‘సెల్‌ఫోన్ కరాబైంది. రిపేర్ చేయించుకుని ఫోన్‌కు కొత్త పౌచ్ వేయించుకుని వద్దాం… అలాగే టెంపర్ గ్లాస్ కూడా వేయించాలి. ఎక్కడికి పోదాం’ అని ఎవరి నడిగినా టక్కున చెప్పే సమాధానం అబిడ్స్‌లోని జగదీష్ మార్కెట్. అది పానీపూరికి, బ్రెడ్ అమ్లెట్కు కూడా బాగా ఫేమస్. వాటిని కూడా లాగించే యొచ్చు…పదా అని ఎగేసుకుని పోయారనుకో, తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటారా? అక్కడ పార్కింగ్ లేదు. కొండంతా రాగం తీసి… బొంగురు గొంతేసుకుని పాట పాడావు. పార్కింగ్ లేదని చెప్పడం కూడా ఓ సమస్యా. ఏం చెబుతున్నావ్, అది చెప్పడానికేనా? టైమ్ వేస్టని చికాకు పడేరు. అక్కడే ఉంది కిటుకు. జగదీష్ మార్కెట్లో అన్ని రకాల రిపేర్లు, దో నెంబర్ దందా కూడా నడుస్తుంది. రాష్ట్ర నలుమూలల నుంచి వేల మంది అక్కడికి వస్తుంటారు. ఆ పెద్ద మార్కెట్‌కు పార్కింగ్ లేదు. బైక్ పార్కు చేయలంటే పెద్ద యుద్ధంచేయాలే. ఏదో ఒక సందులో బండిని ఇరికించి సెల్‌ఫోన్ రిపేర్ షాప్‌కు వెళ్లావే అనుకో అప్పటికే అక్కడ చాలామంది ఉంటారు. ఎప్పుడు రిపేర్ చేసుకుని బయపడాలా అని నీ పరేషాన్లో నీవుంటావు. అప్పుడు ఎంటరవుతారు మన పోలీస న్నలు. నో పార్కింగ్ ప్లేస్‌లో బైక్ ఉందని, బలవంతంగా ట్రాఫిక్ రికవరీ వాహనంలో ఎక్కించుకుని రరుమని పోతారు. అప్పుడు నీ బీపీ రెండువందల బార్డర్ దాటుతది. ఏ పోలీస్‌స్టేషన్? అక్కడ తెలిసిన వారేవరైనా ఉన్నారా?, అప్పటికే బైక్‌పై చలాన్లు ఉన్నాయా? అడ్రస్ కనుక్కుని పోవడానికే టైమ్ కరిగిపోతుంది. అప్పుడు తెలుస్తుంది పార్కింగ్ విలువ. అక్కడ పార్కింగ్ లేదని జీహెచ్ఎంసీకి, ట్రాఫిక్ పోలీసులకు తెలుసు. అయినా ఏమీ చేయలేరు. దుకాణాలను మూయించే ధైర్యం లేదు. ప్రత్యా మ్నాయంగా పార్కింగ్ ఏర్పాటు చేసే సాహసం చేయరు. షాపు యజమానులను ఏమనరు. కానీ బైక్, కార్లపై తమ జులుం చూపిస్తారు. ‘మీ టార్గెట్‌ను పూర్తి చేసుకోవడానికి మమ్మల్నెందుకు బ్రో.. టార్గెట్ చేస్తున్నారు’ అని వాహనాదారులు వాపోతున్నారు.
– గుడిగ రఘు