పిల్లల భోజనం – జాగ్రత్తలు

పిల్లల భోజనం - జాగ్రత్తలుప్రతిరోజూ పిల్లలు స్కూల్లో ఎదుర్కొనే ముఖ్యమైన సమస్య లంచ్‌ బాక్స్‌ తినేప్పుడు ఏర్పడే పరిస్థితులు. సాధారణంగా ఏ స్కూల్లో అయినా లంచ్‌ పిరియడ్‌కు నియమిత కాల వ్యవధి వుంటుంది. ఆ సమయంలోనే తినెయ్యాలి. కొంతమంది పిల్లల తల్లిదండ్రులు స్వయంగా వచ్చి తినిపిస్తుంటారు. మిగతా పిల్లలు ఎవరికి వారే తినేయాలి. ఏ పేచీ లేకుండా తింటే పర్వాలేదు. కానీ తినడానికి మొరాయించే పిల్లల పట్ల టీచర్లు కొంత శ్రద్ధ పెట్టాలి. పిల్లలు టీచర్లకు, ఆయాలకు మాలిమి అయితే పేచీలు లేకుండా భోజనం చేస్తారు.
పిల్లల మనస్తత్వ శాస్త్ర నిపుణుల అభిప్రాయం ప్రకారం, పిల్లలు ప్రతి పనిని తమంతట తామే చేయగలమనే ఫాల్స్‌ కాన్ఫిడెన్స్‌లో ఉంటారు. పిల్లలు చేసే పలు చర్యల్లో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే భోజనం చేయడంలో కూడా పిల్లలు తమంతట తాము తినడానికి ఇష్టపడతారు. కానీ ఎలా తినాలో పూర్తిగా తెలియక అన్నాన్ని చుట్టూ కింద పడేస్తూ, సరిగ్గా నమలకుండానే మింగేస్తుంటారు. చాలారకాల ఆహార పదార్థాలను తినాల్సిన పద్ధతుల్లో కాకుండా తమకు తోచినట్టుగా తినడం వంటి సమస్యలు ఏర్పడతాయి. అటువంటి సమయాల్లో ఆయా కానీ, టీచర్‌ కానీ తినిపించడం మొదలుపెడతారు. ఇది సరయిన పద్ధతి కాదు. తమ పిల్లలకు టీచరే స్వయంగా తిన్పించడం గమనించిన తల్లిదండ్రులు సంతోషపడినప్పటికీ, ఇలా చేయడం వల్ల రెండు రకాల నష్టాలు ఉన్నాయి. మొదటిది పిల్లలు, అడ్డుకున్నారనే వ్యతిరేక భావనకు లోనవుతారు. రెండోది, ఎప్పుడు ఎవరో ఒకరు తినిపించడం అలవాటయిపోయి వారంతట వారు పొందికగా ఆహారాన్ని తినలేరు. కాబట్టి ఈ క్రింది సూచనలను పాటించడం మంచిది.
1) పిల్లలు తినేటప్పుడు చుట్టూ చల్లుకుంటూ, కింద పడేస్తూ తింటుంటే చిరాకు పడకూడదు.
2) కోపంగా చూస్తూ అరవకూడదు.
3) వారి లంచ్‌ బాక్సును చేత్తో లాక్కుని, మీరే తిన్పించడానికి ప్రయత్నించకూడదు.
4) స్పూన్‌తో తినడం నేర్పేటపుడు, వారికి ఎదురుగా సరయిన భంగిమలో కూర్చుని, మీరు తింటూ వారికి చూపించాలి. పదే పదే చూడడం ద్వారా, చేత్తో చెంచా పట్టుకోవడం, దానిని తమ నోటిదాకా కదలకుండా తీసుకుని వెళ్లడం వంటి పనులు త్వరగా నేర్చుకుంటారు.
5) తినేటపుడు నాప్‌కిన్‌ ఉపయోగించడం, మంచినీళ్ల గ్లాసును దూరంగా పెట్టుకోవడం వంటి అలవాట్లను కూడా ఇలాగే నేర్పించాలి.
6) పిల్లలు అన్నాన్ని వదిలేస్తే వారిని కోపగించుకోకూడదు. అందుకు గల కారణాలను తల్లిదండ్రులతో సంప్రదించి తెలుసుకోవాలి.
7) తినే పద్ధతుల్లో తేడాలు ఉన్నట్టే పిల్లల ఆహార సమయాల్లో కూడా తేడాలు ఉండవచ్చు. మీరు ఇచ్చే లంచ్‌ పిరియడ్‌ అందుకు ముందో వెనకో కావచ్చు. ఫలితంగా వారికి పెట్టిందంతా తినాలనే నియమానికి కట్టుబడి ఉండడం చేతకాదు. ఈ విషయంలో తల్లిదండ్రుల అవగాహనను కూడా పెంచాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే!
8) లంచ్‌ బాక్సులో, అన్నాన్ని తినకుండా వదిలేస్తున్నాడనే ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులకు దీనిపై వారికి సమగ్రమయిన అవగాహనను కలిగించాలి. తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పడం ఇష్టం లేక ఆయాలు లంచ్‌ బాక్సును క్లీన్‌ చేసి, తల్లిదండ్రులను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తారు. ఇదికూడా సరయినది కాదు.
9) లంచ్‌ సమయంలో తల్లిదండ్రులే వచ్చి పిల్లలకు తినిపించడానికి అనుమతి ఇవ్వకపోవడమే మంచిది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో అనుమతించాల్సి వచ్చినపుడు, వారికి అందరితో పాటూ కూర్చుని తిన్పించేలా కాకుండా, విడిగా వేరొక గదిని అందుకు కేటాయించాలి.
డా|| హిప్నో పద్మా కమలాకర్‌, 9390044031
కౌన్సెలింగ్‌, సైకో థెరపిస్ట్‌, హిప్నో థెరపిస్ట్‌