– కాంగ్రెస్ విమర్శలు
న్యూఢిల్లీ: 6వ తరగతి పాఠ్య పుస్తకాల ప్రచురణ, పంపిణీల్లో జాప్యంపై కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శించింది. పిల్లల చదువును విద్యాశాఖ నాశనం చేస్తోందని, కేంద్ర ప్రభుత్వ అసమర్థత ప్రతీరోజూ కొత్త స్థాయిలకు చేరుకుంటుందని తెలిపింది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘నేషనల్ టెస్టింగ్ అథారిటీ ద్వారా పరీక్షల ప్రక్రియను నాశనం చేసిన తరువాత నరేంద్ర మోడీకి చెందిన విద్యా మంత్రిత్వ శాఖ మా పిల్లల చదువును నాశనం చేస్తోంది’ అని జైరాం రమేష్ విమర్శించారు. ‘విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సిఇఆర్‌టి) 6వ తరగతి విద్యార్థులకు సైన్స్, గణితం, సామాజిక శాస్త్రాల పాఠ్యపుస్తకాలను ప్రచురించడంలో విఫలమైంది’ అని విమర్శించారు. నేషనల్ సిలబస్ అండ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కమిటీ (ఎన్‌ఎస్‌టిసి) ఇంకా పాఠ్యపుస్తకాలను ఖరారు చేయలేదని చెప్పారు. ముద్రణకు మరో 10 నుంచి 15 రోజులు పడుతుందని అన్నారు. కొత్త పుస్తకాలను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడానికి రెండు నెలలు పడుతుందని అధికారులు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ అసమర్థత ప్రతీ రోజూ కొత్త స్థాయిలకు చేరుకుంటుందని విమర్శించారు. 2024-25 సంవత్సరానికి సంబంధించి 3వ, 6వ తరగతులకు కొత్త పాఠ్యపుస్తకాలు ప్రవేశపెడతామని ఎన్‌సిఇఆర్‌టి గతంలోనే ప్రకటించింది. అయితే 6వ తరగతి పాఠ్య పుస్తకాలు ఆలస్యమవుతున్నాయి. ఏప్రిల్ నుంచే వీటిని బోధించాల్సి ఉంది.