హెలెన్ కెల్లర్ అంధులకు, బధిరులకు వారధిగా, వికలాం గుల ఉద్యమాల సారథిగా నిలిచి ప్రపంచంలో ఎందరికో స్ఫూర్తి నింపారు. చిన్నతనంలోనే పెద్ద జబ్బు చేసి, చూపు, వినికిడి, మాట పోగొట్టుకొని పూర్తి వికలాంగురాలైన హెలెన్ కెల్లర్ ప్రపంచాన్ని చూడలేదు. ప్రపంచంలో జరుగు తున్న పరిణామాలను తెలుసుకొనే అవకాశం లేదామెకు. కానీ, అవయవాలు సక్రమంగా ఉన్నవారందరి కంటే మహోన్నత స్థాయిలో నిలిచి పట్టుదలతో సాధించలేనిది ఏదీ లేదని తన జీవితం ద్వారా నిరూపించారు. ప్రపంచ పౌరులందరికీ ఆదర్శవంతమైన సార్థక సేవా విదుషీమణిగా వన్నెకెక్కారు.
వికలాంగుల కోసమే కాకుండా మహిళల హక్కుల గురించి పత్రిక రచనలు చేసి, స్వయంగా ఉద్యమాలు నడిపిన ధీశాలి హెలెన్ కెల్లర్. 22 ఏళ్ల వయసులోనే ”ది స్టోరీ ఆఫ్ మై లైఫ్” గ్రంథ రచనతో మొదలెట్టి 14 పుస్తకాలు తీసుకొచ్చారు. వందలాది వ్యాసాలు రాశారు. వైకల్యానికి, అంధత్వానికీ మూలం పేదరికమనీ అది లేని సమాజ స్థాపన ద్వారా వికలాంగుల సమస్యల పరిష్కారం సాధ్యమనీ, సమ సమాజ స్థాపన ద్వారానే సాధ్యమనీ ధృడంగా విశ్వసించిన మానవతా మూర్తి హెలెన్ కెల్లర్.
హెలెన్ ఆడమ్స్ కెల్లర్ (జూన్ 27, 1880-జూన్ 1, 1968) అమెరికాలోని అలబామా రాష్ట్రంలోని టస్కాంబియా పట్టణంలో జన్మించారు. పుట్టుకతో వైకల్యం లేనప్పటికి 19 నెలల వయసులో స్కార్లేట్ ఫివర్ (మెనింజైటిస్ వ్యాధి) వలన చూపు, వినికిడి శక్తిని కోల్పోయి వికలాంగురాలిగా మారారు. హెలెన్ కెల్లర్‌లోని సాధారణ తెలివితేటలకు, ఇతర అవయవాలకు, ఆరోగ్యానికి ఎలాంటి లోపం రాలేదు. మూడేండ్ల వయసులో ఉన్నప్పుడు ఒక రోజు గది వెచ్చదనం కోసం ఉంచిన పొయ్యి దగ్గరకు చేరుకోవడంతో ఆమె బట్టలు అంటుకొని కనుబొమలు, జుట్టు, నుదురు కాలాయి. ఈ సంఘటనతో చలించిపోయిన తల్లిదండ్రులు మరింత దిగులుపడ్డారు. బాల్టమోర్ పట్టణంలోని ప్రఖ్యాత నేత్ర వైద్యున్ని సంప్రదించగా..చూపు వచ్చే అవకాశం లేదు గానీ, మెదడులోని నరాలన్నీ చాలా చురుకుగా పనిచేస్తున్నాయని సూచించి వాషింగ్టన్ లోని అలెగ్జాండర్ గ్రాహంబెల్ దగ్గరకు తీసుకెళ్లమని సలహా ఇచ్చారు.ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త అలెగ్జాండర్ గ్రాహంబెల్ భార్యకు భయంకరమైన చెముడు. ఆమెకు మాటలు నేర్పే పట్టుదల, అవిరామ ప్రయత్నాల ఫలితమే టెలిఫోన్ ఆవిష్కరణ. గ్రాహంబెల్ సలహాతో అంధులకు విద్య నేర్పే ”పెర్కిన్స్ ఇన్‌స్టిట్యూట్” యాజమాన్యాన్ని (బోస్టన్) కెల్లర్ తండ్రి అభ్యర్థించాడు. హెలెన్ కెల్లర్‌కు చదువు చెప్పేందుకు అధ్యాపకురాలిని ఒప్పించి ఇంటి దగ్గరే విద్య నేర్పేందుకు పంపమని అభర్థించారు. పెర్కిన్స్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రపంచం లోకెల్లా మొదటిసారిగా బధిరులు, అంధులు మాట్లాడుకోవడం, రాయడం నేర్చుకున్న మొదటి వ్యక్తి లారా బ్రిడ్జియన్. పెర్కిన్స్ స్కూల్ ఫర్ ది బ్లైండ్‌లో హెలెన్ కెల్లర్‌కు జీవితకాల ఉపాధ్యాయు రాలిగా అన్నె సలీవాన్‌ను నియమితు రాలయ్యారు.
బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అంధుల సేవకు అంకితమైన సలీవాన్ అధ్యాపకురాలిగా నియమితమవడం ప్రపంచ వికలాంగుల చరిత్రలో ఒక మైలురాయి లాంటిది. దృష్టి లేని జీవితం వృధా అని భావించే సమాజానికి వెలుగులు నింపే క్రాంతి కిరణాలను అందించింది. జ్ఞానేంద్రియాలలో ముఖ్యమైన మూడూ లోపించిన కెల్లర్ విద్య నేర్చుకుంటారని ఎవరూ ఊహించలేదు కానీ అన్నె సలీవాన్ సాధ్యం చేశారు. బొమ్మను చేతికి ఇస్తే సూక్ష్మగ్రాహి అయిన కెల్లర్ వెంటనే ఆమె చేతి మీద ‘డాల్’ (బొమ్మ) అని తిరిగి రాసింది. కెల్లర్ తన జీవితంలో నేర్చుకున్న మొదటి పదమూ ఇదే. ఎ.బి.సి.డి లను చేతి మీద రాసి చూపడం ప్రారంభమైన తర్వాత కెల్లర్ అచంచలమైన ఆత్మ విశ్వాసంతో టీచర్ బోధనలను అర్ధం చేసుకొని నిరంతరం సాధన చేశారు. ప్రతి వస్తువు పేరును హెలెన్ కెల్లర్ అరచేతిపై రాయడం వలన అక్షరాలను తడిమి చూసి గుర్తుపట్టేవారు. ఒకసారి కరచలనం చేస్తే ఆ స్పర్శ ద్వారా ఆ వ్యక్తిని చాలా కాలం తరువాత కూడా గుర్తుపట్టేవారు. భారతదేశం వచ్చిన సందర్భంలో ఎం.ఎస్.సుబ్బులక్ష్మి గళంలోని సంగీత మాధుర్యాన్ని, ఈమె తన చేతి వేళ్ళ ద్వారా ఆమె గొంతును తాకుతూనే నిర్థారించగలిగారు. మనిషి నడుస్తున్నప్పుడు సహజంగా ఏర్పడే భూప్రకంపనాల తారతమ్యాలను అనుసరించి ఆ వ్యక్తి సహజ స్వభావాన్ని అంచనా వేసేవారు. ఈ తరహాలో అనేక అద్భుత మానసిక శక్తులతో ప్రపంచ దేశాలన్నిటినీ ఆకట్టుకొని, వికలాంగుల సేవా కేంద్రాలను నెలకొల్పేందుకు కృషి చేశారు. ఇవన్నీ హెలెన్ కెల్లర్ గొప్ప మేధో శక్తికి నిదర్శనాలు.
తన జీవితాన్ని అంధుల సేవకు స్వచ్ఛందంగా అర్పించుకొని, అమెరికన్ ఫౌండేషన్ ఫర్ ద బ్లైండ్ సంస్థను స్థాపించి, దాని నిధి సేకరణకు ప్రపంచ వ్యాప్తంగా పర్యటించారు. సమావేశాలు, సదస్సులను నిర్వహించారు. భారీ స్థాయిలో నిధులు సేకరించి వికలాంగుల సంక్షేమం కోసం కృషి చేశారు. వికలాంగులను దయాదాక్షిణ్యాలతో పోషించటం కాదని వారు స్వశక్తితో నిలబడేందుకు అవకాశాలు కల్పించి వారిలో ఆత్మవిశ్వాసం, మనో నిబ్బరం కల్పించడమే పరిష్కారమని కెల్లర్ ప్రగాఢంగా విశ్వసించారు. అంతేగాక సార్థక సేవా దృక్పధానికీ బీజం వేశారు. అమెరికా, ఇంగ్లాండ్, స్వీడన్ వంటి అనేకానేక దేశాలలో ఈమె పేరు మీద నెలకొల్పిన సేవా కేంద్రాలు నేటికీ కొనసాగుతున్నాయి. 1902లో ప్రారంభించిన రచనా వ్యాసాంగాన్ని, జీవిత పర్యంతం కొనసాగించారు. ‘ద స్టోరీ ఆఫ్ ద డార్క్‌నెస్’ అనంతరం ‘మై రెలిజియన్, ద వరల్డ్ ఐ లివ్ ఇన్, అవుట్ ఆఫ్ ద డార్క్‌నెస్, ద ఓపెన్ డోర్, ద సాంగ్ ఆఫ్ ద స్టోరీ వెల్’ మొదలైన రచనలను వెలువరించారు. ఈమె జీవిత కథను ఆధారం చేసుకుని పలువురు డాక్యుమెంటరీ చిత్రాలు రూపొందించారు. ఆస్కార్ అవార్డు (1955) కూడా లభించింది.
అమెరికా దేశపు అత్యున్నత అవార్డు ”ద ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్”, పిలిప్పీన్స్ దేశపు ”గోల్డెన్ హార్ట్” అవార్డు, లెబనాన్ దేశపు ”ఆర్డర్ ఆఫ్ క్రాస్” అవార్డు, జపాన్ ప్రభుత్వం వారి ”సీక్రెట్ ట్రెజర్” అవార్డు పొందారు హెలెన్ కెల్లర్. బ్రెజిల్ దేశపు ఆర్డర్ ఆఫ్ క్రాస్ అవార్డు అందు కున్నారు. ప్రపంచంలోని పలు ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలలో డాక్టరేట్లు పొందారు. ఫ్రెంచ్ జాతీయ వికలాంగుల సంస్థ గౌరవ సభ్యురాలిగా కొనసాగారు. హెలెన్ కెల్లర్ జీవితాంతం తన శక్తి సామర్థ్యాలను వికలాంగులు, మహిళల అభివృద్ధి కోసం అంకితం చేశారు. మహిళలు, వికలాంగుల హక్కుల పరిరక్షణ కోసం, కార్మికులు వారి హక్కు లు, మెరుగైన సౌకర్యాల సాధన కోసం చేస్తున్న పోరాటాలలో పాల్గొంటూ ‘అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్’ స్థాపించడంలో ముందు భాగాన నిలిచారు. శ్వేత జాతీయుల ఆధిపత్యం, హత్యలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ‘నేషనల్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ కలర్డ్ పీపుల్’ సంస్థలకు అండగా నిలిచారు.
(నేడు హెలెన్ కెల్లర్ 144వ జయంతి)
ఎం.అడివయ్య
9490098713