ఆ నలుగురు డాక్టర్లపై చర్యలు తీసుకోండి

– డాక్టర్‌ శేఖర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తనపై దాడి చేసిన డాక్టర్లు పల్లం ప్రవీణ్‌, బొంగు రమేశ్‌, రాథోడ్‌, వినోద్‌ కుమార్‌లపై చర్యలు తీసుకోవాలని డాక్టర్‌ శేఖర్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర వైద్యవిద్య సంచాలకుల కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. సాధారణ బదిలీలపై ప్రభుత్వం ఇచ్చిన జీవో అమలు చేయాలని డీఎంఈకి వినతిపత్రం ఇచ్చేందుకు తాను వచ్చినట్టు తెలిపారు. ఆ జీవో అమలు చేస్తే హైదరాబాద్‌లో పని చేస్తున్న వైద్యులు, ఇతర జిల్లాలకు, ఇతర జిల్లాల వైద్యులు హైదరాబాద్‌కు 40 శాతం బదిలీ అవుతారని తెలిపారు. ఈ బదిలీలను అడ్డుకునేందుకు ఆ నలుగురు డాక్టర్లు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తనను డీఎంఈకి వినతిపత్రం ఇవ్వకుండా అడ్డుకుని దాడి చేశారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ముసుగులో ఎన్నో ఏండ్లుగా హైదరాబాద్‌ నగరంలో వారు తిష్ట వేశారని చెప్పారు. వాటిపై ప్రశ్నించినందుకే తనపై దాడి చేశారని చెప్పారు. వారిపై చర్యలు తీసుకునేంత వరకు డీఎంఈ కార్యాలయం ముందే బైఠాయిస్తానని హెచ్చరించారు.
డాక్టర్‌ శేఖర్‌ మానసిక రోగిలా ప్రవర్తించారు
బదిలీలకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన జీవోను అమలు చేయాలని తాము డీఎంఈని కోరినట్టు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం నాయకులు డాక్టర్‌ పల్లం ప్రవీణ్‌, డాక్టర్‌ బొంగు రమేష్‌ తదితరులు తెలిపారు. తాము డీఎంఈతో సమావేశమయ్యేందుకు వెళ్లగా, శేఖర్‌ తమను అనవసరంగా అడ్డగించి వాగ్వాదానికి దిగారని తెలిపారు. దీంతో తోపులాట జరిగిందని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో తమపై అనవసరం, వైట్‌ పెట్రోల్‌ పోసి తగలబెట్టాలంటూ ఒక మానసిక రోగిలా ప్రవర్తించారని చెప్పారు. తోటి వైద్యుడే అని సహిస్తే, నేడు డీఎంఈ కార్యాలయం వద్ద గొడవకు దిగారని చెప్పారు. అతనితో రోగులకు కూడా ఇబ్బందేననీ, వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.