ఆస్పత్రిలో ఆరోగ్య శ్రీ సేవలు పెంచాలి: కలెక్టర్

– ప్రైవేట్ ఆస్పత్రులకు రోగులను పంపిస్తే కఠిన చర్యలు 
– డ్యూటీ సమయంలో ప్రభుత్వ డాక్టర్లు ప్రైవేట్ ఆస్పత్రులలో పనిచేస్తే డాక్టర్ పై, సంబంధిత ఆసుపత్రులపై చర్యలు 
– అవసరమైతే  ప్రైవేట్ ఆస్పత్రులను సీజ్ చేస్తాం: జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి 
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి ద్వారా  ప్రజలకు వీలైనన్ని మరిన్ని మంచి సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆసుపత్రి వైద్యులకు సూచించారు.బుధవారం ఆయన జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి లో వివిధ విభాగాల అధిపతులతో ఆసుపత్రి పని తీరుపై సమీక్షించారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన  ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కింద సేవలను పెంచాలని, అన్ని  రకాల రోగులను ఆరోగ్యశ్రీ కింద చూడాలని, ఏ ఒక్క విభాగం నుండి  రోగిని చూడలేదన్నమాట రాకుండా సేవలందించాలని అన్నారు. ప్రత్యేకించి ప్రభుత్వ ప్రధానాస్పత్రికి వచ్చిన రోగులను ప్రైవేటు ఆసుపత్రిలో చూసినట్లుగానే చికిత్స అందించాలని , ఆస్పత్రి ప్రవేశంలోనే  వారికి అవసరమైన సహాయం చేసేందుకు ప్రత్యేకించి ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని ,ఇందుకుగాను ఇద్దరు మనుషులను ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రోగులను ఎట్టి పరిస్థితులలో ప్రైవేట్ ఆసుపత్రికి పంపించకూడదని, ఒకవేళ అలా పంపించినట్లయితే సంబంధిత డాక్టర్, హెడ్ అఫ్ ది డిపార్ట్మెంట్ పై చర్య తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ప్రైవేట్ ఆస్పత్రుల నుండి  రోగం బాగా ముదిరిన తర్వాత చివరి క్షణాలలో ప్రభుత్వ ఆసుపత్రికి పంపిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలా ఎవరైనా పంపించినట్లయితే సంబంధిత ప్రైవేట్ ఆస్పత్రి పై సైతం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
డ్యూటీ సమయంలో ప్రభుత్వ డాక్టర్లు ఏదైనా ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్నట్లయితే ఆ డాక్టర్ పై చర్య తీసుకోవడమే కాకుండా, సంబంధిత ప్రైవేట్ ఆస్పత్రి పై సైతం కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే అలాంటి  ఆస్పత్రులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ముఖ్యంగా ప్రైవేట్ ఆస్పత్రులు డాక్టర్లను నియమించుకునే సమయంలో జాగ్రత్తగా పరిశీలించి తీసుకోవాలని, వీలైతే ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డిసిహెచ్ఎస్,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి లతో సంప్రదించి నియమించుకోవాలని చెప్పారు. ఆస్పత్రి డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటించాలని, అటెండెన్స్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని, సిబ్బంది ప్రవర్తనలో మార్పు రావాలని, వీలైనంతవరకు ప్రజలకు మంచి సేవలు అందించేందుకు చూడాలని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ కింద సేవలు పొందేందుకు ప్రజలు ఆధార్ కార్డు తో పాటు , తెల్ల రేషన్ కార్డు , ఆహార భద్రత కార్డు, ఒకవేళ హెల్త్ కార్డు ఉన్నట్లయితే హెల్త్ కార్డును తప్పనిసరిగా తీసుకురావాలని, పై కార్డులలో రోగి పేరు తప్పనిసరిగా ఉండాలని ఆయన సూచించారు. ఆయా విభాగాల వారీగా అధిపతులతో పనితీరును, సమస్యలను తెలుసుకున్న జిల్లా కలెక్టర్ సమస్యలన్నిటిని దశలవారీగా పరిష్కరిస్తామని, అందుబాటులో ఉన్న వనరులతో పనితీరు  మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి. పూర్ణచంద్ర, ప్రధాన ఆస్పత్రి పర్యవేక్షకులు నిత్యానంద్,  ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ రాజకుమారి, ప్రభుత్వ ప్రధానాస్పత్రి విభాగాల అధిపతులు, తదితరులు పాల్గొన్నారు.