యాదగిరి నరసింహుని వైభవాన్ని చాటిన పాట

యాదగిరి నరసింహుని వైభవాన్ని చాటిన పాటమన తెలుగు సినిమాల్లో భక్తి పాటలు చాలానే ఉన్నాయి. శ్రీరాముడు, శ్రీకష్ణుడు, శ్రీవేంకటేశ్వరుడు, శివుడు, జగజ్జనని, సాయిబాబా… ఇలా ప్రతి దేవతామూర్తిపై పాటలున్నాయి. వివిధ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల మహత్యాన్ని చాటి చెప్పే భక్తి గీతాల్లో యాదగిరి క్షేత్రాన్ని, అక్కడ వెలసిన శ్రీ లక్ష్మీనసింహుని వైభవాన్ని తెలియజేసే ఈ పాట ఒకటి. 2002 లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన త్రినేత్రం సినిమాలోని జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రాసిన ఆ పాటనిపుడు పరిశీలిద్దాం.
జొన్నవిత్తుల అంటేనే అద్భుతమైన భక్తిగీతం మన హృదయాల్లో మోగుతుంటుంది. నిర్మలమైన భక్తిభావనలను, మధురమైన దేవతామూర్తుల కథలను వివరించే పాటలను ఆయనెన్నో రాశారు. అలా అని భక్తిగీతాలు మాత్రమే రాశారా.. అంటే అదెంత మాత్రం నిజం కాదు. కుర్రకారుని ఉత్సాహంతో ఉరకలెత్తించేవి, మాస్‌ పాటలు కూడా రాశారు. కాని ఆయన రాసిన భక్తిగీతాలకు ఒక ప్రత్యేకత ఉందని మాత్రం చెప్పగలం. దేవుళ్ళు, త్రినేత్రం, శ్రీరామరాజ్యం మొదలైన సినిమాల్లో ఆయన రాసిన భక్తిగీతాలు అందరినీ అలరించాయి. నేటికీ అలరిస్తూనే ఉన్నాయి.
యాదగిరి లక్ష్మీనసింహుని వైభవాన్ని, ఆ క్షేత్రం గొప్పతనాన్ని చాటి చెప్పే పాటను పరమాద్భుతంగా రాశారు జొన్నవిత్తుల. ఇప్పటికీ నసింహుని దేవాలయాల్లో, ఇతర వైష్ణవ క్షేత్రాల్లోను ఈ పాట వినిపిస్తూనే ఉంటుంది.
సంపదలను, శుభాలను కలిగించే ఓంకార స్వరూపం శ్రీ లక్ష్మీనరసింహస్వామి అని, పద్నాలుగు లోకాలన్ని మొక్కే జ్వాల నసింహుడని కీర్తిస్తారు. ఆ స్వామియే శరణమని, అతన్ని ధ్యానించడమే జీవితానికి ధన్యమని తెలియజేస్తాడు.. ఇది పల్లవిలో నసింహస్వామి శక్తితత్త్వాన్ని కీర్తిస్తూ చెప్పిన మాటలు…
ఇక చరణంలో స్వామి వెలసిన యాదగిరి గుడి మాహాత్మ్యాన్ని, చారిత్రక విశేషాలను తెలియజేస్తారు రచయిత.
పురాణయుగమున ఈ కొండపైననే యాదర్షి అనే రుషి తపస్సు చేశాడని, అందుకే ఈ గిరికి యాదగిరి అని పేరు వచ్చిందని చెబుతున్నారు. ఇక్కడి గుహలో ప్రళయ మహౌజ్జ్వల కాంతితో లక్ష్మీ నసింహస్వామి వెలిశాడని, భక్తుల కోరికలు తీర్చేందుకు, వారికి పుణ్యఫలాలను ప్రసాదించేందుకు స్వామి ఇక్కడ కొలువుతీరాడని, సుఖశాంతులను అందరికీ అందించే శుభకరుడు ఈ నసింహుడని తెలియజేస్తున్నారు. నాలుగు దిక్కులు కూడా స్వామి వారికి నమస్కరిస్తున్నాయి. స్వామి గోటి వెలుగులకు ఆకాశంలోని చుక్కలు కూడా మొక్కుతున్నాయి. గోకులరూపం దాల్చిన ఆ దివ్యమణిమయమైన సుదర్శనచక్రానికి మంగళహారతులిచ్చి ఆ కాలచక్రమే నమస్కరిస్తున్నదని చెబుతున్నాడు.
ఇక్కడ వెలసిన శ్రీ లక్ష్మీనసింహస్వామి పాదాలను బ్రహ్మ కడిగాడు. దాని ఫలితమే ఇక్కడ విష్ణుగుండం వెలసిందని, ఇందులో జలం ఇంకిపోకుండా, ఎప్పుడూ ఊరుతూనే ఉంటుందని భక్తజనుల ప్రగాఢ విశ్వాసం. ఈ క్షేత్రంలో నరసింహస్వామియే విశ్వవైద్యుడిలా కనిపిస్తాడు. మానసిక, శారీరక రోగాలను స్వామియే నయం చేస్తాడు. ఇక్కడ బెత్తంతో వెన్నులో చరవగానే మనలో ఉన్న భయం, అశాంతి తొలగిపోయి ధైర్యం, ఉత్తేజం, మనపై మనకు నమ్మకం, తేజస్సు కలుగుతాయి. మన దేహంలో, మన చిత్తంలో ఎంతో ఉత్సాహం, ఉల్లాసం కలుగుతాయి. ఇక్కడి బెత్తానికి గల మహత్తు అలాంటిదని చెప్పబడుతుంది. ఇక్కడి గిరి ప్రదక్షిణం భక్తజనులకు భోగభాగ్యాలను, సుఖశాంతులను, దీర్ఘాయువును ప్రసాదిస్తాయని కూడా తెలియజేయబడింది.
యాదగిరి క్షేత్ర పాలకుడిగా శ్రీ ఆంజనేయస్వామి కీర్తించబడుతున్నాడు. ఆ ఆంజనేయస్వామియే శ్రీలక్ష్మీనసింహస్వామి మహిమలకు సాక్షిగా నిలిచి ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి. కలియుగంలో పరమపావనమూర్తిగా వెలసిన యాదగిరి లక్ష్మీ నసింహస్వామి దర్శనం భక్తులు కోరిన కోరికలు తీర్చే మహా కల్పవృక్షమై అలరారుతోంది..
శ్రీ నరసింహస్వామి నామ గానం భూతప్రేత పిశాచాలను, రక్కసులను పారద్రోలుతుంది. శ్రీ నరసింహస్వామి రూప స్మరణం క్షుద్రశక్తులను, బాణామతులను దగ్ధమొనరిస్తుంది. ప్రపంచ బాల ప్రహ్లాదుడిని రాక్షసరాజైన హిరణ్య కశిపుడు హింసించగానే సర్వకాలముల, సర్వావస్థల, సర్వదిక్కులకు వ్యాపించి సంరక్షించాడు. తన భక్తులను రక్షించాడు. దుర్మార్గులను శిక్షించాడు. సన్మార్గులను అనుగ్రహించాడు.. అలాంటి శ్రీ లక్ష్మీ నసింహస్వామి దివ్యచరణాలను, దివ్యరూపాన్ని, దివ్యనామాన్ని నిత్యం స్మరించమన్న సందేశం ఈ పాట మనకందిస్తుంది.
ఈ పాట సినిమా సన్నివేశాన్ని దృష్టిలో ఉంచుకుని రాసినప్పటికీ లక్ష్మీ నసింహస్వామిని తలచుకోగానే ప్రతి చోటా ఈ పాటే వినిపిస్తుంది. స్వామి దివ్యస్వరూపం కళ్ళముందు, హృదయం ముందు సాక్షాత్కరిస్తుంది. యాదగిరి క్షేత్రంలో ప్రతి నిత్యం ఈ పాట మోగుతూనే ఉంటుంది. యాదగిరీశునికి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఇచ్చిన అక్షరహారతి ఈ పాట.. నేడు తెలంగాణలో.. తిరుపతి క్షేత్రమంత వైభవంగా విరాజిల్లుతున్న, దేదీప్యమానంగా వెలుగొందుతూ ప్రపంచ ప్రఖ్యాతి గాంచుతున్న యాదగిరి క్షేత్ర వైభవాన్ని ఈ పాట దశదిశలా వినిపింపజేస్తోంది.
పాట:
నరసింహా లక్ష్మీ నరసింహా/ శ్రీకర శుభకర ప్రణవ స్వరూపా/ లక్ష్మీ నరసింహా/ పదునాలుగు లోకములన్నీ మొక్కే/ జ్వాలా నరసింహా/ నీవే శరణమయా/ ఓ యాదగిరీ నరసింహా/ పురాణ యుగమున ఈ గిరి పైనే/ తపమొనరించెను యాద రుషి/ ధరాతలమ్మున అతని పేరుతో అయినది ఈ గిరి యాదగిరి/ ఈ గుహలో వెలసెను ప్రళయ మహోజ్జ్వల జ్వాలా నరసింహుడు/ భక్తాభీష్టములు అన్నీ తీర్చే లక్ష్మీ నరసింహుడు/ సుఖ శాంతులను చేకూర్చు/ శుభయోగ నరసింహుడు/ నమో నమ: నమో నమ:/ నమస్కరించెను నాలుగు దిక్కులు నఖముల వెలుగుకు/ మొక్కెను చుక్కలు/ గోకుల రూపము దాల్చినదీ/ ఆ దివ్య సుదర్శన చక్రము /మంగళ హారతులిచ్చినది/ మహా కాల చక్రము/ ఈ స్వామి పదములు బ్రహ్మ కడుగగ/ విష్ణు గుండమే ప్రభవించే/ ఇట స్నానము చేసిన జన్మ ధన్యమే కర్మవిమోచనమే/ ఇట విశ్వ వైద్యుడై స్వామే/ చేయును రోగ నివారణమే/ చిత్తము దేహము సత్వముగా/ నువు బెత్తము తాకగనే../ భోగ భాగ్యాలు దీర్ఘాయువు వొసగెను గిరి ప్రదక్షిణం/ నమో నమ: నమో నమ:/ క్షేత్ర పాలకుడు ఆంజనేయుడే/ సాక్షి ఔను ఈ మహిమలకు/ కలియుగ దైవము యాదగిరి/ శ్రీ నరసింహుని దర్శనము/ కోరిన కోర్కెలు తీర్చేటి మహా కల్ప వృక్షము/ భూత ప్రేత పిశాచ రక్కసుల/ పారద్రోలు నీ నామమే/ క్షుద్రశక్తులను బాణామతులను/ దగ్ధమొనర్చు నీ స్మరణమే/ ప్రపంచ బాల ప్రహ్లాదునియే/ హిరణ్యకశిపుడు హింసింపగనే/ సర్వ కాలముల సర్వావస్థల/ సర్వ దిక్కులకు వ్యాపించి/ సంరక్షింపుము నరసింహా/ అనుగ్రహింపుము నరసింహా/ యాదగిరీశా నరసింహా..
– డా||తిరునగరి శరత్‌చంద్ర,
sharathchandra.poet@yahoo.com