గుణాత్మక విద్యయే ప్రభుత్వ టీచర్ల పనితీరుకు కొలమానం

– ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థులను మంచి స్థానంలో ఉంచేందుకు కృషి చేయాలి 
– పాఠశాల ద్వారా క్రమశిక్షణను అలవాటు చేయాలి
– జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి 
నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్ : అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టిన పనులను జూలై 1 లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టర్ కార్యాలయం నుండి విద్యాశాఖ కార్యక్రమాలపై విద్యాశాఖ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వయం సహాయక మహిళా సంఘాలకు విద్యార్థుల యూనిఫామ్ కుట్టే బాధ్యతను అప్పజెప్పడం జరిగిందని, రెండవ జత నాణ్యతతో  పద్ధతి ప్రకారం స్వయం సహాయక సంఘాలు అప్పగించాలని అన్నారు. హెడ్మాస్టర్లు గ్రామస్థాయిలో గ్రామపంచాయతీ బృందంతో కలిసి పని చేయాలని ఆదేశించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు విద్యశాఖ సమీక్షలో మొదటి అంశంగా తీసుకోవడం జరుగుతుందని, అందువల్ల ఉపాధ్యాయులు పాఠశాలలకు నిర్దేశించిన సమయం ప్రకారం హాజరుకావాలని, ముందస్తు సెలవు లేకుండా ఎట్టి పరిస్థితులలో విధులకు గైర్హాజరు కారాదని, ఒకవేళ గైర్హాజరైతే సస్పెండ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు.ఉపాధ్యాయులు  పాఠశాలకు ఆలస్యంగా వచ్చిన, లేదా పాఠశాల సమయానికంటే ముందే వెళ్లిపోయినా సంబంధిత ప్రధాన ఉపాధ్యాయులదే బాధ్యతని అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల పనులలో భాగంగా పనుల కోసం అడ్వాన్సులు సైతం ఇవ్వడం జరిగిందని, ఈ విషయంపై అందరూ హెడ్మాస్టర్లు, సంబంధిత అసిస్టెంట్ ఇంజనీర్లు, అమ్మ ఆదర్శ పాఠశాలకమిటీలు దృష్టి సారించి జూలై 1 నాటికి పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో పిల్లలు మంచి స్థానంలో ఉండేలా టీచర్లు కృషి చేయాలని అన్నారు. విద్యార్థుల ఫలితాలే ఉపాధ్యాయుల పనితీరుకు  గీటురాయి అని, ప్రత్యేకించి జిల్లాలో పదవ తరగతిలో మంచి ఫలితాలు వచ్చేందుకు కృషి చేయాలని అన్నారు.మధ్యాహ్న భోజన పథకం నాణ్యతగా ఉండేలా చూడాలని, అన్ని పాఠశాలల్లో పరిశుభ్రతతో పాటు, పాఠశాలలో తాగునీరు, విద్యుత్, టాయిలెట్స్ అన్ని పరిశీలించి ఏవైనా చిన్న చిన్న లోపాలున్నట్లయితే సరి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులు ఆదేశించారు. స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ టి.పూర్ణ చంద్ర మాట్లాడుతూ జూలై 1 నాటికి  అమ్మ ఆదర్శపాఠశాల పనులన్నిటిని పూర్తిచేయాలని, పాఠశాలలకు సంబంధించిన ఆస్తులను  సంరక్షింక్షే బాధ్యత హెడ్మాస్టర్ లపై ఉందని తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి, డిపిఓ మురళి, మిషన్ భగీరథ  పర్యవేక్షక ఇంజనీర్ వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భూమన్న, టీఎస్ ఎంఐడిసి ఇంజనీర్లు, జిల్లా కేంద్రంలో హాజరుకాగా, అన్ని మండలాల నుండి ఎంఈఓ లు, ఇంజనీరింగ్ అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.