వారికోసం కొంత స‌మ‌యం

Some time for themదేదీప్య భమిడి… చిన్నతనం నుండి తండ్రిలోని సుగుణాలకు ప్రభావితమయ్యారు. మానసికంగా ఎదగని పిల్లల స్థితిని చూసి చలించిపోయేవారు. ఆ పిల్లల పరిస్థితులపై అధ్యయనం చేశారు. వారికి మంచి భవిష్యత్తు అందించాలని సంకల్పించారు. ఆ సంకల్పమే ఆమెను ఓ మానసికవేత్తగా, మానసిక వికలాంగ పిల్లలకు బోధకురాలిగా మార్చింది. అటువంటి పిల్లలతో నాణ్యమైన సమయం గడిపితే విజయాలు సాధిస్తారని ఎంతో నమ్మకంగా చెబుతున్న ఆమె పరిచయం ఆమె మాటల్లోనే…

మా సొంతూరు తూర్పు గోదావరి జిల్లాలోని అమలాపురం దగ్గరి ముమ్మిడివరం గ్రామం. అమ్మ లక్ష్మి, నాన్న భమిడి భాస్కర రావు. వీరికి నేను పెద్ద కూతురుని. మావారు పవన్‌ కుమార్‌. మా కూతురు శ్రీవన్య. మా నాన్న మనుషులను అర్ధం చేసుకునే విధానం, ఇతరులపై చూపించే కృతజ్ఞతా భావం, అవతలి వారిని విశ్లేషించే గుణం చిన్నతనం నుండి నన్ను బాగా ఆకర్షించేవి. ఇదే నన్ను కొంత వరకు సైకాలజిస్ట్‌ అయ్యేలా చేశాయి. అలాగే నేను చదువుకున్న స్కూల్‌ పక్కనే వికలాంగుల పాఠశాల ఉండేది. అక్కడ నేను ఎక్కువగా చూసింది ‘డౌన్‌ సిండ్రోమ్‌’ పిల్లలని. వారు చూడడానికి ఏంతో అందంగా, ముద్దుగా, అమాయకంగా ఉండేవారు. మొదట్లో చూడగానే పలకరింపుగా నవ్వేవారు. నేను తిరిగి పలకరించేదాన్ని. రోజులు గడుస్తున్న కొద్ది వీళ్లెందుకు ఇలా ఉన్నారు? మనలాగా ఎందుకు నార్మల్‌గా లేరు? వాళ్లలో వాళ్లే ఎందుకు నవ్వు కుంటున్నారు? ఇలా ఎన్నో పశ్న్రలు తలెత్తాయి. ఈలోపు నా స్కూల్‌ చదువు, కాలేజీ చదువు కూడా అయిపోయింది.
వారి గురించి తెలుసుకొని
చాలా రోజుల గ్యాప్‌ తర్వాత డౌన్‌ సిండ్రోమ్‌ ఉన్న ఒక బాబు కనిపించాడు. ఇలాంటి పిల్లల వివరాలు తెలుసుకోవాలనే ఆలోచన వచ్చింది. ఇలాంటి పిల్లలకు వయసు పెరిగినా మెదడు పెరగదు, అందువల్ల వారు ఇలా ఉంటారని తెలుసుకున్నాను. వారికి ఏదైనా సహాయం చేయాలంటే దానికి సంబంధించిన కోర్సు చెయ్యాలని చెప్పారు. అప్పుడే మొదటి సారిగా బి.ధనలక్ష్మి టీచర్‌ని ఓ కాలేజీలో కలిశాను. ఆమెతో మాట్లాడుతుంటే ఓ విషయం తెలిసింది. ఆవిడ ఓ స్పెషల్‌ ఎడ్యుకేటర్‌ అని. ఆమె ద్వారా ఇటువంటి పిల్లల గురించి మరింతగా తెలిసింది. అప్పటికే నేను ఎమ్మెస్సీ సైకాలజీలో జాయిన్‌ అయ్యాను. అది పూర్తి చేసి ఠాకూర్‌ హరిప్రసాద్‌ ఇనిస్టిట్యూట్‌లో బి.ఎడ్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌లో చేరాను. ఇక్కడ నా గురువు రాజేశ్వరి దేవి. సబ్జెక్ట్‌లో ఎంత చిన్నడౌట్‌ వచ్చినా చక్కగా వివరించేవారు. బి.ఎడ్‌ తర్వాత డాక్టర్‌ జగదీష్‌ దగ్గర ఇంటర్‌షిప్‌ కోసం చేరాను. అక్కడ కూడా ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. నేను చేసిన కోర్సుల వల్ల పిల్లల్లో కొంత మంది ఎందుకిలా పుడతారు అనే నా ప్రశ్నకు సమాధానం దొరికింది.
కౌన్సెలింగ్‌ మొదలుపెట్టి
సంబంధించిన కోర్సులన్నీ పూర్తి చేసిన తర్వాత సాధన ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్‌ స్కూల్లో జాయిన్‌ అయ్యాను. ఇంతలో కరోనా వచ్చి వర్క్‌ ఫ్రొం హోమ్‌ మొదలయ్యింది. పిల్లలకి పాఠాలు చెప్తూనే మిగిలిన సమయాన్ని టెలీ కౌన్సెలింగ్‌కు వినియోగిస్తూ చాలా మందికి కౌన్సెలింగ్‌ ఇచ్చాను. ‘వారు కోలుకున్నాము, మాకు ధైర్యం వచ్చింది’ అని తిరిగి కాల్‌ చేసి చెప్పినపుడు తృప్తిగా అనిపించేది. ‘స్కూల్లోని కొంతమంది స్పెషల్‌ పిల్లలు నా దగ్గరకు వచ్చిన తర్వాత కొంత మెరుగయ్యారు’ అని వారి తల్లితండ్రులు చెప్పినపుడు చేస్తున్న పనికి సాటిస్ఫాక్షన్‌ అనిపించేది.
ఒక్క బిడ్డనైనా తీర్చిదిద్దాలని
మొదట్లో ఈ ఉద్యోగంలో జాయిన్‌ అయ్యేముందు ఎన్నో ఆలోచించాల్సి వచ్చింది. చాలా మంది వద్దు అని సలహా ఇచ్చారు. కానీ పేద పిల్లలకి నేను ఈ విధంగా ఎంతో చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇందులో జాయిన్‌ అయ్యాను. జాయిన్‌ అయిన తరువాత కనీసం ఒక్క బిడ్డనైనా తీర్చిదిద్దాలని అనుకున్నాను. రోజులు గడుస్తున్న కొద్దీ ఎంతో మంది తల్లిదండ్రుల నోటి నుండి ‘మనసుకి ఊరట లభిస్తోంది’ అనే విషయం వింటుంటే ఏదో తెలియని ఆనందం. ఇప్పుడు మరింత మంది హృదయాలను చేరుకోవాలి అనిపిస్తోంది.
మూడేండ్లు వచ్చే వరకు
నా అనుభవంలో తెలుసుకున్న విషయం ఏమిటంటే తల్లి గర్భంతో ఉన్నపుడు భార్యా, భర్తలు తీసుకోవల్సిన జాగత్త్రలు తీసుకోకపోవడం వల్ల కొంత మంది పిల్లలు ఇలా ఏదో ఒక వైకల్యంతో పుడుతున్నారు. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య నుండి బయటపడొచ్చు. ఆడవారు కూడా యుక్తవయసు నుంచే మరింత జాగ్రత్త పడితే ప్రీటర్మ్‌ బేబీస్‌ రిస్క్‌ని కూడా మనం కొంత వరకు తగ్గించవచ్చు. తల్లి గర్భం దాల్చిన రోజు నుంచి బిడ్డకు మూడేండ్లు వచ్చే వరకు బిడ్డ ఎదుగుదలను గమనిస్తూ వుండాలి. ఎందుకు పిల్లల్లో వచ్చే సమస్యలు ఏవైనా ఆ సమయంలోనే తెలుస్తాయి. ముందే సమస్యను గమనిస్తే త్వరగా పరిష్కరించుకోవచ్చు. మందుల వాడకం తగ్గించి సహజమైన పద్ధతుల ద్వారా సమస్యలను పరిష్కరించుకొనే ప్రయత్నం చేయాలి.
మన తెలివి తక్కువ ఆలోచన
పసి కందులను స్క్రీన్‌కి ఎంత దూరంగా ఉంచితే వారి మెదడు అంత చురుగ్గా పని చేస్తుంది. అలా కాకుండా మన పనిలో మనం ఉండి పిల్లలకి మొబైల్స్‌ ఇస్తూ, టీవీ పెట్టి తినిపిస్తూ వారిని స్క్రీన్‌కి వదిలేస్తే చాలా పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. దీని వల్ల పిల్లలు భౌతికంగా మనతో గడుతున్నా మానసికంగా దూరమవుతారు. మన పిల్లలు ఎలా ఉండాలని మనం ఆశిస్తున్నామో, మనం కూడా అలాగే ప్రవర్తించాలి. మానసికంగా ఎదగని పిల్లలకు ఏమీ తెలియదు, మొద్దులు, ఏమి చేయలేరు, చేతకానివారు అనుకుంటే మన తెలివితక్కువ ఆలోచన. వారి కోసం కొంత సమయం, అనువైన పరిసరాలు అందించి చూడండి, వారేం చేయగలరో అప్పుడు మీకే తెలుస్తుంది.
మీకూ ధైర్యాన్ని ఇస్తుంది
ఇటువంటి పిల్లల తల్లిదండ్రులకి ఒకటే చెప్తాను. మీ పిల్లలకి వైకల్యం ఉంది అని అనుకుంటే అది కేవలం మీ ఆలోచనలకే కానీ వారికి కాదు. మీ అపోహలను వదిలి వారి కోణం నుండి ఆలోచిస్తే వారి భవిష్యత్‌ ఎంతో అందంగా కనిపిస్తుంది. ప్రభుత్వాలు వీరికోసం ఎన్నో పథకాలను అందిస్తోంది. వాటిని సవ్యంగా వినియోగించుకుంటే వారి భవిష్యత్తుకి ఓ బాట కనిపించడమే కాదు మీకూ ధైర్యాన్ని ఇస్తుంది. ఒక పక్క సైకాలజిస్ట్‌గా గుర్తింపు పొందుతూనే, పిల్లల జీవితాలకు గుర్తింపు తేవాలని ఉంది. ముఖ్యంగా సమాజం ఇటువంటి పిల్లలను చూసే దృష్టిని మార్చాలి. ఆ మార్పును వారి తల్లిదండ్రుల సహాయంతోనే తీసుకురావాలి. దీనికోసమే నేను కృషి చేస్తున్నాను. ఉదయం 5:30గంటల నుండి రాత్రి 11 గంటల వరకు నా కృషి కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పుడైనా కాస్త బాధగానో, మనసుకు కష్టంగానో అనిపిస్తే మా క్లాస్‌లోని పిల్లలతో ఓ 10 నిమిషాలు గడిపితే చాలు అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా అనిపిస్తుంది.
– అచ్యుతుని రాజ్యశ్రీ, 9182704221