– ఒప్పందంలో 10 శాతమే అందజేత
– గడువు ముగిసి ఏడాదైనా.. బీఎంసీకి వాహనాలు అందించని ఇవీట్రాన్స్
ముంబయి : మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్)కు చెందిన అనుబంధ సంస్థ ఇవీట్రాన్స్ ప్రయివేటు లిమిటెడ్ గడువు సమయంలో విద్యుత్ బస్సుల డెలివరీలో విఫలం అయ్యింది. బృహన్ ముంబయి మున్సిపాల్ కార్పొరేషన్ (బీఎంసీ)కు చెందిన స్వయంప్రత్తి సంస్థ బృహన్ ముంబయి ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్ (బీఈఎస్‌టీ)కి ఒప్పందం ప్రకారం 2100 విద్యుత్ బస్సులను అందించాల్సి ఉండగా.. కేవలం 185 యూనిట్లను మాత్రమే డెలివరీ చేసింది.
సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) ద్వారా పొందిన వివరాలతో ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఓ కథనం వెలువరించింది. విద్యుత్ బస్సుల కోసం బీఎంసీ రూ.493 కోట్లను బెస్ట్‌కు బదిలీ చేసింది. ఇందులో రూ.205.8 కోట్లను ఇవీట్రాన్స్‌కు అడ్వాన్స్‌గా చెల్లింపులు చేసింది. మే 2022లో ఇవీట్రాన్స్ వర్క్ ఆర్డర్‌ను సాధించింది. 2023 ఆగస్టు కల్లా 2100 బస్సులను అందజేయాల్సి ఉండగా.. ఏడాది గడిచిన ఇప్పటికీ 10శాతం లోపే డెలివరీ చేయడం గమనార్హం. బీఎంసీ, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, బీఈఎస్‌టీ అందించిన సమాచారం ప్రకారం.. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు కోసం బీఈఎస్‌టీకు బీఎంసీ రూ.493 కోట్లను బదిలీ చేసింది. ఇందులో ఎవీట్రాన్స్‌కు రూ. 205.8 కోట్లు అడ్వాన్స్ కింద చెల్లించింది.
బస్సుల డెలివరీ జాప్యం గురించి బిఇఎస్‌టి జనరల్ మేనేజర్ అనిల్ డిగ్గికర్ మాట్లాడుతూ.. ”బస్సులకు సంబంధించిన విడిభాగాల సరఫరాలో కొన్ని సమస్యలు నెలకొన్నాయని సరఫరాదారు పేర్కొన్నారు. తద్వారా వాటి సరఫరాలో జాప్యం జరిగింది. ఈ విషయమై మేము గతేడాది ఇవిట్రాన్స్‌కు నోటీసు పంపాము. ఆ తర్వాత కూడా నోటీసులను అందించాము.” అని అన్నారు.
”బ్యాటరీ తయారీకి అవసరమైన భాగాలను కొనుగోలు చేయడం ప్రధాన సమస్య. మా ఈవీ బస్సులలో బ్యాటరీని ఛాసిస్‌లో ఉంచారు. దీంతో తయారీ వ్యయంలో 60 శాతం దానికే వెళ్తోంది. ఇండో-చైనా ఉద్రిక్తతల కారణంగా మేము చైనా నుంచి అవసరమైన ముడిసరుకును పొందలేక పోయాము. ఇది ఉత్పత్తిలో జాప్యానికి కారణమయ్యింది.” అని ఇవీట్రాన్స్ ప్రతినిధి పేర్కొన్నారు.
ఎలక్టోరల్ బాండ్‌ల కొనుగోలుదారుల్లో మేఘా ఇంజనీరింగ్ రెండవ స్థానంలో ఉంది. రూ.966 కోట్ల బాండ్లు కొనుగోలు చేయగా.. అందులో రూ.584 కోట్లు బిజెపికి కేటాయించిన విషయం తెలిసిందే. ఆర్‌టీఐ ప్రకారం.. 2022లో 20 బస్సులు, 2023లో 72 యూనిట్లు, ఈ ఏడాదిలో ఇప్పటివరకు 93బస్సుల చొప్పున డెలివరీ అయ్యాయి. ”బస్సులు దశలవారీగా వస్తున్నందున చెల్లింపులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఇవీట్రాన్స్ ఏవైనా తీవ్ర నిబంధనలను ఉల్లంఘిస్తే.. ఆ సంస్థ తమ వద్ద డిపాజిట్ చేసిన బ్యాంక్ గ్యారంటీ ఉంది. ఒప్పందంలో ఆలస్యమైన డెలివరీకి జరిమానా విధించే నిబంధన ఉంది. అయితే.. 2,100 బస్సులు మొత్తం మాకు అందిన తర్వాత మాత్రమే ఇది విధించబడుతుంది.”అని బీఈఎస్‌టీ అధికారి ఒక్కరు తెలిపారు.