నాచూపులతోనే అందరూ
నాగరికతను అధ్యయనం చేయాలి
నా రహస్య ఎజెండానే
వాచకం కింద చెదలులా
జ్ఞానమందిరాల్లో విస్తరించాలి…హొ
హేతువును చంపి
కాలం చెల్లిన పురాతన తత్త్వాన్ని
తరగతిగది సాక్షిగా బతికించాలి..
అసమసమాజ విషనీతిని
భావిభారత పౌరుల నరాల్లోకి దట్టించాలి
ప్రసిద్ధ సత్యాలను ప్రణాళికాబద్ధంగా చెరిపి వేసి
అస్మదీయుల ఘనతంత్రాలు వల్లించిన
కుటిల పుటలను చరిత్రకు అతికించాలి..
అమేయ మానవ మేధను
ఉక్కుపాదంతో తొక్కిపెట్టి,
అలౌకిక శక్తుల పాదాలకు మోకరిల్లే
సిద్ధాంతాలను ప్రబోధించాలి..
కుంకుమరంగులో మెరిసే నా మెదడును
రేపటి తరంహొబుర్రలో ప్రతిష్టించాలి..
నా ఆలోచనలకు కాసిన
మేడిపండును దేశభావి నిర్ణేతలకు
మెరుగైన ఆహారంగా పంచిపెట్టాలి ..
ఏ నోరూ నన్ను ప్రశ్నించకూడదు
ఏ పెన్నూ రాజ్య ధిక్కరాన్ని లిఖించకూడదు
పాత గడ్డి మేసి పరమ విధేయంగా
ఏలిన వారికి దండం పెట్టే
నవ యువ గంగిరెద్దులను
తక్షణం తయారు చేయటమే నా విధానం
– కోయి కోటేశ్వర రావు, 9440480274