ఆగస్టు 11న నీట్‌ పరీక్ష

న్యూఢిల్లీ: నీట్‌ పరీక్షను ఆగస్టు 11న నిర్వహిస్తున్నట్లు నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎన్‌బిఇఎంఎస్‌) శుక్రవారం ప్రకటించింది. రెండు షిఫ్ట్‌ల్లో ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష నిర్వహణకు సంబంధించిన ఇతర వివరాలు ఎన్‌బిఇఎంఎస్‌ వెబ్‌సైట్‌లో వుంచుతారు. నిర్దిష్ట పోటీ పరీక్షల సమగ్రతపై సందేహాలు, అనుమానాలు తలెత్తడంతో ముందస్తు జాగ్రత్తగా నీట్‌ పిజి ప్రవేశ పరీక్షను వాయిదా వేసినట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. జూన్‌ 23న ఉదయం పరీక్ష జరగానికి కేవలం కొద్ది గంటల ముందు ఈ ప్రకటన వెలువడింది. జులై 2న కేంద్ర హోం శాఖ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ, ఎన్‌బిఇఎంఎస్‌ దాని సాంకేతిక భాగస్వామి టిసిఎస్‌, సైబర్‌ సెల్‌ అధికారులు పాల్గొని నీట్‌ పిజి సన్నద్ధతపై చర్చించారు. రాబోయే రోజుల్లో పరీక్ష నిర్వహణకు వ్యవస్థ యొక్క ధృఢత్వాన్ని ఈ సమావేశంలో సమీక్షించారు.
నిజాయితీ అభ్యర్ధుల ప్రయోజనాలు దెబ్బతింటాయి: కోర్టుకు కేంద్రం అఫిడవిట్‌
వివాదాస్పదంగా మారిన నీట్‌ పరీక్షను రద్దు చేయడం సహేతుకమైన చర్య కాదని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలియచేసింది. దీనివల్ల నిజాయితీగా పరీక్ష రాసిన లక్షలాదిమంది అభ్యర్ధుల ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటాయని పేర్కొంది. అభ్యర్ధులు, కోచింగ్‌ సంస్థలు, తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్లపై ప్రతిస్పందిస్తూ కేంద్రం కోర్టుకు అఫిడవిట్‌ సమర్పించింది. మొత్తంగా ఈ అవకతవకలు, అక్రమాలపై సమగ్రంగా దర్యాప్తు జరపాలని సిబిఐని కోరినట్లు కేంద్ర విద్యాశాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్ష విశ్వసనీయతను దెబ్బతీసేలా పెద్ద స్థాయిలో ఎలాంటి రుజువులు లేనందున, ఇప్పటికే ఫలితాలు వెల్లడించిన పరీక్షను రద్దు చేయడం సహేతుకం కాదని కేంద్రం పేర్కొంది. ఈ నెల 8న కోర్టు ఈ పిటిషన్లపై విచారణ జరపనుంది.