మంచునది..!

మంచునది..!ఎందుకు అక్కడే ఆగి పోయావు…?
ఎన్నో మైళ్ళు దాటి
ఓ సుదీర్ఘ ప్రయాణం చేసొచ్చి
నువ్వెందుకు అక్కడే గడ్డకట్టుకు పోయావు..?
కొన్ని వసంతాలు.. మరిన్ని గ్రీష్మాలు
కొన్ని హేమంతాలు.. మరిన్ని శిశిరాలు
మట్టి దిబ్బల్ని – రాళ్లను రప్పల్ని
అడవుల్ని లోయల్ని – కొండల్ని కోనల్ని
ఏపుగా దాటి వచ్చిన ప్రవాహం సాక్షిగా
నువ్వెందుకు అక్కడే బిగుసుకుపోయావు..?
నిరంతరం వర్షించిన తుఫానులకు
నువ్వెప్పుడు జడవలేదు..
పెద్ద పెద్ద వరదల విస్తతికి
నువ్వెప్పుడు లొంగలేదు..
అనితరంగా ప్రవహించి
దాహార్థులందరికీ జీవం పోసినావు..
నీకై ఎదురు చూసే
పొలాలకు, చేన్లకి, చెలకలకి అన్నమైనావు..
ఇంత చేసిన నువ్వు
ఎందుకు అక్కడే నిలిచిపోయావు..?
నీ నడతకు నీ నడవడికకు
మరెన్నో సవాళ్లు పొంచి ఉన్నాయి
వాటిని ఛేదించడానికి
నీలో ఆలోచనను రేకిస్తున్నాయి..
నీ వంకలు తిరిగిన ప్రవాహానికి
ఇంకెన్నో పుష్కరాలున్నాయి..
పెనవేసుకుపోయే
మమతల మజిలీలున్నాయి..
నీ కీర్తిని కథలుగా చెప్పుకోవాలని
నీ విస్తతి కోసం ఎదురుచూస్తున్నాయి…!
ఇంకెందుకు అక్కడే ఆగిపోయావు,
ఒక్కసారి జూలు విదిల్చిన
సింహంలా కదులు
మరొక్కసారి నీ సంకల్పం
దిశగా ప్రవహించు..
ఈ మర్మమెరుగి నువ్వు చైతన్యమైతే
ప్రకతి స్వాగతిస్తుంది నీ సార్థకతని..!
చరిత్ర లిఖిస్తుంది నీ పూర్ణత్వాన్ని…!!
– డా. వాసాల వరప్రసాద్‌,
9490189847