– అధికారంలోకి వచ్చాక ‘కొందరికే కొన్ని…’
– ఇదీ కాంగ్రెస్ సర్కార్ తీరు : ట్విట్టర్‌లో మాజీ మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ‘అందరికీ అన్నీ’ ఇస్తామని హామీలిచ్చి, అధికారంలోకి వచ్చాక ‘కొందరికే కొన్ని’ స్కీంలు ఇస్తున్నదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు. సీఎం అంటే కటింగ్ మాస్టరా? అని ఎద్దేవా చేశారు. ప్రతి పథకంలో లబ్దిదారుల సంఖ్యకు కోత పెట్టడమే లక్ష్యంగా వ్యవహరిస్తూ ‘సీఎం’ అనే పదానికి సరికొత్త నిర్వచనం ఇస్తున్నారని పేర్కొన్నారు. అప్పట్లో రైతుల్ని లోన్‌లు తెచ్చుకోమని చెప్పి, ఇప్పుడు రూ.2 లక్షల రుణమాఫీకి సవాలక్ష కొర్రీలు పెడుతున్నారన్నారు. మొదట్లో రుణమాఫీకి రూ.39 వేల కోట్లు అని, ఇప్పుడు రూ.31 వేల కోట్లకు కుదించారని రాసుకొచ్చారు. పాసుబుక్కులు లేవనే నెపంతో లక్షల మందికి శఠగోపం పెట్టే కుటిల ప్రయత్నం చేస్తే సహించబోమనీ, రేషన్ కార్డును సాకు చూపితే వదలబోమని హెచ్చరించారు. ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారని కొంతమందికీ, చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారని ఇంకొంతమందికీ శూన్యహస్తాలు చూపితే సహించేదిలేదన్నారు. లక్షలాది మందిని రూ.500 సిలిండర్ పథకానికి దూరం చేశారనీ, 200 యూనిట్ల పథకానికి ఆంక్షలు పెట్టి ఆగమాగం చేశారని పేర్కొన్నారు. నాట్ల నాడు ఇవ్వాల్సిన రైతుబంధుకు ఇప్పటికీ దిక్కులేదనీ, ఎకరానికి రూ.7500 రైతు భరోసా అడ్రస్సే లేదని విమర్శించారు. రుణమాఫీపై మాట తప్పితే, లక్షలాది రైతు కుటుంబాల తరపున ప్రశ్నిస్తూ, పోరాడుతామని హెచ్చరించారు.