నిజమని నిరూపిస్తే ఇండిస్టీ వదిలేసి వెళ్ళిపోతా

నిజమని నిరూపిస్తే ఇండిస్టీ వదిలేసి వెళ్ళిపోతా– జానీ మాస్టర్‌
నత్య దర్శకుడిగా జానీ మాస్టర్‌ స్థాయి పాన్‌ ఇండియా లెవల్‌ సినిమాల వరకు వెళ్ళింది. తెలుగుతో పాటు తమిళ, హిందీ సినిమాల్లో పాటలకు ఆయన కొరియోగ్రఫీ చేస్తున్నారు. మరో వైపు తెలుగు ఫిల్మ్‌ అండ్‌ టీవీ డాన్సర్స్‌ అండ్‌ డాన్స్‌ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే… ఇటీవల సతీష్‌ అనే డ్యాన్సర్‌ జానీ మాస్టర్‌ మీద పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు ఒక వీడియో విడుదల చేశారు. అందులో పలు ఆరోపణలు చేశారు. అవి నిజమని నిరూపిస్తే తాను ఇండిస్టీ వదిలేసి వెళ్లిపోతానని జానీ మాస్టర్‌ చెప్పారు. ఈ వివాదం పూర్వాపరాలు వెల్లడించడానికి అసోసియేషన్‌ సభ్యులతో కలిసి సోమవారం మీడియాతో సమావేశమయ్యారు. జానీ మాస్టర్‌ మాట్లాడుతూ, ‘సతీష్‌ విషయానికి వస్తే… అయేషా చెప్పినవన్నీ నిజాలు. రూల్స్‌ ప్రకారం కమిటీ, కొరియోగ్రాఫర్లతో మాట్లాడి లక్ష రూపాయలు ఫైన్‌ విధించారు. సతీష్‌ తప్పు అయ్యిందని లెటర్‌ రాస్తే మొదటి తప్పుగా క్షమించి వదిలేసేవాళ్ళం. ఫైన్‌ వేసేవాళ్ళం కాదు. నేను ఏంటో చూపిస్తానని కొందరిని బెదిరించారు. అలాగే ఆయన ఒక వీడియో విడుదల చేశారు. అందులో ఒక్కటి నిజమైనా సరే నేను ఇండిస్టీ వదిలేసి వెళ్ళిపోతా’ అని చెప్పారు. ‘మాది 33 ఏళ్ల చరిత్ర ఉన్న అసోసియేషన్‌. దీనికి కొన్ని రూల్స్‌- రెగ్యులేషన్స్‌, బైలాస్‌ ఉన్నాయి. మా సభ్యుడు జీ సతీష్‌ మా నియమ నిబంధనలకు వ్యతిరేకంగా బయటకు వెళ్లి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. పోలీస్‌ కంప్లైంట్‌ ఇచ్చారు. అంతేకాదు మా సంఘంలో జరిగిన కొన్ని విషయాలు స్టేటస్‌లో పెట్టారు. అది వద్దని చెప్పినందుకు అసభ్య పదజాలం వాడారు. తర్వాత కమిటీ పిలిచినప్పుడు తప్పు చేశానని ఒప్పుకొన్నారు. జరిమానా కట్టి మళ్లీ పని చేసుకోవాలని సూచించాం. కానీ, ఆయన అందుకు అంగీకరించలేదు. జానీ మాస్టర్‌ కమిటీ వచ్చిన తర్వాత బైలాస్‌లో మార్పులు చేయలేదు. అంతకు ముందు ఉన్నదే ఫాలో అవుతున్నాం. ఆయన ఆరోపణలలో వాస్తవం లేదు’ అని ప్రధాన కార్యదర్శి శ్రీను దేవర చెప్పారు.