టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీలో 73.03 శాతం ఉత్తీర్ణత

– ఫలితాలు విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం ఆన్‌లైన్‌ ద్వారా విడుదలయ్యాయి. అనంతరం ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ కృష్ణారావు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల మూడు నుంచి 13 వరకు పరీక్షలను నిర్వహించామని తెలిపారు. 51,272 మంది దరఖాస్తు చేసుకుంటే, 46,731 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని పేర్కొన్నారు. వారిలో 34,126 (73.03 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారని వివరించారు. ఇందులో 29,142 మంది బాలురు పరీక్షలు రాస్తే, 20,694 (71.01 శాతం) మంది పాసయ్యారని తెలిపారు. 17,589 మంది బాలికలు పరీక్షలు రాయగా, 13,126 (76.37 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. బాలురు కన్నా బాలికలు 5.36 శాతం మంది అధికంగా ఉత్తీర్ణత పొందారని తెలిపారు. రాష్ట్రంలో వంద శాతం ఉత్తీర్ణత సాధించి నిర్మల్‌ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ఆ జిల్లా నుంచి 75 మంది పరీక్ష రాస్తే, అందరూ ఉత్తీర్ణత పొందారని వివరించారు. 99.15 శాతం ఉత్తీర్ణతతో జనగామ జిల్లా రెండోస్థానంలో నిలిచిందని తెలిపారు. 42.14 శాతం ఉత్తీర్ణతను సాధించి వికారాబాద్‌ జిల్లా చివరిస్థానంలో ఉందని పేర్కొన్నారు. ఆ జిల్లా నుంచి 5,847 మంది పరీక్షలు రాయగా, 2,464 (42.14 శాతం) మంది పాసయ్యారని తెలిపారు. పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాల కోసం www.bse.telangana.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.
రీకౌంటింగ్‌ దరఖాస్తు గడువు జులై 8
మార్కులు తిరిగి లెక్కింపు (రీకౌంటింగ్‌) కోరుకునే విద్యార్థులు సబ్జెక్టుకు రూ.500 చొప్పున వచ్చేనెల ఎనిమిదో తేదీ వరకు ఎస్‌బీఐ ద్వారా హెడ్‌ ఆఫ్‌ అకౌంట్‌ కింద చలానా చెల్లించాలని కృష్ణారావు తెలిపారు. ఆ దరఖాస్తులను నేరుగాగానీ, పోస్టు ద్వారాకానీ ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుల కార్యాలయం, హైదరాబాద్‌కు పంపించాలని కోరారు. డిమాండ్‌ డ్రాఫ్ట్‌లు అంగీకరించబోమని స్పష్టం చేశారు. హాల్‌టికెట్‌ జిరాక్స్‌ కాపీ, కంప్యూటరైజ్డ్‌ మెమో కాపీతో రీ వెరిఫికేషన్‌ కోసం దరఖాస్తులను సమర్పించాలని తెలిపారు. ప్రధానోపాధ్యాయులు ఆన్‌లైన్‌ ద్వారా అప్‌లోడ్‌ చేసి డీఈవో కార్యాలయానికి సమర్పించిన వాటినే అంగీకరిస్తామని పేర్కొన్నారు. ఎస్‌ఎస్‌సీ బోర్డుకు పోస్టు ద్వారా పంపిన దరఖాస్తులు ఆమోదించబోమని స్పష్టం చేశారు. ఒక్కో సబ్జెక్టుకు రూ.వెయ్యి చొప్పున వ్యక్తిగత చలానా చెల్లించాలని కోరారు. రీవెరిఫికేషన్‌, జిరాక్స్‌ కాపీల సరఫరా కోసం దరఖాస్తులను వచ్చేనెల ఎనమిదో తేదీ వరకు స్వీకరిస్తామని తెలిపారు.