– సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్
– కలక్టరేట్ ఎదుట ధర్నా
నవతెలంగాణ-ఆసిఫాబాద్
మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజేందర్, ముంజం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బుధవారం కార్మికులతో కలిసి కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి కలెక్టర్ వెంకటేష్ ధోత్రేకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపాలిటీ గ్రామపంచాయతీలో పనిచేసే కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కనీస వేతనం రూ.26 వేలతో పాటు ఉద్యోగ భద్రత, ఇతర సమస్యలు పరిష్కరించాలన్నారు. సిబ్బందికి ఐదు నెలల నుండి పెండింగ్‌లో ఉన్న జీతాలు చెల్లించాలన్నారు. కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో ఈఎస్‌ఐ బకాయిలు రూ.రెండు కోట్లు ఉన్నాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో 34 రోజులు చేసిన సమ్మెలో భాగంగా ప్రభుత్వం కార్మికులు మరణిస్తే రూ.ఐదు లక్షల ఇన్సూరెన్స్‌తో పాటు దహన సంస్కారాలకు రూ.10000 చెల్లిస్తామని చెప్పి సర్కులర్ కూడా విడుదల చేసిందని, దానిని అమలు చేయలేదని ప్రస్తుత ప్రభుత్వం అమలు దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే భవిష్యత్తులో ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఇందులో సీఐటీయూ జిల్లా నాయకులు కృష్ణమాచారి, గ్రామపంచాయతీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు మోరేశ్వర్, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, ఆసిఫాబాద్ మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షుడు మాట్ల రాజు, కాగజ్ నగర్ మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శంకర్, సంజీవ్, కార్మికులు మల్లేష్, రమేష్, శంకరమ్మ, శోభ, రమ పాల్గొన్నారు.