– రోహిత్ వేముల రోజుల్లోకి హెచ్‌సీయూ
– మళ్లీ వెలివేతల పర్వానికి తెరలేపిన వర్సిటీ యాజమాన్యం : ఎస్ఎఫ్ఐ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
విద్యార్థుల హక్కుల కోసం నిరసన తెలిపితే నేరమా? ప్రశ్నిస్తే వెలివేస్తారా? ఇదెక్కడి న్యాయం? రోహిత వేముల రోజుల్లోకి మళ్లీ తీసుకెళ్లదలిచారా? అంటూ హెచ్‌సీయూ యాజమాన్యాన్ని ఎస్ఎఫ్ఐ ప్రశ్నించింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వీసీ గెస్ట్ హౌస్ ముందు నిరసన తెలిపిన విద్యార్థులు ఎన్నుకోబడిన స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్‌తో పాటు నలుగురు విద్యార్థి సంఘం నాయకులను సస్పెండ్ చేయడాన్ని తప్పుబట్టింది. ఈ మేరకు ఆదివారం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎల్.మూర్తి, రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులపైన పోలీసు కేసులు పెట్టడమే కాకుండా విద్యార్థులను యూనివర్సిటీ నుంచి వెలివేస్తు సస్పెన్షన్ నిర్ణయం తీసుకోవడం దారుణమని పేర్కొన్నారు. ఆ ఐదుగురు కూడా నిరుపేద, అట్టడుగు వర్గాల కుటుంబాల నుంచి వచ్చినవారేనని తెలిపారు. దీంతో వారి చదువులు, ఉపకార వేతనాలన్నీ ప్రశ్నార్థకంలో పడుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విశ్వవిద్యాలయంలో ఎనిమిదేండ్ల కిందట ఏ విధంగా రోహిత్ వేములను వెలివేసి, అతని హత్యకు వర్సిటీ యాజమాన్యం కారణమైందని విమర్శించారు. యూనివర్శిటీలో ప్రస్తుత పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యవాదులందరూ దీన్ని తీవ్రంగా ఖండించాలనీ, సోమవారం నుంచి జరిగే పోరాటానికి మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు.