నలుపు తెలుపు సినిమాలలో ఒక అందం ఉంటుంది. ఆ అందాన్ని ఆస్వాదించగల వారికే అది అర్ధం అవుతుంది. హాలివుడ్‌లో చాలా ముందుగా కలర్ సినిమాలు రావడం మొదలయ్యాయి. తరువాత వాటిల్లోనూ ఎన్నో మార్పులు జరిగాయి. కాని అలనాటి పాత చిత్రాలను ఇష్టంగా చూసేవారికి చల్లని వెన్నెలలో ప్రయాణించడానికి, వెలుగులు చిమ్మే కరెంటు దీపాల మధ్య తిరుగాడడానికి మధ్య తేడా అర్ధమవుతుంది. దేని అందం, దేని సౌకర్యం దానిదే కాని వెన్నెల అందం దీపాల మధ్యన రాదు. అలాంటి ఆనందం కోసమే టేక్నీ కలర్ నుండి మళ్లీ నలుపు తెలుపు సినిమాల వైపుకి ప్రయాణం చేస్తారు కొందరు సినీ ప్రేమికులు. ఇది అతి తక్కువ మంది చూపే ఉత్సాహం అని అనుకోవచ్చు. కాని చాలామంది నలుపు తెలుపు సౌందర్యానికి అచ్చెరువు చెందుతారని, ఆ ఆనందం 21వ శతాబ్దంలో కూడా సాధ్యం అని ప్రకటించిన సినిమా ‘ది ఆర్టిస్ట్’
అస్కార్ సాధించిన మొదటి చిత్రం వింగ్స్ తరువాత అంటే 1927తరువాత 2011 లో ఆస్కార్ గెలుపొందిన పూర్తి మూకి చిత్రం కూడా ఇదే. అవును ఇది మాటలు లేని చిత్రం. ఫ్రాన్స్ వారి భాషాభిమానం అందరికీ తెలిసిందే. అందుకని ఇందులో ఒకే ఒక డైలాగ్ ఫ్రెంచ్ యాసలో చివర్లో పెట్టి దానిపై తమ భాష ముద్ర సజీవంగా వేసి ఈ చిత్రాన్ని పూర్తిగా తమదిగా ప్రకటించుకున్నారు ఫ్రెంచ్ సినీ కళాకారులు. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన జీన్ దుజాదాన్ ఉత్తమ నటుడిగా ఆస్కార్ గెలుచుకున్నారు. దానితో ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డు పొందిన మొదటి ఫ్రెంచ్ నటుడిగా ఆయన రికార్డు నెలకొల్పారు. ఈ సినిమాకు కథ రాసుకుని దర్శకత్వం వహించింది మిషెల్ హజనవిచ్యుస్. ఇందులో నాయిక పాత్ర పోషించిన బెరెనీస్ బెషో వీరి భార్య. పది కేటగిరీలలో ఆస్కార్‌కు నామినేట్ అయి, అయిదు అవార్డులు పొందిన చిత్రం ఇది. 1960లో వచ్చిన ‘ది అపార్ట్మెంట్’ చిత్రం తరువాత ‘ది ఆర్టిస్ట్’ దాకా మరే నలుపు తెలుపు సినిమాకు ఆస్కార్ లభించలేదు. అందుకే ఈ చిత్రానికి విశేషమైన ప్రజాదరణ నేటికీ ఉంది.
ఈ చిత్రం కోసం దర్శకులు హాలివుడ్‌లోని సైలెంట్ సినిమాలన్నిటినీ అధ్యయనం చేశారు. సినిమా కథ 1920వ దశకంలోనిది కాబట్టి ఆ రోజులలోని సినిమా తీరును ఆయన ప్రత్యేకంగా అధ్యయనం చేసారు. నలుపు- తెలుపులో ప్రదర్శించినప్పటికీ, సినిమాటోగ్రాఫర్ గుయిలౌమ్ షిఫ్‌మాన్ దీనిని రంగులోనే చిత్రీకరించారు. లెన్స్‌లు, లైటింగ్, కెమెరా కదలికలతో సహా అన్ని ఆ కాలంలోని నిశ్శబ్ద చిత్రాలకు సాంకేతికంగా సరిపోయేలా జాగ్రత్తపడ్డారు. సినిమాను నాస్టాలిజియా ఆపాదించడానికి అలనాటి ప్రఖ్యాత హాలివుడ్ చిత్రాల సంగీతాన్ని బాక్‌గ్రౌండ్‌కు దర్శకులు వాడుకున్నారు.
సినిమా కథ 1927 కాలానికి చెందింది. హాలివుడ్‌లో ప్రఖ్యాత నటుడు జార్జ్ వాలెంటైన్. సినిమా ప్రారంభంలో అతను తన కొత్త చిత్రం విజయోత్సవ వేడుకలలో రిపోర్టర్ల ఫొటోలకు ఫోజ్ ఇస్తుంటాడు. ఆ గుంపులోనుండి పెప్పిమిల్లర్ అనే ఓ అమ్మాయి అత్యుత్సాహంతో ముందుకు రాబోతూ అతనిపై పడుతుంది. స్వభావ రీత్యా మదుస్వభావి, అందరితో కలిసిపోయే తత్వం ఉన్న జార్జ్ దీనికి నవ్వి అందరిలో చేరిన టెన్షన్‌ను దూరం చేస్తాడు. అతని ఔదార్యానికి పెప్పిమిల్లర్ అతన్ని ముద్దు పెట్టుకుంటుంది. అప్పుడే ఓ ఫొటోగ్రాఫర్ తన కెమెరాకి పని చెబుతాడు. ఈ ఫొటో మరుసటి రోజు పేపర్‌లో వస్తుంది. ఆమె ఎవరన్న ఉత్సాహం అందరిలో మొదలవుతుంది.
ఆ మరుసటి రోజు పెప్పిమిల్లర్ సినిమాలో చిన్న పాత్రల కోసం ఆడిషన్‌కు వెళుతుంది. అలాంటి సందర్భంలో మళ్లీ ఆమె జార్జ్‌ను కలుస్తుంది. జార్జ్ ఆ స్టూడియో ప్రధాన నటుడు. పెప్పిని అతను ప్రోత్సహిస్తాడు. అతని సిఫారసుతోనే ఆ సినిమాలో ఆమెకు చిన్న పాత్ర దొరుకుతుంది. జార్జ్‌తో నటిస్తున్నప్పుడు వారిద్దరి మధ్య ప్రేమ చిగురుస్తుంది. జార్జ్ వివాహితుడు. ఈ సంగతి పెప్పిమిల్లర్‌కు కూడా తెలుసు. అతనిపై తనకున్న ప్రేమను మనసులోనే దాచుకుని ఆమె తన కెరీర్‌పై శ్రద్ద పెడుతుంది. జార్జ్ ఆమె ముఖంపై ఓ చిన్న బ్యూటీ స్పాట్ పెట్టి అది ఆమెకు అందానిస్తుందని తెరపై ఆమె దానితోనే కనిపించాలని ఆమెను ఉత్సాహపరచడం ఆమె ఎప్పుడూ మరచిపోదు. అతన్ని స్పూర్తిగా తీసుకుని చిన్న చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించి ఆమె మెల్లిగా మంచి పాత్రలు పోషించే స్థాయికి చేరుకుంటుంది.
జార్జ్ భార్యకు అతనికీ మధ్య సయోద్య ఉండదు. జార్జ్ పనిలో ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటాడు. కాని మెల్లిగా మూకీ సినిమాల స్థానంలో టాకీలు రావడం మొదలవుతుంది. జార్జ్ ఈ మార్పుని జీర్ణం చేసుకోలేకపోతాడు. మాటలతో నటించడం అతనికి అలవాటు లేదు. ఈ పరిణామానికి ఎదురీదడానికి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి తానే దర్శకత్వం వహించి ఓ సినిమా తీస్తాడు జార్జ్. మరోవైపు ఈ పరిణామం పెప్పీ లాంటి కొత్తతరం నటులకు అదష్టంలా మారుతుంది. మార్పుకు సిద్దంగా ఉన్న ఆమె ప్రధాన నటిగా మారి టాకీలలో నటించడం మొదలెడుతుంది. జార్జ్ తీసిన సినిమా, పెప్పీ సినిమా ఒకేసారి విడుదలవుతాయి. ఆ సినిమాకు సంబంధించిన ఇంటర్వ్యూలో పెప్పీ ఇక మూకీలకు కాలం చెల్లిందని చెప్పడం జార్జ్‌ను బాధిస్తుంది. కాని తాను అతన్ని దష్టిలో పెట్టుకుని ఆ మాట అనలేదని జార్జ్‌ని క్షమాపణ వేడుకుంటుంది పెప్పీ. ఆమె సినిమా గొప్పగా ఆడుతున్నా, ఆమె తన సినిమా ఆడే థియేటర్‌కు కాకుండా జార్జ్ సినిమా చూడడానికి వెళుతుంది. సినిమా బాగున్నా అప్పటి కాల మార్పులకు అది ప్రేక్షకులను ఆకర్షించలేకపోవడంతో జార్జ్ కెరీర్ ముగిసిందని ఆమెకు, థియేటర్‌లో మరో మూల ఉన్న జార్జ్‌కీ అర్ధమవుతుంది. జార్జ్ తరుగుదలను మౌన శ్రోతగా చూస్తూ ఆమె కూడా బాధపడుతుంది.
మరో పక్క జార్జ్ భార్య అతనికి విడాకులు ఇస్తుంది. పెట్టుబడి పెట్టిన షేర్లలో మొత్తం డబ్బు పోగొట్టుకుంటాడు జార్జ్. సినిమాలు రావు. సంపాదించిన డబ్బు పోతుంది. దానితో ఇల్లు అమ్మేస్తాడు. ఇల్లు అమ్మకానికి పెట్టిన రోజే ఇంట్లోని ప్రతి వస్తువుకు అనుకున్న దాని కన్నా ఎక్కువ డబ్బు ఇచ్చి కొనేసుకుంటారు. కాని ఆ డబ్బు కూడా ఎక్కువ కాలం నిలవదు. ఓ చిన్న ఇంట్లోకి మారతాడు జార్జ్. తన దగ్గర పని చేస్తున్న డ్రైవర్‌కు సంవత్సరకాలంగా జీతం ఇవ్వట్లేదని అతనికి అప్పుడు గుర్తుకొస్తుంది. తన కార్ అతనికిచ్చి వెళ్లిపొమ్మంటాడు. కాని డ్రైవర్ అతన్ని వదల్లేనంటాడు. కాని బలవంతగా ఉద్యోగం నుండి అతన్ని తీసేస్తున్నానని చెప్పి అతన్ని బైటికి పంపిస్తాడు జార్జ్. ఇప్పుడు పూర్తిగా ఒంటరివాడవుతాడు.
పెప్పీ హాలీవుడ్‌లో గొప్ప నటిగా ఎదుగుతుంది. డబ్బు, పేరు సంపాదించుకుంటుంది. నిరాశలో కూరుకుపోయిన జార్జ్ తన సినిమా రీళ్ళతో పాటు ఇంటికి నిప్పంటించుకుంటాడు. అతని పెంపుడు కుక్క సమయానికి పోలీసుల సహాయం తీసుకుని రావడంతో వారు అతన్ని రక్షిస్తారు. ఆసుపత్రికి అతను రక్షించుకున్న ఒకే ఒక ఫిల్మ్ డబ్బాతో తీసుకువెళతారు. పెప్పీ ఈ సంగతి విని అతన్ని చూడడానికి హాస్పిటల్‌కు వస్తుంది. అతను అంత జాగ్రత్తగా పట్టుకున్న ఫిలిం డబ్బా తాను అతనితో ఎక్ట్స్రాగా నటించిన రీలు ఉన్న డబ్బా అని చూసి ఆమె జార్జ్ మనసు తెలుసుకుంటుంది. అతన్ని తన ఇంటికి తీసుకుని వెళుతుంది.
ఆ ఇంట్లో స్పహలోకి వచ్చిన జార్జ్ అక్కడ తన డ్రైవర్ పని చేస్తూ ఉండడం చూస్తాడు. పైగా ఆ ఇంటి స్టోర్ రూంలో తన ఇంటి సామాను ఉండడం చూసి తన ఇల్లు వేలంలో కొనుక్కున్నది పెప్పీ అని గ్రహిస్తాడు. పెప్పీ మనసులో తనపై ఉన్నప్రేమ అతనికి అర్ధమవుతుంది. కాని అతని అహం దెబ్బతింటుంది. పెప్పీ జార్జ్ సినిమాలు లేకుండా పడుతున్న బాధను అర్ధం చేసుకుంటుంది. అందుకే అతన్ని హీరోగా అంగీకరిస్తేనే తాను సినిమా చేస్తానని తన నిర్మాతకు, స్టూడియో యజమానికి షరతు పెడుతుంది. తప్పని పరిస్థితులలో వాళ్లు దానికి ఒప్పుకుంటారు. ఆ సినిమా కథను ఆనందంగా జార్జ్‌కి ఇవ్వాలని వస్తుంది. కాని అప్పటికే అహం దెబ్బతిన్న జార్జ్ ఆమె ఇల్లు వదిలి కాలిపోయిన తన ఇంటికి వెళ్లిపోతాడు. అతని మానసిక స్థితి అర్ధం చెసుకున్న పెప్పీ అతని ఇంటికి హడావిడిగా బయలుదేరుతుంది. తలకు పిస్తోలు గురి పెట్టుకుని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో ఉంటాడు జార్జ్. పెప్పీ అతన్ని ఆపి తన ప్రేమను అతనికి తెలియజేస్తుంది. అతనిలోని కళ మరణించకూడదని చెబుతుంది. తన మాటలు వినడానికి ఎవరూ సిద్దంగా లేరని, తాను ఇక నటించలేనని కన్నీళ్ళు కారుస్తాడు జార్జ్. అప్పుడు నాట్యంలో జార్జ్ కున్న ప్రతిభను అతనికి గుర్తు చేస్తుంది పెప్పీ. డైరక్టర్‌కి చెప్పి ఓ మ్యూజికల్ సినిమా తీయమని దానికి తాను జార్జ్‌తో కలిసి నటిస్తామని ఒప్పిస్తుంది. ఆమె ఒత్తిడితో సినిమా మొదలుపెట్టిన దర్శకులు వారిద్దరిపై పాటను షూట్ చేస్తారు.
సినిమాలో మొదటిసారి సన్నివేశాలకు సంబంధించిన ద్వని ఇక్కడ వినిపిస్తుంది. టాప్ డాన్స్‌తో పూర్తి పాటలో నర్తించిన వారిద్దరి ఆయాసం, వారు తీసుకునే ఊపిరి ధ్వనులు ప్రేక్షకులను చేరతాయి. ‘అద్భుతంగా వచ్చింది సీన్, కాని ఇంకో టేక్ తీసుకుందామ’ని దర్శకులు అడగడంతో జార్జ్ ‘విత్ ప్లెషోర్’ అంటూ ఫ్రెంచ్ యాసలో జవాబిస్తాడు. ఆ యాసతో మనం చూస్తుంది ఫ్రాన్స్ చిత్రం అని ప్రేక్షకులకు తెలుస్తుంది. ఈ సినిమా మొత్తంలో వీరి నత్యం తరువాత డైరక్టర్ కట్ అంటూ మూకీ సినిమాలో లీనమై చూస్తున్న ప్రేక్షకులను ఈ లోకంలోకి తీసుకువస్తారు. అదే ఈ సినిమాలోని మొదటి డైలాగ్. ఆ నత్యం కూడా మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళుతుంది. నత్యం అయిపోయాక సెట్ పై కొన్ని క్షణాల మౌనం, దీని మధ్య అనుమానంగా అందరినీ చూస్తున్న జార్జ్.. ఒకే సారి కట్ అన్న శబ్దంతో ”పర్ఫెట్ మరో టేక్ ఇవ్వగలరా” అని మర్యాదగా అడుగుతున్న నిర్మాత గొంతు వినిపిస్తాయి.. ఇతనే జార్జ్‌ని ఒకప్పుడు పక్కకు నెట్టేసిన వ్యక్తి, అతని గొంతులో మర్యాదతో జార్జ్ ముఖంలో చేరే తేజస్సు. వెంటనే ‘విత్ ప్లెషర్’ అని ఫ్రెంచ్ యాసలో అతనిచ్చే సమాధానం. ఈ సన్నివేశం ప్రేక్షకులకు అందించే థ్రిల్ చూడాలంటే ఈ సినిమాను చూసి తీరవలసిందే.
‘అప్పట్లో వచ్చిన ఏ స్టార్ ఈజ్ బార్న్’, చాప్లిన్ తీసిన ‘లైమ్ లైట్’, హిందీలో గురుదత్ తీసిన ‘కాగజ్ కే ఫూల్’ సినిమాల కథను పోలిన కథతో తీసిన చిత్రం ఇది. కాని ఈ కథతో వచ్చిన మిగతా సినిమాలన్నీ కూడా విషాదాలే. ఈ ఒక్క చిత్రంలోనే ఆ కథ ముగింపు సుఖాంతం చేసి విశేషమైన స్పందన రాబట్టగలిగారు దర్శకులు. గడిచిన హాలీవుడ్ మూకీల కాలాన్ని మళ్లీ జీవింపచేస్తూనే అసలు మాటలే లేని చిత్రాన్ని కేవలం నటుల హావభావాలతో ఈ శతాబ్దపు ప్రేక్షకుల మనసులకు దగ్గర చేయగలిగారు. పైగా నటుల నటన అలనాటి నటులను పోలి ఉండి ప్రస్తుత తరానికి చాలా భిన్నంగా కనిపిస్తుంది. దీన్ని ప్రేక్షకులు ఆమోదించడమే కాదు, ఆ శైలిని ఆస్వాదించి ఆనందించడం చెప్పుకోవలసిన విషయం.
మూకీలలో ఇన్ని రకాల హావభావాలను ప్రదర్శించడం చాలా కష్టం. దీనికి ముఖ్య పాత్రలు వేసిన నటులు సంపూర్ణంగా న్యాయం చేసారు. ముఖ్యంగా ఈ పాత్రల మధ్య వయోభేదం కూడా ఎక్కువ. తన అభిమాన నటుడిని అప్పుడే నటనలో ఓనమాలు దిద్దుకునే ప్రయత్నంలో ఉన్న ఓ యువతి ప్రేమించడం, అతనిచ్చిన ప్రోత్సాహంతో నటనలో ముందుకు సాగడం, అతని వైవాహిక స్థితి అర్ధం చేసుకుని అతని జీవితం నుండి తొలగడం, చివరకు అతను కష్టాలలో ఉన్నాడని తెలిసి నిశ్శబ్దంగా ఆదుకునే ప్రయత్నం చేయడం, అహంతో అతను ఆత్మహత్య వైపుకు నడుస్తుంటే, తాను చేయూత ఇచ్చి అతనిలోని కళాకారుడిని మరోసారి బతికించడం, ఇలాంటి కథలో చూపించే మెలోడ్రామా కూడా అప్పటి తరానికి చెందిన కథన రీతిలోనే సినిమా కనిపిస్తుంది. కాని సుఖాంతమైన ముగింపుతో ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతో చేరువ అయింది. ట్రాజెడీ కథను కామెడీ బాట పట్టించి గంటన్నర సేపు ఆనందపుటంచులలో ప్రయాణించజేసిన ఈ చిత్ర సిబ్బందికి కతజ్ఞతలు చెప్పుకుంటూ, సినిమాకు మాటలు నిజంగా అవసరమా అనే మీమాంసలో పడిపోతారు ప్రేక్షకులు. ఆస్కార్ పొందిన గొప్ప చిత్రాల నడుమ గర్వంగా నిలిచే ఆణిముత్యం ‘ది ఆర్టిస్ట్’.
– పి.జ్యోతి,
98853 84740