కూసింత కూలీ కుండకేసి
మనసెట్టి జర సూడండ్రి
గతికినకాడనే
మెతుకుల్ని ఏరుకుంటా
కూకున్నకాడనే
కూలబడుతున్నం దొర
గంజి పోసిన గిద్దెలోకింత
ఉప్పు సల్లండ్రి
పోరగాళ్ళ పైసదువులు
పాణం మీద పెనం లెక్కన
సర్రున కాగినట్టే వుంటయి
ఇసిరొచ్చిన ఇత్తనాలు
ఎనకమాలే ఎక్కిరిత్తాంటే
జర కునుకు కరువైనాది దొర
సూపుడేలు ఎత్తనీకి
సూపు రావట్లే
యాపారమంతా
యాపాకులా సేదైనాక
గాడ ఈడా గుంజడాన్కే
పైసల్నీ దొర్లిపాయే
ఏం సేత్తాం దొర బతుకింతే
నేనెంత నువ్వెంతని
మీకుమల్లే గింజులాట్లో
కాలమంతా ఊడ్చకపాయే
నమస్తే సారూ
జరంత తల పైకెత్తి
తలమాసిన రాతల బతుకుల్ని
ఒక్కతూరైనా సూడండ్రి
ఎకాక్కన ఒకటే కరుసు
కొరివి జీవనాల కుంపటి కింద
ఎన్నాళ్ళని సాగదీయాలే
జర మీరైనా సెప్పండ్రీ
ఏ కొట్టుకాడ సూసినా
రేట్లన్నీ రంకెలేత్తాంటే
గుండెకాయాడన్నంత పనైంది
యలపరంతో పాటు
సొలుపొచ్చి సాగిలపడినాం
కాయింత సూడండ్రి
ఇసుమంత ఎరగండ్రి
– నరెద్దుల రాజారెడ్డి
సెల్: 9666016636