– కొత్తగా ఎన్నికైన 148 మంది ఎంపీల వృత్తి అదే
– రైతులుగా ప్రకటించుకున్న 13 మంది
న్యూఢిల్లీ : వ్యవసాయ నేపథ్యం కలిగి ఉన్న ఎంపీల సంఖ్య 18వ లోక్‌సభలో ఎక్కువగా ఉన్నది. ఆ తర్వాత వ్యాపారం, సామాజిక పని రంగాలకు చెందిన వారున్నారు. లోక్‌సభ సెక్రెటేరియట్ వద్ద అందుబాటులో ఉన్న డేటా ఈ విషయాన్ని వెల్లడిస్తున్నది. దీని ప్రకారం.. కనీసం 316 మంది ఎంపీలు గ్రాడ్యుయేట్లు లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్‌లు కాగా, నలుగురు కనీసం మెట్రిక్యులేషన్ కూడా పూర్తి చేయలేకపోయారు. కొత్తగా ఎన్నికైన 148 మంది ఎంపీలు వ్యవసాయాన్ని తమ వృత్తిగా పేర్కొన్నారు. మరో 13 మంది ఎంపీలు తమను తాము రైతులుగా ప్రకటించుకున్నారు. 76 మంది సభ్యులు వ్యాపార నేపథ్యం కలిగి ఉండగా, 58 మంది సామాజిక కార్యకర్తలుగా ఉన్నారు. ” మా డేటాబేస్ కోసం ఎంపీల గురించిన నేపథ్య సమాచారాన్ని సేకరిస్తాం. ఈ సమాచారం అంతా మా వెబ్‌సైట్‌తో పాటు ‘హూ ఈజ్ హూ ఆఫ్ ది 18వ లోక్‌సభ’ పుస్తకంలో కూడా అందుబాటులో ఉంటుంది” అని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇక ఇదే లోక్‌సభలో 32 మంది అడ్వొకేట్లు, లాయర్లు ఉన్నారు. బీజేపీకి చెందిన అభిజిత్ గందోపాధ్యాయ ఒక మాజీ హైకోర్టు న్యాయమూర్తి. ఈయన తుమ్లుక్ నుంచి విజయం సాధించారు. అలాగే, ఇందులో ఏడుగురు మెడికల్ ప్రాక్టీషనర్లు, నలుగురు ఇంజినీర్లు, పలువురు సినీ కళాకారులు, ఒక స్ట్రాటజీ కన్సల్టెంట్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కూడా ఉన్నారు.
కొత్త లోక్‌సభలో వయస్సుల వారీగా అత్యంత సీనియర్ సభ్యుడు డీఎంకేకు చెందిన టి.ఆర్ బాలు(83), సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) ఎంపీ పుష్పేంద్ర సరోజ్(25) పిన్న వయస్కుడిగా ఉన్నారు. కాగా, సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కనీసం 191 మంది ఎంపీలు హిందీలో ప్రమాణం చేయాలనుకుంటున్నారు. 164 మంది ఎంపీలు హిందీ లేదా ఇంగ్లీషులో కాకుండా ఇతర భాషల్లో ప్రమాణం చేస్తామని చెప్పారు.