రైతు భరోసా,  రుణమాఫీ పథకాలను అమలు పై మంత్రి వీడియో కాన్ఫరెన్స్ …

– జిల్లా వివరాలను మంత్రి వివరించిన కలెక్టర్ 
నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ 
రైతుల సలహాలు, సూచనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అందరికి ఆమోదయోగ్యంగా రైతు భరోసా, రుణమాఫీ పథకాలను అమలు చేయడం జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం నాడు హైదరాబాదు నుండి మంత్రి  రాష్ట్ర ప్లానింగ్ కమీషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, వ్యవసాయ కమిషన్ కోదండరెడ్డి, వ్యవసాయ శాఖ సెక్రటరీ రఘునందనరావు, సైంటిస్టులతో కలిసి రైతు వేదికలలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్సుల ద్వారా రైతులతో మూఖాముఖి కార్యక్రమంలో మాట్లాడారు.  రాజపేట మండల కేంద్రం రైతువేదిక నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ హనుమంతు కే జెండగే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రైతులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా, రుణమాఫీ పథకాలను చేపట్టబోతున్నందున వాటికి సంబంధించి రైతుల నుండి సలహాలు, సూచనలు స్వీకరించారు. పధకాల అమలుకు సంబంధించి రైతుల నుండి స్వీకరించిన సలహాలు, సూచనలను ప్రభుత్వానికి మెయిల్ రూపంలో వెంటనే పంపాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సైంటిస్టులు పంటల సాగు పట్ల రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు విశదీకరించారు. వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టరు హనుమంత్ కే జెండగే మాట్లాడుతూ  జిల్లాలోని అన్ని రైతు వేదికలలో వారం రోజుల లోపు వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని, రైతాంగానికి సైంటిస్టులతో, వ్యవసాయ అధికారులతో ముఖాముఖి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు, ఎంపిపి బాలమణి, ఎంపిటిసి  డి రాజు, యాదగిరిగట్టు డివిజన్ ఆత్మ చైర్మన్ వెంకటరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి అనూరాధ, ఉద్యానవన అధికారి సైదులు, ఎడి పద్మావతి, ఎంఎఓ మాధవి లు ఉన్నారు.