేనారెడర్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్ లీకేజిలో 14 మంది కేంద్ర మంత్రుల ప్రమేయ ముందని ఆరోపించారు. వారి పిల్లల భవిష్యత్ కోసం ప్రశ్నాపత్రం లీక్ చేశారని విమర్శించారు. అసలు నిజాలు బయటపడితే, కేంద్ర ప్రభుత్వం కుప్పకూలుతుందన్నారు. అందుకే పరీక్ష రద్దు చేసేందుకు కేంద్రం వెనకాడు తున్నదని విమర్శించారు. ఈ లీకేజికి నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 24లక్షల మంది విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. నీట్‌ను రద్దు చేయకపోతే యూత్ కాంగ్రెస్ పార్లమెంట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.