ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించి, ఉద్యోగాలను భర్తీ చేయాలి

– డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనగంటి వెంకటేష్ 
నవతెలంగాణ – వీర్నపల్లి 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించి వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనగంటి వెంకటేష్  డిమాండ్ చేశారు. వీర్నపల్లి మండల కేంద్రంలో భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య  అధ్వర్యంలో యువజన సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనగంటి వెంకటేష్ మాట్లాడుతూ.. నిరుద్యోగులకు  ఎన్నికల్లో ఇచ్చిన హామీనీ నిలబెట్టుకొని జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఆయాశాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు అన్నింటికి నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా లక్షలాదిమంది నిరుద్యోగుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఉద్యోగ నియమకాలను వెంటనే చేపట్టాలన్నారు. ఉద్యోగాలు ఇచ్చేంతవరకు నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి నాలుగువేల రూపాయలు ఇవ్వాలన్నారు.గత ప్రభుత్వం నిరుద్యోగ యువతను నిర్లక్ష్యం చేయడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు . గత ప్రభుత్వం చేసిన తప్పులను చేయకుండా  నిరుద్యోగ యువతకు పారదర్శకంగా ఉద్యోగాల నియమకాలు  చేపట్టాలనీ ప్రభుత్వాన్నీ కోరారు.  గ్రూప్స్  పోస్టులను పెంచి భర్తీ చేయాలి,  గురుకుల విద్యాసంస్థల్లో వివిధ కేటగిరీలో  కొత్తగా ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు పోస్టింగ్స్ ఇవ్వాలి, ఉద్యోగ నియామక పత్రాలు అందుకొని దాదాపు నాలుగునెలలు గడుస్తున్నా వారికి పోస్టింగ్ ఉత్తర్వులు ఇవ్వలేదు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పోస్టింగులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
నీట్ పేపర్ లికేజీ కావడంతో 24 లక్షల మంది  విద్యార్థుల,తల్లితండ్రులు భయాందోళనలో ఉన్నారని, పార్లమెంట్ సమావేశాలలో ప్రధాని మోడీ నీట్ స్కామ్ పై స్పందించకపోవడం దారుణమనీ  ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ స్కామ్ పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు . ఎన్.టీ.ఏ ను రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు నీట్ నిర్వహణకు అనుమతి ఇవ్వాలన్నారు . పేపర్ లీకేజీలో దోషులను కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు‌.డివైఎఫ్ఐ అధ్వర్యంలో‌ రాష్ట్రవ్యాప్తంగా యువత సమస్యలపై సర్వే నిర్వహిస్తున్నామని సమస్యల పరిష్కారానికై డివైఎఫ్ఐ అధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ  కార్యక్రమంలో  జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు  గాంతుల మహేష్ , మల్లారపు అరుణ్ కుమార్, నాయకులు మనోజ్ కుమార్, క్యారం రాకేష్,గడ్డి  నరేందర్ ,క్రాంతి,రమేష్ చంద్ర,బత్తుల అంజనేయులు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.