రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు..

– ప్రభుత్వాస్పత్రుల్లో అన్ని సౌకర్యాలు: వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
– కేపీహెచ్‌బీలో 100 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తోందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. కేపీహెచ్‌బీలో 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇటీవల ఎర్రగడ్డలో వెయ్యి పడకల ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు రెండేండ్ల నుంచి సీఎం, తన వెంట పడుతూ తన నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేయాలని కోరినట్టు చెప్పారు. నేడు దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపిస్తున్న కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు.
పథకాల అమలులో దేశంలో తెలంగాణ నెంబర్‌ వన్‌ స్థానంలో ఉందన్నారు. నిరుపేద గర్భిణులకు ప్రసవం కోసం ప్రభుత్వా స్పత్రుల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయన్నారు. గర్భి ణులకు న్యూట్రీషన్‌ కిట్లు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. నిరుపేదలకు ఏం కావాలో పుట్టుక నుంచి వారి ఎదుగుదల వరకు అన్నీ ఆలోచించిన గొప్ప మహా నాయకుడు సీఎం కేసీఆర్‌ అన్నారు.ఈ 100 పడకల ఆస్పత్రిలో 35 మంది డాక్టర్లు, 89 మంది సిబ్బంది ప్రజలకు అందు బాటులో ఉంటారని, అతి త్వరలోనే నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో తాను పర్యటించినప్పుడు అక్కడి ప్రజలను అడిగితే 10 రోజులకోసారి మంచినీరు వస్తుందని చెప్పారని తెలిపారు. నిత్యావసర ధరలు, పెట్రోల్‌, డీజిల్‌, ఇంధన ధరలను చరిత్రలో ఎన్నడూ లేనంతగా పెంచి పేదవాడిపై భారం మోపింది బీజేపీ సర్కార్‌ అని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపా ల్‌రెడ్డి, కార్పొరేటర్లు మందడి శ్రీనివాసరావు, సతీష్‌ గౌడ్‌, ముద్దం నరసింహ యాదవ్‌, జూపల్లి సత్యనారాయణ, మహేశ్వరి శ్రీహరి, సబియా గౌసుద్దీన్‌, మాజీ కార్పొరేటర్‌ తూము శ్రవణ్‌ కుమార్‌, పగడాల బాబురావు, నరేంద్ర చారి, బీఆర్‌ఎస్‌ డివిజన్‌ అధ్యక్షులు కృష్ణారెడ్డి పాల్గొన్నారు.