నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద టీచర్లకు రెండు లక్షల రూపాయలు, హెల్పర్లకు లక్ష రూపాయలవ్వాలనీ, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 10ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద నిరసనకు ప్రయత్నించిన అంగన్‌వాడీలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని సీఐ టీయూ తీవ్రంగా ఖండించింది. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. శుక్రవారం ఈ మేరకు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు, ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ ఒక ప్రకటన విడుదల చేశారు. కొడంగల్ చౌరస్తాలో నిరసన తెలుపుతున్న అంగన్‌వాడీ టీచర్లపైనా, హెల్పర్లపైనా పోలీసులు దాడి చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. పోలీసుల అత్సుత్సాహంతో అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి పి.జయలక్ష్మి, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు నర్సమ్మతో పలువురు టీచర్లు, హెల్పర్లు, సీఐటీయూ నాయకులకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. అతి తక్కువ డబ్బులిచ్చి 65 ఏండ్లు దాటిన అంగన్‌వాడీ టీచర్లను, హెల్పర్లను పంపాలనే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరారు. లేదంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.