రెటీనాపై ఏదో
రెక్కలిప్పి వాలుతున్న దృశ్యం
చూపుల కాంతిపుంజాలనడ్డగిస్తూ
పొరలు పొరలుగా పాకుతున్న దృశ్యం
వెన్నెల వెలుగులను
చీకటి మబ్బేదో చెరబడుతున్న దృశ్యం
మెదడు సెన్సింగ్ న్యూరాన్లను
మార్మిక భ్రమ ఏదో మాయచేస్తున్న దృశ్యం
భావం అభావంగా ఏదో
మంచులా కరిగిస్తున్న దృశ్యం
వాస్తవావస్తవాల దృగ్విషయాలనేదో
తలకిందులు చేస్తున్న దృశ్యం
జనారణ్య చైతన్య దేహాలనేదో
శకలాలు శకలాలుగా నరుకుతున్న దృశ్యం
భయపీడన నిప్పుల జలపాతమేదో
నిలవెల్లా దహిస్తున్న దృశ్యం
పరిపాలన వక్రరేఖ ప్రాకారాల నడుమ
ప్రజాస్వామ్య గోపురమేదో తగులబడుతున్న దృశ్యం
రాక్షస రహస్యోన్మాద హింస ఏదో
రాజ్యాన్ని ఆక్రమిస్తున్న దృశ్యం
భావస్వేచ్ఛ పక్షినేదో
పవర్ గన్ను నేలగూల్చుతున్న దృశ్యం
గోడలేని జైలు ఏదో విస్తరిస్తూ
జనం గొంతు నొక్కుతున్న దృశ్యం
రాజ్యం రాజకీయ క్రీనీడలో
రాబందుల గుంపేదో తిరుగాడుతున్న దృశ్యం
సమిష్టి శ్రమ సంపద సౌధాలనేదో
సర్వం స్వాహా చేస్తున్న దృశ్యం
అంతటా అదే అదృశ్యంకాని దృశ్యం
అహం బ్రహ్మాస్మీ అంటూ
అన్నిటినీ కబళిస్తూ ఆక్టోపస్ లా
విస్తరిస్తున్న యదార్థ దృశ్యం
భయోత్పాత ప్రకంపనల మధ్య
బిగుసుకున్న పిడికిళ్లలో సూర్యరశ్మి
వేల వేల రూపాలలో ఇక విచ్చుకోక తప్పదు
విశృంఖల విధ్వంస విపత్తు దృశ్యమిక
భస్మీపటలమై అదృశ్యం కాకతప్పదు
– వేల్పుల నారాయణ
9440433475