– కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తో కలిసి టాయిలెట్ల నిర్మాణానికి శంకుస్థాపన..
నవతెలంగాణ – వేములవాడ రూరల్
ప్రభుత్వ విద్యాలయాల్లో మెరుగైన వసతులు కల్పించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు.వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో రూ.16 లక్షల అంచనాతో ఎనిమిది టాయిలెట్ల నిర్మాణానికి ప్రభుత్వ విప్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తో కలిసి శంకుస్థాపన చేశారు.అనంతరం ప్రభుత్వ విప్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల కింద పలు ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ రకాల మరమ్మతు పనులు చేయించిందని తెలిపారు.ఇప్పటికే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లు పంపిణీ చేయించామని వివరించారు. అనంతరం ప్రభుత్వ విప్, కలెక్టర్ తో కలిసి కస్తూర్బా గాంధీ విద్యాలయ ఆవరణంలో పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా చూసుకోవాలని పాఠశాల విద్యాలయం బాధ్యులను ఆదేశించారు. పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. నీరు నిల్వ ఉండకుండా చూసుకుంటూ బ్లీచింగ్ పౌడర్ చల్లించాలని పేర్కొన్నారు.అనంతరం వారిద్దరు కలిసి వేములవాడ- కోరుట్ల ప్రధాన రహదారిలో నిర్మాణంలో ఉన్న మర్రిపల్లి వంతెన పనులను పరిశీలించారు. పనులను త్వరితగతిన చేపట్టి వెంటనే అందుబాటులోకి తేవాలని అధికారులను ప్రభుత్వ విప్ ఆదేశించారు..పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు. వారి వెంట పంచాయతీరాజ్ ఈ ఈ సూర్య ప్రకాష్, జిల్లా అధికారులు, కస్తూర్బా గాంధీ విద్యాలయం బాధ్యులు, స్థానిక నాయకులు ఎంపీటీసీ రంగు వెంకటేష్ గౌడ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.