అత్తరుపూల రాగం

అత్తరుపూల రాగంతొలకరిలో.. మట్టి ఊరంతా అత్తరు పూల
రాగమాలపించినట్టు సాయిబు తాత.
నా తోపుడు బండి మీద
జాజిపూల అత్తరు గులాబీ అత్తరు
మొగలిపూల అత్తరు సంపంగిపూల అత్తరు
లిల్లీ పూల అత్తరు షాజహానా అత్తరు
ఫిరదౌస్‌ అత్తరు శాండిల్‌ అత్తరు
నిజాం అత్తరులను
వీధి అంతా పరిచయం చేస్తూ
బతుకుదెరువు రాగమయ్యేవాడు.
సాయిబు తాత వస్తుంటే
ఊరంతా పండుగ సందడేదో
సీతాకోకల్లా పలకరించిపోయేది.
చిన్నప్పుడు మేమంతా పెళ్లిళ్లకు వెళ్లేప్పుడు
అమ్మ మా బట్టలకు అత్తరు పూసేది.
అప్పుడు మా చుట్టూ గులాబీ గులాబీ తోటలు
మత్తుగా పాటలు పాడేవి.
తాత కనిపించడం లేదు.
అచ్చూ ఎండాకాలంలో
ఆవిరైన ఏటి వాగులానే అత్తరు దుఃఖం
అత్తరు పాట లేదు.
మాయమైన మానవ సంబంధాల
అలాయి బలాయి
సీతాకోక పలకరింపులు లేవు.
విరగబూసిన బతుకు తోటలు లేవు.
ఊరూరికీ షాపింగ్‌ మాల్స్‌ అవతరించాక
ప్రేమానురాగాల అత్తరు పాటలు లేవు.
గంట కొట్టే పీచు మిఠాయి తాత
పలకరింపులు లేవు.
గాజుల తాత గలగల మాటల
అనుబంధం లేదు.
అత్తరు పాటలు లేవు.
సాయిబు తాత
జ్ఞాపకాలు పరిమళిస్తూనే ఉన్నాయి.
– రేపాక రఘునందన్‌, 9440848924