అంటరాని మనిషి

దరి దొరికేది ఎక్కడో
తీరం చేరేది ఎప్పుడో
జీవితం చిత్ర విచిత్రంగా
సర్కస్‌ తీగ మీద ఆడుతున్నది
వెతుకుతున్న దారం కొస
ఇంకెవడో లాగుతున్నట్టు
బ్రతుకు చిక్కుబడుతున్నది
పైసకు ముఖం వాచినట్టు
కూలి పనికి ఎగబాకుతున్న కొద్దీ
ఎన్నుబొక్కకు డొక్క అంటుకుపోతున్నది
ఎంత ఒళ్ళొంచినా
జేబు నిండా మనసు మెచ్చని ఖాళీ
ఆపద ఏదో గుండెల మీద
దాడి చేసినప్పుడు ఊరుచెట్టు ఎంత ఊపినా
రూపాయి రాలదు
సాయం కొరకు ఏ గడప తొక్కినా
ఇంటి ముందున్న మనీ ప్లాంటు
బిచ్చగాడిని తరిమినట్టు తరిమే
విదేశీ కుక్కపిల్ల
డబ్బును ప్రేమించే లోకంలో
మనిషే అంటరానోడు
కాసుల చుట్టూ తిరిగే ప్రపంచంలో
పేద బక్కోడు దిక్కులేనోడు.
– గజ్జెల రామకష్ణ, 8977412795