మూడు రోజులపాటు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించాలి: కలెక్టర్

– పిచ్చి మొక్కలు.. చెత్తను తొలగించాలి
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలలో రానున్న 3 రోజులపాటు ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు.శనివారం ఆయన జిల్లా అధికారులు, మండలాల ప్రత్యేక అధికారులు, గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారులతో  గ్రామాలలో స్పెషల్ సానిటేషన్  డ్రైవ్ పై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామపంచాయతీ ఆవరణ తోపాటు, ఇతర ప్రభుత్వ సంస్థలు, రహదారులకు ఇరువైపులా పిచ్చి మొక్కలు లేకుండా తొలగించాలని, చెత్తా,చెదారాన్ని తీసివేయాలని ఇందుకుగాను గడ్డి, పిచ్చిమొక్కలు తొలగించేందుకు గ్రామపంచాయతీల వారిగా  గడ్డి కొత  యంత్రాలు కొనుగోలు చేయాలని ఆదేశించారు.  ప్రతి ప్రభుత్వ సంస్థ ఆవరణలో శుభ్రంగా ఉండేలా చూడాలని అన్నారు. అన్ని కార్యాలయాలలో తాగునీటిని ఏర్పాటు చేయడమే కాకుండా మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచాలని, అవన్నీ పనిచేసే పరిస్థితికి తీసుకురావాలని, ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపోయినా, వేలాడుతున్నా సరిచేయాలని సూచించారు. బుధవారం వరకు అన్ని గ్రామాలలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించి శుభ్రంగా ఉంచాలని, గురువారం ప్రజావాణి తర్వాత వీటిని తనిఖీ చేయడం జరుగుతుందని చెప్పారు.
జిల్లా స్థాయిలో ఇప్పటికే ప్రారంభమైన కార్యక్రమం..
జిల్లాస్థాయిలో అన్ని కార్యాలయాల ఆవరణలను శుభ్రం చేసే కార్యక్రమాన్ని ఇదివరకే చేపట్టడం జరిగిందని, సోమవారం జిల్లా స్థాయి ప్రజావాణి తర్వాత మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల వరకు అన్ని కార్యాలయాలను ఇన్చార్జి అధికారులు తనిఖీ చేయడం జరుగుతుందని వెల్లడించారు. ఎక్కడైనా చెత్తా,చెదారం కనిపించినా, కార్యాలయ ఆవరణలో పరిశుభ్రంగా లేనట్లయితే సంబంధిత జిల్లా అధికారులే బాధ్యత వహించవలసి ఉంటుందని తెలిపారు. సోమవారం మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ఈ సోమవారం సైతం గ్రామపంచాయతీ కార్యదర్శులు హాజరుకావాలని ఆదేశించారు. మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమంలో ఒక్కో గ్రామపంచాయతీ వారిగా సమగ్రంగా సమీక్ష చేయాలని ఎంపీడీవోలను ఆదేశించారు. అనంతరం మండల స్థాయిలో కో-ఆర్డినేషన్ సమావేశాన్ని నిర్వహించాలని చెప్పారు. ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించడమే కాకుండా ఆన్లైన్లో సైతం పరిష్కరించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి. పూర్ణచంద్ర , అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, జిల్లా అధికారులు, మండలాల ప్రత్యేక అధికారులు, తదితరులు ఈ టెలికాన్ఫరెన్సు కు హాజరయ్యారు.