శేఖర్ ఆనందంతో గాల్లో తేలిపోతున్నాడు. అర్జెంటుగా కిలో స్వీటు తెచ్చాడు. ఇంటి చుట్టూ కనపడ్డ వారికి పంచాడు! ఇంట్లోకి వచ్చినా కాలు నిలవటం లేదు! అటూ ఇటూ తిరుగుతూ, ఇంట్లోని వస్తువులన్నీ అట్నుంచి ఇటూ, ఇట్నుంచి అటూ కదిలిస్తున్నాడు.
”శ్రీవారూ మీ ఆనందాన్ని కొంచెం అదుపులో పెట్టుకోండి. మీరు ఇలా సామాన్ల ప్లేసులు మార్చకండి! ఏవి ఎక్కడున్నాయో నేను వెదుక్కోవాల్సి వస్తుంది!” అన్నది లక్ష్మి నవ్వుతూ.
”ఇండియా కప్పు కొట్టినప్పటి నుండి నాన్న పిచ్చ హ్యాపీగా ఉన్నాడమ్మా!” అన్నాడు బంటి ఎగిరి గంతులు వేస్తూ.
”ఇండియా! అంటావేంట్రా! భారత్ అనాలి” అన్నాడు శేఖర్.
”రెండూ ఒకటే కదా!” అన్నాడు బంటి మళ్లీ గంతులు వేస్తూ.
”రెండూ ఒకటే కాదు! మన దేశం భారత్! నీకు ఎంత చెప్పినా తెలియటం లేదు! పిల్ల వెధవా! అన్నీ పిల్ల చేష్టలే!” అన్నాడు శేఖర్ చిరాకుగా.
”పిల్ల చేష్టలు చూసి పెద్దవాళ్లు ఆనందించాలి! కాని చిరాకు పడతారేం!” అన్నది లక్ష్మి.
”నీకు తెలియదు! లక్ష్మి! పిల్ల చేష్టలు దేశానికి చాలా ప్రమాదం!” అన్నాడు శేఖర్ గంభీరంగా.
”సర్లెండి! ఇండియా అదే భారత్ ఫైనల్లో గెలిచిన రోజు కన్నా ఈ రోజే ఎక్కువ ఆనందంగా కనబడుతున్నారు! ఏమిటీ విశేషం!” కుతూహలంగా అడిగింది లక్ష్మి.
”అదీ అలా అడుగు! భారతజట్టును ప్రధాని ఎంతో ప్రత్యేకంగా అభినందించారు! నీకు తెలుసా? ఎంతో విలువైన తన సమయాన్ని రెండు గంటల పాటు క్రికెట్ ప్రపంచ ఛాంపియన్లతో గడిపారు! నెహ్రూ ఎప్పుడైనా, రెండు నిమిషాలైనా క్రికెటర్లతో గడపలేదు! అందుకే నెహ్రూ వల్ల ఈ దేశానికి ఎంతో నష్టం జరిగింది!” అన్నాడు శేఖర్.
”చాచా నెహ్రూ కాలంలో మనకు ప్రపంచకప్పు రాలేదు కద నాన్నా!” అన్నాడు బంటిగాడు అమాయకంగా.
”నోర్మురు! పిల్ల చేష్టలు చేస్తున్నావు!” అన్నాడు శేఖర్ కోపంగా.
”సర్లెండి! రెండు గంటల పాటు క్రికెటర్లతో ప్రధాని ఏం చేశారండి!” కుతూహలంగా అడిగింది లక్ష్మి.
”క్రికెటర్లు ప్రపంచకప్ ఎలా సాధించారో ఒక్కొక్కరినీ ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు! ప్రతి ఒక్కరి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు! ఫైనల్లో గెలవటానికి ఏమి ప్రణాళికలు వేశావని రోహిత్‌నూ, టోర్నమెంటులో అన్ని మ్యాచుల్లో సరిగ్గా ఆడనందున, ఫైనల్‌కి ఎలా ప్రిపేర్ అయ్యావని విరాట్‌ను ప్రత్యేకంగా అడిగారు తెలుసా!” అన్నాడు గర్వంగా శేఖర్.
”కవర్ డ్రైవ్ అంత బాగా ఎలా ఆడతావని విరాట్‌ను మోడీ అడిగారా ‘నాన్నా!” అన్నాడు బంటిగాడు.
”నువ్వు ఆగురా! అన్ని పిల్ల చేష్టలే! రెండు గంటల్లో ప్రధాని ఇంకా ఏం చేశారండీ” అడిగింది లక్ష్మి.
”ప్రపంచ ఛాంపియన్లతో కలిసి ఫొటోలు దిగారు! ఇక్కడో విషయం గుర్తించాలి! మోడీ స్వయంగా ప్రపంచకప్పును పట్టుకోలేదు! రోహిత్,ద్రావిడ్ చేతుల్లో కప్పును ఉంచి, వారిద్దరి చేతులను మోడీ పట్టుకున్నారు! వారే ప్రపంచ కప్పును సాధించారని, తాను నిమిత్త మాత్రుడనేనన్న సందేశం ఉంది! అదే ఇందిరాగాంధీ ఏం చేసిందో తెలుసా? కపిల్‌దేవ్ చేతుల్లోంచి ప్రపంచకప్ లాక్కుని ఫొటోలకు ఫోజులిచ్చింది! అందుకే ఇందిర నియంత! ఆమె అలా 1983లో కప్పు లాక్కోవడం వల్లే 2011 వరకు మనకు ప్రపంచకప్ రాలేదు తెలుసా!” అన్నాడు శేఖర్ గంభీరంగా.
”అయ్యో! కపిల్‌దేవ్ చేతుల్లోంచి ఇందిరాగాంధీ కప్పు లాక్కోలేదు! ఇందిరాగాంధీ చేతుల్లోకి మర్యాదగా, గౌరవంగా కపిల్‌దేవే కప్పును అందించాడు!” అన్నాడు బంటిగాడు తల బాదుకుంటూ.
”రేరు పిల్లవెధవా! నీలాంటి వాడు దేశానికి ప్రమాదం! అంటూ బంటిగాడిని కొట్టబోయాడు శేఖర్.
”ఆటలంటే, ఛాంపియన్లంటే ప్రధానికి ఎంత ప్రేమ?” అన్నది లక్ష్మి, బంటిగాడిని శేఖర్ బారిన పడకుండా కాపాడి.
”ఆటలంటే, ఛాంపియన్లంటే ప్రధానికి ఎంతో ప్రేమ! ప్రధానిది ఎంతో బాధ్యత గల సున్నిత హృదయం! మోడీ ప్రధాని కావటం ఈ దేశ ప్రజలు చేసుకున్న ఏడేడు, పద్నాలుగు జన్మల పుణ్యం” అన్నాడు శేఖర్ తన్మయంగా.
”మహిళా రెజ్లర్లపై బ్రిజ్ భూషణ్ వేధింపులకు పాల్పడుతున్నారని మహిళా రెజ్లర్లు, పురుష రెజ్లర్లు ఢిల్లీ వీధుల్లో రోదిస్తూ నిరసనలు చేస్తే మోడీ స్పందించ లేదేం! సాక్షి మాలిక్ ఒలింపిక్ ఛాంపియను వెక్కివెక్కి ఏడుస్తూ, నేను రెజ్లింగ్ నుంచి తప్పుకుంటున్నానని ప్రకటిస్తే, మోడీజీ ఒక్క పది నిమిషాలు కేటాయించి ఆమెతో మాట్లాడలేదేం! ఆమె భారతీయురాలు కాదా!” అడిగింది లక్ష్మి.
గాల్లో తేలిపోతున్న శేఖర్ ఒక్కసారిగా నేలమీదికి దిగిపోయాడు.
”టోర్నమెంటు అసాంతం విఫలమైనపుడు, ఫైనల్‌లో నీ మానసిక స్థితి ఏమిటని విరాట్‌ను, మీడియా ముందు అడిగిన మోడీజీ, కనీసం నాలుగు గోడల మధ్యనైనా మహిళా రెజ్లర్లతో ఒక ఎంపీ వేధిస్తే, మీ మానసిక స్థితి ఏమిటని అడిగారా? భారతదేశానికి బంగారు పతకాలు తెచ్చిన బగారు తల్లులకి ప్రధానిగా నేను అండగా ఉన్నానని నాలుగు మాటలు చెప్పలేదేం!” అడిగింది లక్ష్మి.
శేఖర్ మాట్లాడలేదు.
”పదకొండు మంది క్రికెట్ ఆటగాళ్ల కోసం రెండు గంటలు తన విలువైన సమయాన్ని కేటాయిం చిన ప్రధానికి, వందలాది మందిని హత్య చేస్తుంటే, మహిళలను నగంగా ఊరేగిస్తుంటే, మీకు నేనున్నానని, ధైర్యం చెప్పేందుకు, మణిపూర్‌ను సందర్శించే సమయం దొరకటం లేదు!” అడిగింది లక్ష్మి.
”ప్రపంచ ఛాంపియన్లను అవమానిస్తున్నావ్!” అన్నాడు శేఖర్ ఆగ్రహంగా.
”దీనికేం తక్కువ లేదు! గత రెండు సం||లు మణిపూర్ దగ్ధమైపోతుంటే, ఆ రాష్ట్రం పాకిస్థాన్‌లో ఉన్నట్టు వ్యవహరిస్తున్న మీరు! ఆ రాష్ట్ర ప్రజలను అవమానిస్తున్నారా లేక దేశంలో నుంచి బహిష్కరించారా?” నిలదీసింది! లక్ష్మి.
”ప్రపంచ ఛాంపియన్లను అభినందించొద్దా?” అన్నాడు శేఖర్ గొంతు పెగలుచుకుని.
”తప్పకుండా అభినందించాలి! ఏ ఆటలోనైనా ప్రపంచ ఛాంపియన్ అంటే అత్యున్నతం! దాంట్లో ఎవరూ తప్పుపట్టరు! కానీ మహిళా రెజ్లర్లను అవమానించినవాడి పుత్రరత్నానికి ఎంపీ టికెట్ ఇస్తారు! మహిళా రెజ్లర్లు నిరసన తెలుపుతుంటే పోలీసులతో కొట్టిస్తారు!అత్యున్నతమైన ఒలింపిక్ పథకాలను రోడ్డుపైన వదిలేసి, కన్నీళ్లతో కదిలిపోతుంటే, వారిని పలకరించే తీరిక ప్రధానికి లేదు!దేశంలో క్రికెట్ ఒక్కటేనా ఆట?”మళ్లీ నిలదీసింది లక్ష్మి.
శేఖర్ ఏదో చెప్పబోయాడు.
”ఒక పక్క ప్రపంచ ఛాంపియన్లతో మోడీ ఫొటోలు దిగుతుంటే మరో పక్క భోలే బాబా పాదధూళి కోసం వందకు పైగా పిల్లలు మహిళలు తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారు! దీనిపై ప్రధాని ఈరోజు వరకు స్పందించలేదేం! వారంతా పాకిస్థాన్, చైనా, బంగ్లాదేశ్ నుంచి వచ్చారా? రోహిం గ్యాలా? అచ్చమైన హిందువులే కదా! వారి పట్ల ప్రధానికి బాధ్యత లేదా?” ప్రశ్నించింది లక్ష్మి.
”ఈవెంట్ ఆర్గనైజర్ల మీద ఎఫ్‌ఐఆర్ బుక్ చేయించారు కదా!” ధైర్యంగా అన్నాడు శేఖర్.
”ఇదిగో ఇదే పిల్ల చేష్టలు! పిల్లలకు బాధ్యత తెలియదు! కాబట్టి వారేదో మాట్లాడుకుంటారు! కానీ మీకు బాధ్యత ఉంది! గత పదేండ్లుగా అధికారంలో ఉన్నారు! కానీ ఈ దేశంలో ప్రతి సమస్యకి అరవై ఏండ్ల కింద చనిపోయిన నెహ్రూ, నలభై ఏండ్ల కింద చనిపోయిన ఇందిరా గాంధీలదే బాధ్యత అంటారు! గత పదేండ్లలో మీరు ఏం వెలగబెట్టారో చెప్పకుండా, హోంవర్క్ ఎందుకు చేయలేదంటే, నా పెన్సిల్‌ని ఎవడో కొట్టేశాడని స్కూలు పిల్లలు చెప్పినట్టుంది! అందుకే మీరు పిల్లచేష్టలు మాని బాధ్యతతో మెలగండి’ అన్నది లక్ష్మి.
– ఉషాకిరణ్