– ఏటా పెరుగుతున్న పత్తి విత్తనాల ధరలు
– ఆర్థిక ఇబ్బందుల్లో అన్నదాతలు
నవతెలంగాణ-తొర్రూరు
అసలే పెట్టుబడులు పెరిగి రైతాంగం ఆందోళన చెందుతుంటే పెరిగిన పత్తి విత్తన ధరలు రైతులపై మరింత భారం మోపుతున్నాయి. ఈ ఏడాది పత్తి విత్తన బ్యాగుపై 11 రూపాయలు పెంచినట్లు తెలుస్తుంది. గత సంవత్సరం ఒక ప్యాకెట్ ధర 853 రూపాయలు ఉండగా 2024- 25 లో వ్యవసాయ సీజన్‌కు సంబంధించి పెరిగిన ధర తో కలుపుకొని 864 రూపాయలకు పెరిగింది. మండలంలో 9500 ఎకరాల్లో పత్తి సాగు అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం 2500 పత్తి విత్తన ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు.
పెరుగుతున్న పెట్టుబడులు..
ప్రతి ఏడాది పత్తి విత్తన పాకెట్ ధరలు పెరుగుతుండడంతో రైతులకు పెట్టుబడి ఖర్చు తడిసి మోపెడవుతుంది. కార్పొరేట్ సీడ్ కంపెనీలు రైతుల నుంచి విత్తనాలు సేకరించి, వాటిని గ్రేడింగ్ చేసి జర్మినేషన్ చెక్ చేసి ప్యాకెట్ల రూపంలో విక్రయిస్తున్నారు. రైతుల నుండి సీడ్ కంపెనీలు కొన్న పత్తి విత్తనాలు.. సీడ్ ప్యాకెట్ల రూపంలో తిరిగి రైతులకు చేరే సరికి ధర భారీగా పెరిగిపోతుంది. ఎకరాకు ఒకటిన్నర లేదా రెండు ప్యాకెట్లు అవసరం కాగా, రైతుల పెట్టుబడి ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి. పత్తి అధికంగా సాగు చేసే ఈ మండలంలో రైతాంగాన్ని విత్తన ధరల పెరుగుదల ఆందోళన కలిగిస్తుంది.
గత నాలుగేళ్ల లెక్కలు పరిశీలిస్తే..
2021- 22 ఆర్థిక సంవత్సరంలో సగటున ఒక ప్యాకెట్ ధర 730 రూపాయలుగా ఉన్న పత్తి సీడ్ ప్యాకెట్ ధర ఇప్పుడు 864 చేరింది. అంటే నాలుగు ఏళ్ల వ్యవధిలో 134 మేర ఒక ప్యాకెట్ పై ధర పెరిగింది. ప్రతి సంవత్సరం సగటున 30 రూపాయల చొప్పున విత్తన ప్యాకెట్ల ధరలు పెరిగిపోతున్నాయి. ఏటా విత్తన ధరలు, క్రిమిసంహారక మందులు, యంత్రాల వినియోగ చార్జీలు, కూలీల ధరలు కూడా పెరుగుతుండడంతో రైతులపై ఆర్థిక భారం పడుతుంది. ఎకరాకు రెండు పాకెట్లు చొప్పున రైతులు పత్తి విత్తనాలు కొనుగోలు చేస్తారు. వర్షాలు సకాలంలో కురవక పోతే విత్తనాలు మళ్ళీ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతో రైతులపై భారం అధికంగా పడుతుంది. విత్తనాలపై సబ్సిడీ ఇవ్వాలని, ధరలను నియంత్రించాలని రైతుల కోరుతున్నారు.
విత్తన ధరలు పెరిగాయి ఇలా..
2020-21 సంవత్సరంలో రూ.730
2021-22 సంవత్సరంలో రూ.767
2022-23 సంవత్సరంలో రూ.810
2023-24 సంవత్సరంలో రూ.853 రూపాయలు,
2024-25 సంవత్సరంలో 864 రూపాయలు పెరుగుతూ వచ్చింది.
విత్తన ధరలు తగ్గించాలి..
పాడియా బీకూ, రైతు.
పత్తి విత్తన ధరలు తగ్గిస్తారనుకుంటే పెరిగాయి. ఇది రైతులకు ఇబ్బందిగా, భారంగా మారింది. ఇప్పటికే పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి తోడు ప్రభుత్వం విత్తన ధరలు పెంచడంతో పెట్టుబడి ఇంకా పెరుగుతుంది. అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. విత్తన ధరలు వెంటనే తగ్గించాలి.
కంపెనీలకు లాభం చేకూర్చేందుకే..
పాడ్యా భిక్ష , రైతు.
కంపెనీలకు లాభం చేకూర్చేందుకే ధరలు పెంచుతున్నారు. దీంతో రైతులపై భారం పడుతుంది. ప్రభుత్వం పెంచిన ధరలతో పాటు సబ్సిడీని పెంచితేనే రైతులు నష్టపోరు. ఇది ముమ్మాటికి రైతులను మోసం చేయడమే.