పామాయిల్‌ రైతులను పట్టించుకోరా..?

పామాయిల్‌ రైతులను పట్టించుకోరా..?తెలంగాణ రాష్ట్రంలో అధికంగా సాగయ్యే పంటలు వరి, పత్తి, మొక్కజొన్న, పప్పుధాన్యాలు, నూనెగింజలు. ఆ తర్వాత వాటిస్థాయిలో కాకున్నా ఒక మోతాదులో సాగుచేస్తున్న పంట ఏదైనా ఉందంటే పామాయిల్‌. ప్రస్తుతం వంట నూనెల్లో అన్నిటికన్నా తక్కువ ధర కలిగిన నూనె పామాయిల్‌. దీన్ని మానవ అవసరాలతో పాటు పారిశ్రామిక ఉపయోగం కోసం కూడా వాడుతున్నారు. మన రాష్ట్రంలో రెండు లక్షల ఎకరాల్లో పామాయిల్‌ సాగు చేస్తున్నారు. అయితే ఈ పంటను నాలుగేండ్ల పాటు కంటికి రెప్పలా కాపాడుకుంటే తప్ప చేతికందదు. ఆ తర్వాత ఏడాదికోసారి దిగుబడి వచ్చినప్పటికీ మొక్కల నుంచి మొదలుకుని అవి చెట్లుగా పెరిగి గెలలు వేసేవరకు రైతు శ్రమ మాత్రం అధికమనే చెప్పాలి. ఇప్పటివరకు పామాయిల్‌ సాగును ప్రభు త్వాలు పెద్దగా పట్టించుకున్న పరిస్థితి లేదు. గత ప్రభుత్వం పామాయిల్‌ వైపు రైతులను ప్రోత్సహించాలనే ఆయిల్‌ఫెడ్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి రూ.670కోట్లు కేటాయించింది. కానీ అందులో రూ.380 కోట్లు మాత్రమే ఖర్చుచేసింది. ఫలితంగా రైతులకు రాయితీలివ్వడంలో నిర్లక్ష్యం చేసింది. దీంతో మొదటి ఏడాది సాగు కోసం సర్కార్‌ పంపిణీ చేసిన మొక్కల్ని మాత్రమే రైతులు నాటాల్సి వచ్చింది. కానీ వాటి ఎదుగుదలకు, నాలుగేండ్ల దిగుబడి కోసం చేయాల్సిన ఆర్థిక సహకారం అందివ్వకపోవడంతో సాగు భారమంతా రైతులు సొంతంగానే మోయాల్సి వస్తున్నది.
భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐసిఎఆర్‌) ప్రకారం పామాయిల్‌ సాగులో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉండగా తెలంగాణ ద్వితీయ స్థానంలో ఉంది. ఈ పంట జీవితకాలం 25 నుంచి 30 ఏండ్లు. మొదటి నాలుగేండ్లు ఆదాయమే ఉండదు.అందుకే రైతుకి ఆర్థిక మద్దతు అవసరం.ఈ నాలుగేండ్లలో అంతర పంటలు వేయడానికి కావలసిన సమాచారం అధికార యంత్రాంగం చేయాల్సిన ఉన్నప్పటికీ వారు పట్టించుకోవడం లేదు. మన రాష్ట్రంలో సాగయ్యే రెండు లక్షల ఎకరాల్లో సుమారుగా లక్షా 30వేల ఎకరాలు పామాయిల్‌ ఉత్పత్తి అవుతున్నది. పామాయిల్‌ అనేది ఇతర నూనెలు ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే కేవలం ఆరు శాతం భూమిలో 40శాతం నూనెను పామాయిల్‌ ఉత్పత్తి చేస్తుంది.ఆముదము, పొద్దు తిరుగుడు, నువ్వులు, వేరుశనగ వంటి పంటల ఉత్పత్తులు సరైన దిగుబడి లేకపోవడంతో సాగు ఏడాదికేడాది తగ్గుతూ వస్తున్నది వాస్తవం. ఇదే భూమిలో సోయాబీన్‌, పొద్దుతిరుగుడు, నువ్వుల నూనె వంటి ప్రత్యామ్నాయ నూనెలను పొందటానికి నాలుగు నుంచి పది రెట్లు ఎక్కువ భూమి అవసరం. అందువల్ల ఎక్కువగా రైతులు పామా యిల్‌ వైపు దృష్టి పెడుతున్నారు. కానీ ఈ సాగుకు కావాల్సిన సహకారం ప్రభుత్వాల నుంచి అందడం లేదు.
130 కోట్ల జనాభా గల దేశంలో వారి అవసరాలకు 140 లక్షల టన్నుల ఆయిల్‌ అవసరం అవుతుంది. కానీ దేశంలో కేవలం 70 నుంచి 75 లక్షల టన్నుల మాత్రమే ఉత్పత్తి అవుతుంది. మిగిలిన నూనెలను మలేషియా, ఇండోనేషియా వంటి చిన్న దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 33 శాతం మంది ఈ నూనెను వినియోగిస్తున్నారు. అందులో మన దేశం వాటా 60 శాతం. పామాయిల్‌ సాగును ప్రోత్సహించాలని కేంద్రం పామాయిల్‌ మిషన్‌ 2020- 2028ని ప్రవేశపెట్టింది. 11 వేల కోట్ల రూపాయలను బడ్జెట్‌ కేటాయించింది. 17 రాష్ట్రాల్లో 1516 లక్షల ఎకరాల్లో పంటను సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.తద్వారా విదేశాల నుంచి వచ్చే దిగుమతులు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కానీ ఆచరణలో సరైన విధానాన్ని ప్రకటించకపోవడంతో రైతులకు తిప్పలు తప్పడం లేదు. దేశం ఏటా 14 మిలియన్‌ టన్నుల వెజిటబుల్‌ ఆయిల్‌ దిగుమతి చేసుకుంటుండగా ఇందులో 8.5 మిలియన్‌ టన్నుల పామాయిల్‌ కావటం గమనార్హం. ఈ దిగుమతుల కోసం కేంద్రం 19 బిలియన్‌ డాలర్ల దాకా అత్యంత విలువైన విదేశీ మారకాన్ని ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇది ట్రేడ్‌ డెఫిసిస్‌కు దారి తీయడమే కాక ద్రవ్యోల్బణం పెంచుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఏటా మూడు లక్షల టన్నుల పామాయిల్‌ మాత్రమే ఉత్పత్తి అవుతుంది. తెలంగాణలో కనుక తక్కువలో తక్కువ రెండు మిలియన్‌ టన్నుల పామాయిల్‌ ఉత్పత్తి చేయగలిగితే దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు చేసిన వారు అవుతారని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.దానికి కావాల్సింది ప్రధానంగా రైతులను ఆయిల్‌ఫామ్‌ వైపు మొగ్గుచూపేలా తగిన ప్రోత్సాహమివ్వడం. 90శాతం సబ్సిడీతో పాటు మొక్కల ఎదుగుదలకు నాలుగేండ్ల వరకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించడం. కానీ ఆదిశగా ప్రభుత్వ కార్యాచరణ లేకపోవడం శోచనీయం.
వాస్తవానికి నర్సరీ మొక్కలను 12 నెలల నుంచి 15 నెలలలోపు పెంచిన మొక్కలను రైతులకివ్వాలి. మొక్కల లభ్యత మీద పూర్తి దృష్టి పెట్టాలి. ఎందుకంటే నర్సరీ పెంపకం వాటిని పంటకు సిద్ధం చేయటం అనేది అనేది ఒక సుదీర్ఘ ప్రక్రియ. తోటలలో గ్యాప్‌ ఫిల్లింగ్‌కు నర్సరీలో కొంత వయసు వరకు కొన్ని మొక్కలను పెంచాలి. భూగర్భ జలాలను చెక్‌ చేసుకోవాలి. పామాయిల్‌ ఒక మొక్క తప్పడానికి రోజుకి 300 లీటర్ల నీళ్లు కావాలి. అలాగే కరువు పరిస్థితులు వస్తే తోటలను ఎలా కాపాడుకోవాలి అనే ప్రణాళిక ఉండాలి. గెలలు వానాకాలంలో వస్తాయి కనుక గెలలు బయటకు పోవడానికి ఉపయోగంగా దారులను, డొంకలను సరిచేసుకోవాలి. పాలినేషన్‌ ఈవెన్‌ అనేది పామాయిల్‌ తోటలో చాలా ముఖ్యం. వీటి ద్వారానే పామాయిల్‌ తోటలో పరపరాగ సంపర్కం జరిగి ఆడగెలలు ఏర్పడతాయి. వాటికి వాతావరణం సరిపోతుందో లేదో చూసుకోవాలి. ఇవి సరిగా లేకపోవడం వల్ల వనపర్తి, సిద్దిపేట జిల్లాల్లో సమయం దాటినా గెలలు రావడం లేదు. మొత్తం తెలంగాణలో సాగులో ఉన్న భూమి నుండి పంట ఉత్పత్తి వస్తే వాటిని ప్రాసెస్‌ చేయడానికి సరిపడా యూనిట్లు రాష్ట్రంలో లేవు. గతంలో 14 ఫ్యాక్టరీలకు అనుమతిస్తే అందులో మూడు ఫ్యాక్టరీలు మాత్రమే నడుస్తున్నాయి.
ఒక టన్ను పామాయిల్‌ గెలలనుంచి 193 కేజీల నూనె వస్తుంది. దీనిని కాకినాడ పోర్ట్‌ నుంచి అమ్ముతున్నారు. ఏరోజుకారోజు అంతర్జాతీయ క్రూడాయిల్‌ మార్కెట్‌ని బట్టి రేటు నిర్ణయిస్తారు. దీనిని నెలంతా సరాసరి యావరేజ్‌ చేసి రైతుకి రేటు చెల్లిస్తారు.పామాయిల్‌ మొక్కలు పెంచాలనుకుంటే అక్కడ భూములు పరీక్ష చేయాలి. వాతావరణ అనుకూల పరిస్థితులు చూడాలి. కనీసం ఐదేండ్లు అక్కడ పరీక్షలు నిర్వహించాకే రైతులను ప్రోత్సహించాలి. లేదంటే సాగు విధానం తెలియక రైతులు నష్టపోవాల్సి వస్తుంది. ఇప్పటికే ప్రయివేటు కంపెనీ అయిన గోద్రెజ్‌ ఆగ్రోవేట్‌ వారు రైతుల కోసం ఒక ప్రత్యేక యాప్‌ను రూపొందించి, రైతులకు అవసరమైన సమగ్ర సమా చారాన్ని అందుబాటులో ఉంచారు. కానీ ప్రభుత్వ రంగ సంస్థ అయినా ఆయిల్‌ ఫెడ్‌లో ఆ విధానాన్ని ప్రవేశపెట్టకపోవడంతో రైతులకు సరైన సమాచారం ఉండటం లేదు.
వరి సాగును తగ్గించే క్రమంలో గత ప్రభుత్వాలు 25 లక్షల ఎకరాల్లో పామాయిల్‌ సాగు చేయాలని నిర్ణయం తీసుకుంది. కానీ 1970 మధ్యలో దేశంలో నూనె పంటల విస్తీర్ణాన్ని పెంచడం కోసం సలహాలు ఇవ్వటానికి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి డాక్టర్‌ చద్దా కమిషన్‌ 10 రాష్ట్రాల్లో సుమారుగా 50 లక్షల ఎకరాలు సాగుకి అనుకూలమని తెలిసింది. కానీ ఈ 50 ఏండ్ల కాలంలో 9 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు అందులో నాలుగున్నర లక్షల ఎకరాల నుంచి పంట గిట్టుబాటు గాక ప్రభుత్వం, ప్రయివేటు కంపెనీల ప్రోత్సాహం లేక పీకి వేశారు. దీన్ని ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ప్రస్తుతం కేంద్రం వ్యవసాయ సహకార రైతు సంక్షేమ శాఖ ద్వారా 2017-18 సంవత్సరానికి అంచనా వేసిన విధంగా తెలంగాణలో ఒక టన్ను పామాయిల్‌ గెలల ఉత్పత్తికి అవుతున్న ఖర్చు రూ.10,837ను నిర్ధారించింది. కానీ, 2023-24 నాటికి టన్నుకు ఒక ఇంటికి సుమా రుగా రూ.15వేలకు పైగా ఖర్చు అవుతుంది. మరి కేంద్రం మద్దతు ధర రూ.13346గా పేర్కొనటం ఎమ్మెస్‌ స్వామినాథ కమిషన్‌ సిఫార్సులకు పూర్తి విరుద్ధం. ప్రభుత్వం టన్నుకు కనీసం రూ.20వేలు మద్దతు ధర ఇస్తే గాని పామాయిల్‌ రైతాంగం బతికి బట్టకట్టే పరిస్థితి లేదు. దేశంలో ఆయిల్‌ ఫామ్‌ పంట ప్రవేశించి మూడు దశాబ్దాలు దాటింది. కానీ నేటికీ ఈ పంటను ప్రోత్సాహకాలు, సబ్సిడీల పేరుతోనే లాగించుకురావడం వ్యవసాయరంగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు.
యలమంచి వంశీకృష్ణ
9908997969