ఏది ఇలలోన అసలైన న్యాయం’ అంటూ ఎప్పుడో చాన్నాళ్ల కిందట సినిమాలో బాలు పాడతాడు. ‘న్యాయం నిర్ణయించు విధి మాది. మీరు సంజాయిషీ ఇచ్చుకొనుడు’ అని యమధర్మ రాజు డైలాగ్ ఒకటి నాటకంలోది ప్రతి సారీ గుర్తుకొస్తూ ఉంటుంది. ఎందుకంటే న్యాయం అనే పదాన్ని మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. సమాజంలో న్యాయం కోసం అశేష ప్రజలు నిత్యం ఎదురు చూస్తూనే ఉన్నారు. అది దక్కటం చాలా కష్టంగా ఉంటుంది. అసలు ఏది న్యాయం, ఏది అన్యాయం కూడా ఒక పెద్ద సమస్య. న్యాయం ఎప్పటికీ ఒక్కలాగ కూడా లేదు. కాలాలను బట్టి, సమాజాల్ని బట్టి, పరిపాలకులను బట్టి మారుతూ వస్తోంది. ఒకరు కష్టపడి సంపాదించుకున్న డబ్బును ఇంకొకరు అతనిపై దౌర్జన్యం చేసి ఎత్తుకెళితే అది నేరం. ఆ డబ్బు తిరిగి కష్టజీవికి ఇప్పించడం న్యాయం. ఒక మనిషిని, తనకేదో మోసం చేసాడని చంపేస్తే నేరం. ఆ నేరం చేసిన వాడికి శిక్షపడటం న్యాయం. అదే వ్యాపారం పేరుతో లాభం పొంది, కష్టపడ్డవాడి సొమ్ము పొందితే చట్ట పరంగా న్యాయమైనదే. చంపేంత తప్పు చేశాడని న్యాయస్థానం భావిస్తే చంపేయడమూ న్యాయమే అంటారు. ఉరివేస్తారు. ఇంతకీ ఏది న్యాయం! చట్ట ప్రకారం చేసేది న్యాయమంటారు. చట్టం రాజ్యం చేస్తుంది. మరి రాజ్యాన్ని ఎవరు చేస్తారు! తోలుబొమ్మలాట అనేది మన ప్రాచీన కళ. అందులో అసలు ఆడించేవాడు కనపడడు. కానీ వాడు ఆడించే బొమ్మలు బయట కథను నడిపిస్తాయి. రాచరికం నుండి ప్రజా స్వామ్య వ్యవస్థగా చెప్పుకున్నప్పటికీ కనిపించని శక్తులే ప్రజాస్వామ్యాన్నీ నడిపిస్తుంటారు. ఇప్పుడైతే పార్లమెంటులోనే కనిపిస్తున్నారు. కోట్లకు పడగలెత్తిన వారే మన ప్రజాప్రతినిధులు కదా! వ్యాపారస్తులూ చట్టసభల్లో నిండిపోయారు. అంటే ఆడించేవాడు ప్రత్యక్షంగానే దిగాడన్నమాట!
ఇప్పుడీ న్యాయం గొడవకు కారణముంది. రేపు జూలై 1 నుండి మన దేశంలో కొత్త నేరన్యాయాలు అమల్లోకి రానున్నాయి. దేశ ప్రజలకు కొత్తగా రాబోయే నేరన్యాయ చట్టాల గురించి ఎక్కవగా తెలిసి ఉండదనుకుంటా. న్యాయంకోసం వాదించే న్యాయవాదులకు, న్యాయం అందించే న్యాయమూర్తులందరికీ అవగాహన అయితే అదే మహాభాగ్యంగా భావించవచ్చు! ప్రజలకోసం రూపొందించే న్యాయచట్టాలు ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం లేదనుకుంటుంది మన ప్రజాస్వామ్యం. అంతదాకా ఎందుకు, అసలు న్యాయవ్యవస్థకే సంబంధం లేకుండా వచ్చేస్తున్నాయి న్యాయచట్టాలు. న్యాయకోవిదుల ప్రమేయమూ లేదు. కానీ కొత్త చట్టాలకు రూపకల్పన చేసింది పోలీసు వ్యవస్థ .(హోంశాఖ) అదీ గమనించాల్సిన అసలు విషయం.
ఈ కొత్త మూడు నేరన్యాయ చట్టాలకు సంస్కృత పేర్లనూ ఖరారు చేసింది. అవేమంటే, 1.భారతీయ న్యాయ సంహిత (ఐ.పి.సి పాతపేరు) , 2. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (సి.ఆర్.పి.ఎఫ్.), 3. భారతీయ సాక్ష్య అధినియం (ఇండియన్ ఎవిడెన్స్ ఆక్ట్). కొత్త దేవుళ్లు రాగానే కొత్త న్యాయాలూ వస్తాయి. ఈ చట్టాలపై కనీసం పార్లమెంటులో చర్చ జరగలేదు. మొత్తం ప్రతిపక్ష సభ్యులను సభనుండి సస్పెండ్ చేసి చట్టాలను ఆమోదించుకున్నారు ప్రభుత్వ నిర్వహకులు. ఇందులో 95 శాతం పాత చట్టాలలోనివే ఉన్నాయి. నేర శిక్షా సంహితలో కొత్తగా 20 రకాల నేరాలను చేర్చారు. అవి అవసరమా కాదా అనేది చర్చేలేదు. కొన్నింటికి జైలుశిక్షలు పెంచింది. న్యాయస్థానాలకు ఉండే విచక్షణాధికారాలను తొలగించింది. స్వతంత్రంగా వ్యవహరించే న్యాయస్థానాల విధులు, కొత్త చట్టాల ద్వారా కొంత అస్పష్టతలోకి పోయినట్లు న్యాయకోవిధులు చెబుతున్నారు. బాధితులు ఎవరైనా న్యాయం కావాలంటూ స్టేషనుకు వెళితే, ముందు కేసు నమోదు చేసి విచారణ చేయాలి. కానీ విచారణానంతరం అది ఎంత సమయమైనా సరే ఆ తర్వాతే ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసేట్టుగా కొత్తచట్టం అనుమతిస్తుంది. ఇది పోలీసు అధికార దుర్వినియోగానికి దారితీస్తుంది. రాజద్రోహం లాంటి నేరాలు వలసపాలనకు గుర్తులని సుప్రీంకోర్టు గతంలో నిలిపివేసింది. కానీ అదే నేర చట్టాన్ని మరింత ప్రమాదకరంగా ‘దేశ ఐక్యత, సమగ్రత’ రూపంలో తీసుకువచ్చింది. ‘ఉపా’ కేసులో అన్యాయంగా, అక్రమంగా అరెస్టు కాబడినవాళ్లు వందలమంది, నేరం రుజువు కాకుండానే శిక్షలు అనుభవిస్తున్నారు. అట్లా బోలెడంతకాలం నిర్భంధంలో ఉన్న ప్రబీర్ పురకాయస్త, సాయిబాబా, ఇంకా ఎందరినో అన్యాయ మంటూ కోర్టులు విడుదల చేశాయి. ఇవన్నీ హక్కుల అణచివేతలో భాగం.
అన్యాయాన్ని, దోపిడీని, నిర్బంధాన్ని ప్రతిఘటించిన వారిని, ప్రశ్నించిన వారి గొంతులను నొక్కివేయటానికి మరింత పదునుగా తెస్తున్న చట్టాలే ఇవి. మేధావులు, న్యాయనిపుణులు, ప్రజా నాయకులు వీటిని గురించి చర్చించాలి. ప్రభుత్వ దమననీతిని ప్రజలకు వివరించాలి.