వనమహోత్సవంలో ఈ ఏడాది 66.6 లక్షల మొక్కల లక్ష్యం: కలెక్టర్

– నాటిన ప్రతి మొక్క బతకాలి
– రహదారుల కు ఇరువైపులా, అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో మొక్కలు నాటాలి 
– క్రమ పద్ధతిలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలి
– శాఖల వారీగా సమీక్ష
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
వనమహోత్సవం కార్యక్రమం కింద ఈ సంవత్సరం నల్గొండ జిల్లాలో 66 లక్షల ఆరువేల మొక్కలు నాటేందుకు లక్ష్యాన్ని నిర్దేశించినట్లు జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. బుధవారం అయన జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వివిధ అంశాలపై  జిల్లా, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వనమహోత్సవం కింద నాటిన ప్రతి మొక్క బతకాలని,  మొక్కలు నాటేందుకు సరైన స్థలాలను ఎంపిక చేయాలని, అన్ని ప్రభుత్వ సంస్థలు, రహదారులకు. ఇరువైపులా తప్పనిసరిగా మొక్కలు నాటాలని, ఏ కార్యాలయం, రహదారి మొక్కలు నాటకుండా వదలకూడదని, గుంతల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే మొక్కల ఎంపిక,  భూమి సిద్ధం,ఎరువు వేయడం, మొక్కలు నాటిన తర్వాత వాటికి నీటిని పోయడం, సంరక్షించడం, వాచర్ ఏర్పాటు, మొక్కల సంరక్షణ వంటి వాటిపట్ల ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు .మొక్కలు నాటే కార్యక్రమం పై,అలాగే మొక్కల సంరక్షణ విషయమై ఫీల్డ్ అసిస్టెంట్ మొదలుకొని మేట్ వరకు శిక్షణ ఇవ్వాల్సిందిగా డిఆర్డిఓ ను ఆదేశించారు. రహదారులకు ఇరువైపులా స్థలం ఉంటే బహుళ  వరుసల మొక్కలు నాటాలని, జిల్లా స్థాయి కార్యక్రమం తో పాటు, నియోజకవర్గాలలో మొక్కలు నాటేందుకు సంసిద్ధంగా ఉండాలని, సంబంధిత శాసనసభ్యులను మొక్కలు నాటే కార్యక్రమానికి ఆహ్వానించాలని, జిల్లా అధికారులు వారికి నిర్దేశించిన లక్ష్యం ప్రకారం మొక్కలు నాటడాన్ని పూర్తి చేయాలని ఆయన సూచించారు.
అటవీ భూముల ఆక్రమణలను నియంత్రించాలి..
అటవీ భూముల కు సంబంధించిన అంశాలపై జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..  ఎక్కడ  అటవీ భూములు అన్యాక్రాంతం కావడానికి అవకాశం ఇవ్వకూడదని, ఎక్కడైనా అన్యాక్రాంతం అవుతున్నట్లు దృష్టికి వస్తే తక్షణమే పోలీసు, రెవెన్యూ దృష్టికి తీసుకురావాలని, కొత్త గా అన్యాక్రాంతం పై కఠినంగా వ్యవహరించాలని, ఎఫ్ఆర్వోలు వారి పరిధిలో అటవీ భూముల సరిహద్దులను  ఏర్పాటు చేయాలని సూచించారు.ఇసుక సరఫరా పై జిల్లా కలెక్టర్ సమీక్షిస్తూ నిబంధనల ప్రకారమే ఇసుక సరఫరా చేయాలని జిల్లాలో ఎక్కడ ఇసుక అక్రమ రవాణా జరగకూడదని అన్నారు. ఎక్కడైనా ఇసుక రవాణాలో అక్రమాలు జరిగినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని, ముఖ్యంగా ప్రభుత్వ పనులకు ఇసుకను తీసుకునే అధికారులు, ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలు సరిగా అమలు చేయాలని, జిల్లాలో గుర్తించిన ప్రాంతాలలో ఇసుక అక్రమ రవాణా  జరిగేందుకు ఆస్కారం ఉన్న ప్రాంతాలలో కఠిన చర్యలు చేపట్టి నిఘాను పెంచాలని ఆదేశించారు.
సీజనల్ వ్యాధులు..
సీజనల్ వ్యాధులపై కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ స్థాయి బృందాలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రత్యేకించి తాగునీరు, శానిటేషన్ ను  పరిశీలించి ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని, గురువారం ఉదయం 9 నుండి 11 వరకు గ్రామ స్థాయిలో  ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి , అనంతరం 11 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల లోపు తాగునీటి ట్యాంకులు,  లీకేజీలు, మరమ్మతులు అన్నిటినీ పరిశీలించాలని సూచించారు.ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో రెండు చోట్ల అంటువ్యాధులపై అవగాహన  సదస్సులను ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాలకు తప్పనిసరిగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పాటు, అందరూ అధికారులు హాజరు కావాలని అన్నారు. ఫ్రైడే ఫ్రైడే తప్పనిసరిగా  అన్ని గ్రామాలలో జరిగేలా చూడాలని, వైద్య ఆరోగ్య శాఖ తో పాటు, గ్రామస్థాయిలోని  అన్ని శాఖల సిబ్బంది, అధికారులు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.జిల్లా స్థాయిలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమం నిర్వహించినట్లుగానే ఈ శనివారం వరకు అన్ని మండల కార్యాలయాలలో సైతం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహించి కార్యాలయాలను శుభ్రంగా ఉంచడంతోపాటు, పిచ్చి మొక్కలు తొలగించాలని, చెత్తా,చెదారం, పోస్టర్లు వంటివి తీసివేయాలని, ఎలక్ట్రిక్ వైర్లు సరిచేయాలని, టాయిలెట్లు శుభ్రంగా ఉంచాలని, ప్రతి కార్యాలయంలో తప్పనిసరిగా తాగునీరు ఉంచాలని  సోమవారం రోజు ప్రజావాణి అనంతరం మండల స్థాయి అధికార బృందాలు ప్రతి కార్యాలయాన్ని తనిఖీ చేయాలని ఆదేశించారు.  జిల్లా ఎస్పీ శరత్ చంద్ర  పవార్ మాట్లాడుతూ ఎక్కడైనా అటవీ భూములు  అన్యాక్రాంతం అవుతుంటే తమకు సమాచారం అందిస్తే పోలీసు నుండి అవసరమైన సహకారాన్ని అందజేస్తామని, ప్రభుత్వ భూముల పరిరక్షణ చాలా ముఖ్యమని అన్నారు. ఎస్డిపిఓలు సీఐలు, ఎస్సైలు ఇసుక అక్రమ రవాణా, అలాగే  అటవీ భూముల అన్యాక్రాంతం కు సంబంధించి సమాచారం అందిన వెంటనే స్పందించాలని, వాటిని అన్యాక్రాంతం కాకుండా ఆపాలని అన్నారు. ఎక్కడైనా ఇసుక విషయంలో సమస్య ఉన్నట్లయితే స్థానిక ప్రజాప్రతినిధులకు సైతం సమాచారం ఇచ్చి వారి భాగస్వామ్యంతో సమస్యను పరిష్కరించేందుకు చూడాలని అన్నారు. కొత్త చట్టాలు అమలులోకి వచ్చినందున పోలీస్ అధికారులు అందరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.జిల్లా అటవీశాఖ అధికారి రాజశేఖర్ మొక్కలు నాటడం పై సలహాలు, సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టీ. పూర్ణచంద్ర, డిఆర్డిఓ నాగిరెడ్డి, జెడ్పి సీఈవో ప్రేమ్ కరన్ రెడ్డి, రెవెన్యూ, పోలీస్, అటవీశాఖ అధికారులు, మండలాల నుండి ఆర్డీవోలు, తహసిల్దారులు, ఎంపీడీవోలు, పోలీసు, అటవీ శాఖ అధికారులు, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.