”పార్టీ ఫిరాయించే వారిని రాళ్లతో కొట్టండి. మరోసారీ ఎన్నికల్లో నిలబడితే ఓటుతో వారికి బుద్ది చెప్పండి. అవసరాలకోసం, అధికారం కోసం, డబ్బుల కోసం పార్టీ మారడమంటే ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేయడమే. ప్రజలు ఏ లక్ష్యంతో ఎన్నుకున్నారో దాన్ని పక్కన పెట్టిన వారిని.. రీకాల్ చేసే అధికారం ప్రజలకుంటేనే ఫిరాయింపులు ఆగుతాయి. ఒక పార్టీ నుంచి గెలిచి, మరో పార్టీలోకి దూకడం ప్రజాస్వా మ్యానికి గొడ్డలి పెట్టు. ఫిరాయిపులను పూర్తిగా నిషేదించాలి” అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నినదించిన గొంతులు నేడు ఆదే బాట పడుతున్నాయి. మీ ఇంటికి మా ఇల్లెంత దూరమో… మా ఇంటికి మీ ఇల్లూ అంతే దూరముంటుందనే నానుడిని వంట పట్టించుకుంటున్నారు. మనం ఎంత వేగంగా బంతిని గోడకు కొడితే అంతే వేగంగా అది మనకు తగులుతుంది. మనకు తగిలేటప్పుడు ఏంచేయాలో చూద్దాం.. ముందు ఎదుటివాడిని ఎంతగట్టిగా కొట్టామనే దానిపైనే దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. ఫిజిక్స్‌లో దీన్నే చర్య, ప్రతి చర్య అంటారు. ప్రస్తుతం దేశంలోని రాజకీయపార్టీలు, నేతలు ఈ ఫార్మూలానే దత్తత తీసుకున్నట్టనిపిస్తోంది. ఫిరాయింపులను గట్టిగా వ్యతిరేకించే కాంగ్రెస్ అధిష్టానం సైతం తెలంగాణ రాష్ట్రానికొచ్చేసరికి ప్లేటు ఫిరాయించిందనే అపవాదును మూటగట్టుకుంటున్నది. ఒక పార్టీ టికెట్ నుంచి గెలిచిన అభ్యర్థులు, మరో పార్టీలో చేరడం అనైతికమని అసెంబ్లీ ఎన్నికల ముందు చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పుడు చేస్తున్నదేమిటో తెలంగాణ సమాజమే కాదు యావత్ దేశం గమనిస్తున్నది. పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు… బీఆర్ఎస్ ఆడిన ఆటనే మేమాడు తున్నామని సమర్ధింపులు, సన్నాయి నొక్కులు. వాళ్లాడింది తప్పుడు ఆటే… అలాగని మీరూ అదే ఆటాడుతారా? వాళ్లాడిన తొండాటకు విసిగెత్తిన తెలంగాణ ప్రజలు తట్టా బుట్టా సర్ది ఇంటికి సాగనంపారు. నిన్న అది తప్పయినప్పుడు… నేడు ఒప్పెలా అవుతుంది?
– ఊరగొండ మల్లేశం