మనసులేని మాటలు…

ప్రధాని మాట్లాడుతున్న మనసులో మాటలు ఎవరివి? ప్రజలు ఎన్నుకున్న ప్రధానమంత్రివా? లేక నరేంద్ర దామోదరదాసు మోడీవా? అర్థం కావడం లేదుప్రధాని మాట్లాడుతున్న మనసులో మాటలు ఎవరివి? ప్రజలు ఎన్నుకున్న ప్రధానమంత్రివా? లేక నరేంద్ర దామోదరదాసు మోడీవా? అర్థం కావడం లేదు. అవి కేవలం మోడీ మాటలే అయితే సమస్యే లేదు. కాదు ఆయన 140 కోట్ల మందికి ప్రతినిధి అయితే ఆయన మనసు నుండి రావాల్సిన మాటలు ఇవి కావు. ఈ దేశ ప్రధానిగా ప్రజలకు ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. భావోద్వేగ భాషకు, ఆవేశం ఉట్టిపడే హావభావాలకు పెట్టింది పేరు మన ప్రధానమంత్రి… మోడీ వక్తృత్వ పటిమ నిజంగానే గొప్పది. గొంతు చించుకుని మాట్లాడే మోడీ ”మన్‌ కీ బాత్‌” ప్రసంగాలలో మాత్రం చాలా మంద్రంగా మాట్లాడ తారు. ఆ ప్రసంగాలలో సారం కన్నా ప్రసంగించే తీరుకే అధిక ప్రాధాన్యం. ఆదివారంనాటి మన్‌కీ బాత్‌ 111వ ఎపిసోడ్‌లో ప్రధాని జాతీయ అంత ర్జాతీయ విషయాలు అనేకం మాట్లా డారు. కానీ, అందులో ప్రజా సమస్యల ప్రస్తావన లేకపోవడం శోచనీయం.
చాలా చిన్న చిన్న విషయాలను కూడా మహా నాటకీయంగా చెప్పగల నేర్పరి మన ప్రధాని. ‘కర్తుంబి గొడుగులు’ తయారు చేసే గిరిజన సోదరీ మణుల గురించి ఆయన మన్‌కి బాత్‌లో మాట్లాడు తుంటే… మణిపూర్‌ గిరిజనుల గోడుపట్టని ప్రభుత్వం ఇతని దేనా?అనిపిస్తుంది! ఆల్‌ ఇండియా రేడియో సంస్కృత బులెటిన్‌ ప్రసారమై 50 ఏండ్లు పూర్తి చేసుకుందన్న వారి పలుకుల్లో రానున్న రోజుల్లో వేదాధ్యయనం తప్పనిసరన్న ఆయన అంతరంగమే బోధ పడుతోంది. టీ20 ప్రపంచ కప్‌ 2024 ఫైనల్‌లో భారత క్రికెట్‌ జట్టు అద్భుత ప్రదర్శనను చారిత్రాత్మక విజయంగా శ్లాఘించడం, టోక్యో ఒలిం పిక్స్‌లో మన ఆటగాళ్ల ప్రదర్శనకు పులకరించిన ఆనందాన్ని పంచుకున్న ప్రధాని… ఢిల్లీ వీధుల్లో పోరాడి పోరాడి అలసిపోయిన రెజ్లర్ల గురించి ఎందుకు మాట్లాడలేదో వివరిస్తే బాగుండేది. అయినా ఆయనదంతా ‘వన్‌ వే ట్రాఫిక్‌’ విన్యాసం కదా! ఇవన్నీ అడిగే వారెవరూ, అడుగు దామన్నా అవకాశమెక్కడిది?
అరకు ఏజెన్సీలో పండించే ప్రత్యేక కాఫీ గురించి ఆయన దేశానికి చెబుతుంటే అది ఆ రాష్ట్రాన్ని ప్రత్యేక హోదాకు దూరం చేసే ఎత్తుగడ అన్న సంగతే మనం గుర్తించలేము. చివరకు కాఫీ పండించే గిరిజన రైతులకు గిట్టు బాటు ధర, భరోసా కల్పిం చడంలో తన వైఫల్యాల గురించి చెప్పకుండా చాలా చాకచక్యంగా వ్యవహరించారు. ‘ఏక్‌ పేడ్‌ మా కే నామ్‌’ అంటూ ప్రతి ఒక్కరు తమ తల్లి పేరు మీద మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు బాగానే ఉంది’ మరి అదే నోటితో ఈ దేశంలో భద్రతలేని ఆడబిడ్డల బతుకుల గురించి కూడా ప్రస్తావించాలి కదా ? ‘మనందరి జీవితంలో తల్లికి అత్యున్నత స్థానం ఉంది’ అని చెప్పిన పెద్దమనిషి ఆ అమ్మల జీవితాలకు ఏం భరోసా ఇచ్చారు? చిత్తశుద్దీ, ఆచరణ లేకుండా ఎన్ని నినాదాలు ఇచ్చినా ఏం ఉపయోగం?
జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికలు జరగనున్న తరుణంలో శ్రీనగర్‌లో యోగా దినోత్సవం నాడు తన యోగ నిద్రాపారవశ్యం గురించి చెప్పారు బాగానే ఉంది కానీ, ఆ మాయా నిద్ర వీడితేనే కదా దేశంలో సామాన్యుల పరిస్థితి తెలిసేది. యోగా దినోత్సవాన్ని కూడా ఒక ప్రచార విన్యాసంగా ఎన్నికల కోసం ఉపయోగించుకోవడం వీరికే చెల్లుతోంది. ప్రపంచంలోని 24 మంది ప్రముఖ కవుల విగ్రహాలను తుర్క్‌ మెనిస్థాన్‌ అధ్యక్షుడు ఆవిష్కరించిన విషయాలను చెప్పిన నాయకునికి.. 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలను ప్రశ్నార్థకం చేసిన నీట్‌, నెట్‌ స్కాంల గురించి మాట్లాడేందుకు మాత్రం నోరు పెగ లదు. భావి భారత పౌరుల జీవితాల గురించిన ఆలోచన దేశ ప్రధాని మనసులో లేకపోవడం కడు విచారకరం అంటూ ఆ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
ప్రపంచంలో ఏ దేశంలోనూ ఏ నాయకుడూ మా నాయకుడికి సరిపోరని వత్తాసు పలికే గోడీ మీడియా మచ్చుకైనా వారి పాలనలో బయటపడిన స్కాముల గురించి ప్రస్తావించదు. ప్రజాస్వామ్య దేశంలో పాలకుల మనసులో మాటలు ప్రజలు వినడమే కాదు. ప్రజల మన సులో మాటలు కూడా పాలకులు వినగలగాలి. కానీ, మన ప్రధాని మోడీ గారిదంతా ‘వన్‌ వే ట్రాఫికే’ తప్ప ఎన్నడూ ప్రజా సమస్యలు తెలుసుకున్న పాపాన పోలేదు. అనేకానేక జాతీయ, అంతర్జాతీయ ఘటనలపై మన్‌ కీ బాత్‌లో లెక్చ ర్లిచ్చే మోడీ, నీట్‌, నెట్లపై మూగనోము ఎందుకు పట్టారని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. కనీసం నష్టపోయిన విద్యా ర్థులకు ఓదార్పు మాటలు చెప్పడానికి కూడా ప్రధానికి నోరు రాలేదు. ప్రజల ప్రస్తావన లేని, వారి సందేహాలకు జవా బులు దొరకని కార్యక్రమమేదైనా ప్రజల మన్నన పొంద జాలదు. ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టినా వారి వెనకటి బుద్ధి మారలేదు. ‘మన్‌కీ బాత్‌’లో వినసొంపైన ప్రసంగాలు, నీతి బోధలు తప్ప. ప్రజా సమస్యల ప్రస్తావనే ఉండదు. ఇదంతా ‘పులి-బాటసారి’ కథ బాపతే.