– ఆద్యంతం ప్రేక్షకులను కట్టి పడేసిన ప్రదర్శన
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
‘మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు’ భార తదేశ స్వాతంత్య్ర సమరయోధులలో మహౌన్నత వ్యక్తి. ఆ మహనీయుడి జీవిత కథను ప్రఖ్యాత నర్తకి, పద్మశ్రీ డాక్టర్ ఆనంద శంకర్ జయంత్ దర్శకత్వం వహించిన నృత్యరూపకం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ నృత్య రూపకాన్ని ‘శతాబ్ది, వార్షి కోత్సవ వేడుకలలో’ భాగంగా డ్యాన్స్ థియేటర్ ప్రొడ క్షన్ నిర్మాణంలో భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, శంకరానంద కళాక్షేత్ర ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో ప్రదర్శించారు. ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య అద్భుత ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకుంది. భారతదేశ గొప్ప స్వాతంత్య్ర సమరయోధులలో ‘మన్యం వీరుడు – అల్లూరి సీతారామరాజు’ ఒకరు. ఆ మహౌన్నత వ్యక్తి ధైర్యసాహసాలు, స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని, భరత మాత పట్ల సాటిలేని ప్రేమను సజీవంగా తీసుకువచ్చే ఒక ప్రయత్నమే ఇదనీ నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా ఆనంద శంకర్ జయంత్ మాట్లాడుతూ పుట్టుకతో తమిళుడిని, కానీ ఆత్మతో తెలుగు వాడినని అన్నారు. తెలుగు వాగ్గేయకారులు త్యాగరాజు, భక్త రామదాసు, అన్నమయ్య, ఆధునిక కవులు దేవుళ్లపల్లి కష్ణ శాస్త్రి, రాయప్రోలు సుబ్బా రావు, వేంకట పార్వతీశం కవులు తదితరుల స్ఫూర్తితో నా కొరియోగ్రఫీలు ఎన్నో ఉన్నాయన్నారు. తాజాగా స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీ తారామరాజు కథను మీ ముందుకు తెచ్చానన్నారు. శంకరానంద కళాక్షేత్ర బృందంలోని 21 మంది నృత్యకారులు, అతిథి కళాకారులు మిథున్ శ్యామ్, సురేందర్ నాథ్, హైదరాబాద్, బెంగుళూరుకు చెంది న యువ నృత్యకారులతో అద్భుతమైన నృత్య నిర్మా ణంలో సీతారామరాజు ఉత్తేజకరమైన దేశభక్తిని సజీవంగా తీసుకువచ్చామన్నారు.మార్షల్ ఆర్ట్స్, ఉత్కంఠభరితమైన పోరాట సన్నివేశాలు, భావోద్వేగా లతో కూడిన అద్భుతమైన కొరియోగ్రఫీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. 45 నిమిషాల ఈ ప్రదర్శనలో ముగిం పులో స్టాండింగ్ ఓవేషన్ ప్రేక్షకులను ఎంతగా మం త్ర ముగ్ధులను చేసిందో అర్థం చేసుకోవచ్చు. స్వాతం త్య్ర సమరయోధుల కథలను యువతకు చేరవేయాలంటే ఇలాంటి నృత్య ప్రదర్శనల అవసరం ఎంతో ఉంది.ప్రఖ్యాత నర్తకి పద్మశ్రీ డాక్టర్ ఆనంద శంకర్ జయంత్ నృత్యరూపకం విలక్షణమైనది. శ్వేతా ప్రసాద్, ఐవీ రేణుకాప్రసాద్ అందించిన సంగీతం ఆకట్టుకుంది. వెంకట్ గాడేపల్లి తెలుగు కవిత్వం, జయంత్ ద్వారకానాథ్ ఆంగ్ల కథనం, సూర్యారావు లైట్లు, గుంజన్ అష్టపుత్రే డిజిటల్ డిజైన్ అద్భుతంగా కుదిరాయి. బెంగుళూరుకు చెందిన భరతనాట్య నర్తకుడు మిథున్ శ్యామ్, అల్లూరి సీతారామరాజుగా, కూచిపూడి నృత్యకారుడు సురేందర్ నాథ్ బ్రిటిష్ కెప్టెన్‌గా తమ పాత్రలలో జీవించారు. మన్యం వీరు డు- అల్లూరి సీతారామరాజు’ ఈ కథను పాఠశా లలు, కళాశాలల విద్యార్థులు తప్పక చూడాలని అతిథులు డాక్టర్ మమ్మిడి హరికృష్ణ, రమా భరద్వాజ తదితరులు కోరారు.