అమెరికా రాజకీయ క్రీడలో పావుగా దలైలామా!

అమెరికా రాజకీయ క్రీడలో పావుగా దలైలామా!ధర్మశాలలో ప్రవాస జీవితం గడుపుతున్న 88 ఏండ్ల దలైలామా మోకాలి చికిత్సకోసం అమెరికా వెళ్లారు. ఆ సందర్భంగా అక్కడ రాజకీయ నేతలతో చర్చలు జరుపుతారా లేదా అన్నది ఇంకా స్పష్టం కాలేదు. గతవారంలో అమెరికా పార్లమెంటు ప్రజాప్రతినిధుల సభ మాజీ స్పీకర్‌ నాన్సీ పెలోసి హిమచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో దలైలామాను కలిశారు.ఈ సందర్భంగానే ప్రధాని నరేంద్రమోడీ, విదేశాంగ మంత్రి జై శంకర్‌ను కూడా ఆమె నాయకత్వంలో వచ్చిన ఏడుగురు ఎంపీల బృందం భేటీ అయింది. ఇతర పని మీద భారత్‌ పర్యటనలో భాగంగా ఏదో ఇంతదూరం వచ్చాం కదా మర్యాద పూర్వకంగా అనుకుంటే దలైలామాను కలవటం పెద్ద వార్తే కాదు.రావటమే కాదు,నేను చైనాను విమర్శిస్తే అది దలైలామాకు అంగీకారం కాదని తెలిసినా అంటూ అక్కడే చైనా అధినేత షీ జిన్‌పింగ్‌ మీద ధ్వజమెత్తింది. అందుకే ఇది పక్కా రాజకీయ, చైనా వ్యతిరేక పర్యటనే అనటంలో ఎలాంటి సందేహంలేదు. దలైలామా వారసత్వం ఎప్పటికీ ఉండిపోతుంది, కానీ చైనా అధ్యక్షపదవిలో ఉన్న మీరు శాశ్వతంగా ఉండరు,ఎవరూ, దేనికీ మిమ్మల్ని గుర్తుంచుకోరు అంటూ నాన్సీ పెలోసి నోరుపారవేసుకుంది. దలైలామాతో చైనా ప్రభుత్వం సంప్రదింపులు జరపాలని కూడా చెప్పింది.
ఈ పరిణామం మీద మన విదేశాంగశాఖ ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ మాట్లాడుతూ భారత వైఖరిలో ఎలాంటి మార్పులేదు, స్థిరంగా ఉందని చెప్పారు.మనదేశంలో మతపరమైన,ఆధ్యాత్మిక కార్యకలాపాలు నిర్వహించేందుకు మాత్రమే దలైలామాకు ఆశ్రయం కల్పించినట్లు చెప్పారు. నాన్సీ పెలోసీ చేసిన రాజకీయ వ్యాఖ్యలకు-మన ప్రభుత్వానికి సంబంధం లేదని, వాటి గురించి మీరు అమెరికానే ప్రశ్నించాలని విలేకర్లతో చెప్పారు. ధర్మశాలలో ఉందని చెబుతున్న టిబెట్‌ ప్రవాస ప్రభుత్వం ఒక వేర్పాటువాద రాజకీయ సంస్థ, చైనా రాజ్యాంగం, చట్టాల ప్రకారం అది చట్టవిరుద్దం, ఆ సంస్థకు ప్రపంచంలో ఎలాంటి గుర్తింపు లేదు, ఇక దలైలామాతో సంప్రదింపులు, మాటల విషయానికి వస్తే అది చైనా ప్రభుత్వం-పద్నాలుగవ దలైలామాకు సంబంధించిన వ్యవహారం అన్నది ఎప్పుటి నుంచో మేము చెబుతున్నాం అని చైనా స్పందించింది. ఈ సందర్భంగా కొన్ని అభిప్రాయాలు, వక్రీకరణలు, భాష్యాలు వెలువడ్డాయి.టిబెటన్ల హక్కుల పేరుతో గత కొన్ని దశాబ్దాలుగా అమెరికా ఆడుతున్న నాటకం తెలిసిందే. అమెరికా, దానికి తాన తందాన పలికే దేశాలు చెబుతున్నదాని ప్రకారం టిబెట్‌ ఒక స్వతంత్ర దేశం, కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చాక దాన్ని చైనా ఆక్రమించింది. కనుక టిబెటన్ల హక్కును పరిరక్షించాలి అంటూ వేర్పాటువాదాన్ని సమర్ధిస్తున్నది.మనదేశంలో బ్రిటీష్‌ ప్రభుత్వానికి లోబడిన సామంత రాజరిక సంస్థానాల మాదిరే చైనాలో రాజరిక కాలంలో టిబెట్‌ కూడా అలాంటిదే.చైనాకు స్వాతంత్య్రం వచ్చిన తరువాత చైనా ప్రభుత్వానికి లోబడిన ఒక స్వయం పాలిత ప్రాంతంగా ఉంది, దాని అధిపతిగా దలైలామా కొనసాగాడు.
చైనా కమ్యూనిస్టు పార్టీ లాంగ్‌ మార్చ్‌ లేదా విప్లవపోరాట కాలంలో అధికారంలో ఉన్న చాంగ్‌కై షేక్‌ ప్రభుత్వం కూలిపోవటం తధ్యమని గ్రహించిన అమెరికా, బ్రిటన్‌ సామ్రాజ్యవాదులు ఒక వ్యూహం ప్రకారం నాడు ఫార్మోజా దీవిగా నేడు తైవాన్‌గా పిలుస్తున్న ప్రాంతానికి మిలిటరీ, ఆయుధాలను తరలించి అక్కడే తిష్టవేయించింది. చైనా రాజులు ఆ దీవిని 1895లో జపాన్‌కు ధారాదత్తం చేశారు. రెండవ ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన తరువాత 1945లో దాన్ని తిరిగి చైనా ప్రభుత్వానికి అప్పగించారు. మిగతా ప్రధాన ప్రాంతంలో కమ్యూనిస్టులు కేంద్రీకరించి తరువాత తైవాన్‌ సంగతి చూద్దాం లెమ్మని భావించారు.తరువాత అనేక కారణాలతో స్వాధీనం చేసుకోలేదు. ఈ లోగా అమెరికా, ఇతర దేశాలు తైవాన్‌ పాలకులకు భారీ ఎత్తున ఆయుధాలు ఇచ్చి ఒక దేశం మాదిరి తయారు చేశారు. దాన్నే అసలైనా చైనాగా భద్రతా మండలిలో గుర్తించారు. 1970 దశకంలో అనివార్య స్థితిలో ఐక్యరాజ్యసమితి ఆమోదించిన తీర్మానం ప్రకారం చైనా అంటే తైవాన్‌తో కూడిన ప్రాంతం తప్ప రెండు చైనాలు లేవు. దీనికి అమెరికా కూడా అంగీకరించింది. అయితే శాంతియుతంగా విలీనం జరగాలంటూ కొత్త నాటకం ప్రారంభించింది. బలవంతంగా ఆక్రమించేందుకు చైనా పూనుకుంటే తాము సహించేది లేదని అమెరికా అంటున్నది. తైవాన్‌ వ్యవహారాలను చూసేందుకు ఏ ఒక్క దేశా నికీ భద్రతా మండలి అనుమతి ఇవ్వలేదు. తనకు తానే రక్షకురాలిగా అమెరికా ప్రకటించు కుంది. ఆధునిక ఆయుధాలన్నీ ఇచ్చి ఎదురు దాడులకు కూడా అనుగుణంగా తయారు చేస్తున్నది.
ఇక టిబెట్‌ విషయానికి వస్తే కమ్యూనిస్టు పార్టీ, ప్రభుత్వం కూడా ముందుజాగ్రత్తతో వ్యవహించి సామ్రాజ్యవాదుల కుట్రలను వమ్ముచేసింది. మతం, దలైలామా పేరుతో జరిపిన తిరుగుబాటును అణచివేసింది. టిబెట్‌లో తిరుగుబాటు చేసేందుకు పూనుకున్న వేర్పాటు వాదులకు సిఐఏ అనేక చోట్ల రహస్యంగా సాయుధ శిక్షణ, పెద్ద మొత్తంలో నిధులు అందచేసింది. చైనా కమ్యూనిస్టు పార్టీ 1949లో అధికారానికి వచ్చిన తరువాత ”ఇంకేముంది మనం చైనాను నష్టపోయాం, మన అదుపునుంచి పోయింది, మనకు కొత్త విరోధి ఉనికిలోకి వచ్చింది” అన్నట్లుగా అమెరికా పాలకవర్గం భావించింది. విప్లవ కాలంలోనే చైనాలో కమ్యూనిస్టు పార్టీని అడ్డుకోవటంలో విఫలం కావటం గురించి అది బెంగపెట్టుకుంది. ఇరాన్‌లో అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు1953లో మహమ్మద్‌ మొసాద్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు చేసిన ఖర్చుతో పోలిస్తే సిఐఏ 1949-51కాలంలో ఇరవై రెట్లు మొత్తాన్ని చైనా కోసం వెచ్చించింది.రహస్య కార్యకలాపాలకు పది రెట్లు సిబ్బందిని పెట్టింది.కార్యస్థానంగా టిబెట్‌ను ఎంచుకుంది.చరిత్రను చూస్తే టిబెట్‌ ప్రాంతంలో చైనా రాజులకు సామంత రాజ్యంగా ఉంది తప్ప స్వతంత్రదేశం కాదు.1912లో క్వింగ్‌ రాజరిక వ్యవస్థకూలిపోయిన మరుసటి ఏడాది పదమూడవ దలైలామా తమకు స్వాతంత్య్రం కావాలని ప్రకటించాడు.చైనా ఆశీస్సులతో నిమిత్తం లేకుండా ఆధ్యాత్మిక, రాజకీయ అధికారాన్ని చెలాయిస్తానని చెప్పుకున్నాడు.దాన్ని చైనా ప్రభుత్వం ఆమోదించలేదు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత టిబెట్‌ను పూర్తిగా చైనాలో విలీనం చేసేందుకు చూస్తున్నట్లు 1941డిసెంబరు 20వ తేదీ డైరీలో నాటి ప్రధానిగా ఉన్న చాంగ్‌కై షేక్‌ రాశాడు.
కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత ముందే చెప్పుకున్నట్లు సిఐఏ రంగంలోకి దిగింది. దీన్ని పసిగట్టిన మావో జెడాంగ్‌ ముందు జాగ్రత్త చర్యగా 1950లో అక్కడికి 40వేల మంది మిలిటరీని పంపాడు.దీంతో పాటు చైనాతో అనుసంధానం చేసేందుకు చర్యలు తీసుకున్నాడు. అదే ఏడాది అక్టోబరు 6-24వ తేదీల మధ్య తూర్పు టిబెట్‌లో తిరుగుబాటుకు తెరతీసిన వేర్పాటువాదులను చామడో పోరులో మిలిటరీ అణచివేసింది, మూడు వేల మందిని బందీలుగా పట్టుకుంది. టిబెట్‌ పౌరుల మీద ఎలాంటి దాడులు జరపలేదు. ప్రస్తుతం మనదేశంలో ఉన్న 14వ దలైలామా టెంజిన్‌ జియాస్టో ఆ పరిణామం తరువాత తాను క్రమశిక్షణతో మెలుగుతానని ప్రకటించాడు. కాశ్మీరు, హైదరాబాదు సంస్థానాలను మనదేశంలో విలీనం చేసినట్లుగానే టిబెట్‌ సంస్థానాన్ని చైనా 1951 మే నెలలో విలీనం చేసింది. టిబెట్‌ రాజకీయం చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి రావటానికంటే ముందే మొదలైంది.మన దేశం తొలిసారిగా ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం టిబెట్‌తోనే మొదలైంది.చైనా మిలిటరీ చర్య గర్హనీయమని, అది చైనా ప్రయోజనాలకు, శాంతికి కూడా దోహదం చేయదని నాటి నెహ్రూ ప్రభుత్వం ప్రకటించింది. దీనికి వెంటనే అమెరికా, బ్రిటన్‌ తదితర ఆ గుంపు దేశాలు కూడా మద్దతు ఇచ్చాయి.
దలైలామాకు 1940 దశకంలోనే సిఐఏతో సంబంధాలు, నిధుల అందచేత ఉన్నట్లు తరువాత వెల్లడైంది. అమెరికాలోని కొలరాడోలో టిబెట్‌ తిరుగుబాటుదార్లకు శిక్షణ ఇచ్చింది. వారిని అక్కడికి విమానాల్లో తరలించి తరువాత తిరిగి టిబెట్‌కు చేర్చింది. ఆయుధాలను ఇచ్చింది. అలాంటి వారి నాయకత్వంలో 1956లో తూర్పు టిబెట్‌లో రెండు చోట్ల తిరుగుబాటును ప్రకటించారు. దలైలామా అన్న గయాలో తోండప్‌ 1951లో అమెరికా వెళ్లాడు. అక్కడే ఉండి ఎప్పటికప్పుడు చైనా, టిబెట్‌లో పరిస్థితుల గురించి అక్కడ ఎందరు సైనికులు ఉన్నదీ మొదలైన సమాచారాన్ని అందచేసేవాడు. దానికి ప్రతిగా చైనాకు వ్యతిరేకంగా తమకు సాయం చేయాలని కోరాడు. అందుకోసం భారత్‌, నేపాల్‌లో అమెరికా శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసింది. జపాన్‌లోని ఒకినావా, మైక్రోనేసియా ప్రాంతంలోని ఫసిపిక్‌ దీవుల్లో అమెరికా ఆధీనంలో ఉన్న గువామ్‌లో టిబెటన్లకు శిక్షణ ఇచ్చారు. ఢిల్లీలో సిఐఏ-మనదేశ సంస్థ కలసి ఒక కేంద్రాన్ని కూడా నడిపినట్లు తరువాత వెల్లడైంది. ఆపరేషన్‌ ఎస్‌టి సర్కస్‌ పేరుతో ఒక పధకాన్ని రూపొందించి 1959లో దలైలామా సోదరుడి నాయకత్వంలో గెరిల్లా తిరుగుబాటు ప్రారంభించారు. అయితే దాన్ని చైనా మిలిటరీ రెండు వారాల్లోనే అణచివేసింది. లాసా నుంచి పారిపోయిన దలైలామా నాటి భారత ప్రభుత్వ సహకారంతో నేటి అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌ ప్రాంతం ద్వారా మనదేశానికి 1959 మార్చి 31న వచ్చాడు. ధర్మశాలలో కేంద్ర ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలతో కాందిశీకుల పేరుతో ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. తరువాత తాను వైదొలిగి ఇతరులకు అప్పగించాడు. ఈ ప్రభుత్వాన్ని మనదేశం గుర్తించనప్పటికీ నాటి నుంచి నేటి వరకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నది. అమెరికా విదేశాంగశాఖ 1998లో వెల్లడించిన పత్రాలలో ఉన్న సమాచారం మేరకు దలైలామా 1970దశకం మధ్య వరకు ఏటా లక్షా 80వేల డాలర్లను అమెరికా సిఐఏ నుంచి పొందినట్లు ఉంది. ఇప్పటికీ అమెరికా మద్దతు కొనసాగుతోంది. నాన్సీ పెలోసీ గుంపు పర్యటన అదే.
దలైలామాతో చర్చలు జరపాలని చైనాను డిమాండ్‌ చేసే హక్కు అమెరికాకు లేదు. తాను చేసిన చట్టాలు, లేదా అవగాహన ప్రకారం బిన్‌లాడెన్‌ లాంటి కొంత మందిని ఉగ్రవాదులుగా ప్రకటించింది. అలాంటి వారితో ఎవరైనా చర్చలు జరపాలని కోరితే అంగీకరిస్తుందా? చైనా దృష్టిలో తిరుగుబాటు చేసిన దలైలామా వేర్పాటువాది. అలాంటి వారితో చర్చలు జరిపేది లేదని గతంలోనే ప్రకటించింది.దలైలామా ఒక్క మతనాయకుడే కాదు, ప్రవాసంలో ఉన్న రాజకీయవాది కూడా అని తాజాగా స్పష్టం చేసింది. అతగాడి వైఖరిలో మార్పు లేదు. ఇప్పుడు దలైలామాకు వృద్ధాప్యం వచ్చింది. తదుపరి వారసుడు ఎవరన్నది తేలాల్సి ఉంది. తన వారసుడు భారత్‌లో ఉన్నట్లు దలైలామా చెబుతున్నారు. కొత్త దలైలామాను తాము ఆమోదించా ల్సిందేనని చైనా అంటున్నది.జూన్‌ పన్నెండున అమెరికా పార్లమెంటు టిబెట్‌-చైనా వివాద బిల్లును ఆమోదించింది. అధ్యక్షుడు ఆమోదిస్తే చట్టం అవుతుంది. అది ఉభయ దేశాల సంబంధాల మీద ప్రభావం చూపుతుంది గనుక అలాంటి పనికి పూనుకోవద్దని చైనా హితవు పలికింది. పురాతన కాలం నుంచి చైనాలో టిబెట్‌ భాగం కాదని దానిలో పేర్కొన్నారు. అసలు అలాంటి చట్టం చేసే అధికారం అమెరికా పార్లమెంటుకు ఎవరిచ్చారు. దలైలామా గురించి ప్రపంచంలో ఆసక్తి తగ్గిపోతున్న తరుణంలో అమెరికా ఈ పనిచేసింది.
ఎం కోటేశ్వరరావు
8331013288