‘రామగుండం’ జెన్‌కోకే ఇవ్వాలి

– టీఎస్‌యూఈఈయూ డిమాండ్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రామగుండంలో కొత్తగా నిర్మించనున్న 800 మెగావాట్ల బొగ్గు ఆధారిత విద్యుత్‌ ప్లాంట్‌ను తెలంగాణ జెన్‌కోకే కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (టీఎస్‌యూఈఈయూ) ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే ఈశ్వరరావు, వీ గోవర్థన్‌ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. 1971లో 62.5 మెగావాట్లతో ఉత్పత్తి ప్రారంభించిన రామగుండం బీ థర్మల్‌ స్టేషన్‌ 50 ఏండ్లు నిరాటంకంగా సేవలు అందించిందని తెలిపారు. ఈ కేంద్రానికి 560 ఎకరాల భూమి జెన్‌కో ఆధీనంలో ఉందనీ, రూ.9 వేల కోట్ల అంచనా వ్యయంతో, సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీ ద్వారా జెన్‌కోనే ఇక్కడ 800 మెగావాట్ల విద్కుత్కేంద్రాన్ని నిర్మించేలా ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. జెన్‌కో ఆస్తుల్ని సింగరేణికి కట్టబెట్టే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు.
సీఎమ్‌డీకి జేఏసీ వినతి
రామగుండంలో నూతనంగా నిర్మించనున్న 800 మెగావాట్ల విద్యుత్కేంద్ర నిర్మాణాన్ని టీజీఎస్‌జెన్‌కోకే ఇవ్వాలని తెలంగాణ స్టేట్‌ పవర్‌ ఎంప్లాయిస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (జేఏసీ) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆ సంస్థ సీఎమ్‌డీకి యూనియన్‌ నేతలు వినతిపత్రం సమర్పించారు. ఈ స్థలాన్ని, థర్మల్‌ కేంద్ర నిర్మాణాన్ని సింగరేణికి ఇవ్వాలనే ప్రతిపాదన విరమించుకోవాలని జేఏసీ చైర్మెన్‌ సాయిబాబు, వైస్‌ చైర్మెన్‌లు వజీర్‌, అనిల్‌ కుమార్‌, జేఏసీ నాయకులు ఏ.వెంకట నారాయణరెడ్డి, ఈశ్వర్‌గౌడ్‌, నెహ్రూ, పి.సదానందం, ఎన్‌. సురేష్‌ కుమార్‌, పీవీ రావు, వేణుగోపాల్‌, కుమార స్వామి, మోసెస్‌ తదితరులు పాల్గొన్నారు.