నేడు, రేపు మలయాళీల జాతీయ సమ్మేళనం

– కేరళం మంత్రి వాసవన్‌ హాజరు
– తొలిసారిగా హైదరాబాద్‌లో నిర్వహణ
– భారీగా సన్నాహాలు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
మలయాళీల జాతీయ సమ్మేళనం శని, ఆదివారాల్లో తెలంగాణలో జరగనుంది. తొలిసారిగా హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు భారీగా సన్నాహాలు చేస్తున్నారు. 17వ జాతీయ సమ్మేళనానికి కేరళం రాష్ట్ర మంత్రి వాసవన్‌తోపాటు ఆలిండియా మలయాళీల అసోసియేషన్‌ జాతీయ అధ్యక్షులు గోకులం గోపాలన్‌ వస్తున్నారు. వందలాది మంది హాజరయ్యే ఈ కార్యక్రమాన్ని నగరంలోని శ్రీనగర్‌లో ఉన్న సత్యసాయి నిగమానిగంలో నిర్వహించనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ శాఖలు సంయుక్తంగా హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఈ కార్యక్రమం సందర్భంగా బహిరంగసభ సైతం ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న మళయాళీలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇతర అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు. శనివారం చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఎంటర్‌ప్రైజెస్‌(ఎంఎస్‌ఎంఈ) నగరంలోని యూసుఫ్‌గూడలో మొదటి కార్యక్రమం చేపట్టనున్నారు. ఈనెల ఏడున ఆలిండియా మళయాళీల జాతీయ కమిటీని సైతం ఎన్నుకోనున్నారు. ఇదిలావుండగా ఏడున జరిగిన బహిరంగసభలో నిరుపమ్‌ క్రియేషన్స్‌ సంస్థ మ్యూజికల్‌ నైట్‌ నిర్వహించనుంది.