ప్రధానమంత్రి మోడీ దిష్టిబొమ్మ దహనం

ప్రధానమంత్రి మోడీ దిష్టిబొమ్మ దహనం– బొగ్గు గనుల వేలం ఆపాలని డిమాండ్‌
నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్‌
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేట్‌ పరం చేయడంలో భాగంగా సింగరేణి బొగ్గు బ్లాకులను వేలం వేస్తుందని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.విలాస్‌ ఆరోపించారు. బొగ్గు గనుల వేలాన్ని నిరసిస్తూ ట్రేడ్‌ యూనియన్ల ఆధ్వర్యంలో శనివారం బస్టాండ్‌ ఎదుట ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టి నిరసన తెలిపారు. దీంతో రోడ్డుకు ఇరువైపుల వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.విలాస్‌ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరించడంలో భాగమే సింగరేణి బొగ్గు బ్లాకులను వేలం వేసేందుకు కేంద్రం నిర్ణయించిందన్నారు. తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్రా ఆదాయానికి గండి పడుతున్న పట్టించుకోకుండా వేలంపాటను సమర్ధించడం సిగ్గు చేటన్నారు. నిజాం కాలంలో కూడా వీటిని ఎవరికి ఇవ్వలేదని, తెలంగాణ సంపదగా అప్పటి రాజు ప్రకటించారని గుర్తు చేశారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈనెల 17వ తేది వరకు వివిధ రకాలుగా నిరసన తెలుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్‌ యూనియన్ల నాయకులు అన్నమొల్ల కిరణ్‌, సిర్రదేవేందర్‌, జగన్‌ సింగ్‌, గణేష్‌, వెంకట నారాయణ ఉన్నారు.