బలోపేతమవుతూనే ప్రజాసమస్యలపై పోరుబాట !?

– పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం
– ఎన్టీఆర్‌ భవన్‌లో నేడు భేటీ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
తెలుగుదేశం తెలంగాణ శాఖ భవిష్యత్‌ కార్యాచరణపై ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ మేరకు ఆదివారం హైదరా బాద్‌లోని ఆపార్టీ రాష్ట్ర కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో టీడీపీ కార్యాచరణకు సంబంధించి మార్గదర్శనం చేసే అవకాశం ఉందని సమాచారం. తెలంగాణ పార్టీ శాఖకు అధ్యక్షుడు లేరు. పాత కమిటీ మా త్రమే ఉంది. గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో కొంత మంది పార్టీని వీడారు. మరికొంత మంది ఆ దిశలో ఉన్నారు. ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో భవిష్యత్‌ కార్యాచరణపై బాబు కార్యకర్తలకు వైఖరిని తెలియచెబుతున్నారని భావిస్తున్నారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, ఆఫీసు బేరర్లు, కార్య వర్గ సభ్యులు, ఆయా పార్లమెంటరీ నియోజ కవర్గాల అధ్యక్షులు, కార్యవర్గం, ప్రజాప్రతినిధులను ఎన్టీఆర్‌భవన్‌లో జరిగే సమావేశానికి ఆహ్వానిం చారు. పార్టీని బలోపేతం చేస్తూనే ప్రజా సమస్యలపై పోరుబాటలో నడవాలని చెబుతారా ? లేక అధికారులు, ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇస్తూ కాలక్షేపం చేస్తారా ? అనే అంశాలపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. దీనిపై చంద్రబాబు స్పష్టత ఇస్తారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇదిలావుండగా తెలంగాణ పార్టీకి కొత్త అధ్యక్షుడి నియామకం విషయంలో ఇంకా ఆలస్యం జరిగే అవకాశం ఉందని పొలిట్‌బ్యూరో స్థాయి నాయ కులు అంటున్నారు. ప్రస్తుతం ఆదివారం నాటి సమావేశంలో ఆ అంశంపై చర్చించే అవకాశం లేదంటున్నారు.