కొత్త జీవో వచ్చేవరకు పోరాటం ఆపేది లేదు: కైరిదేవగంగు

నవతెలంగాణ – కంఠేశ్వర్
కొత్త జీవో వచ్చే వరకు పోరాటం ఆపేది లేదని అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలు ఖైరి దేవగంగు తెలియజేశారు. ఈ మేరకు సోమవారం అంగన్వాడీ ఉద్యోగుల పోరాటంలో భాగంగా మూడో రోజు ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి  తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు ఖైరి దేవగంగు, గౌరవ అధ్యక్షులు సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మూడు దశాబ్దాలకు పైగా పని చేసినటువంటి అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు, ఏప్రిల్ 31వ తేదీ లోపు 65 సంవత్సరాలు నిండిన వారికి రిటైర్మెంట్ ప్రకటిస్తూ జీవో నెంబర్ 10ని విడుదల చేయడం జరిగిందని దాని ప్రకారం టీచర్ కు లక్ష రూపాయలు, ఆయాకు రూ.50,000 చెల్లిస్తూ జూలై 1 నుండి విధులకు ఎవరు హాజరు కాకూడదని ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఇది పూర్తిగా అంగన్వాడీ ఉద్యోగులను వంచించటమే అవుతుందని సెప్టెంబర్ నెలలో జరిగిన 24 రోజుల సమ్మె సందర్భంగా అప్పటి ప్రభుత్వం అధికారుల సమక్షంలో అంగన్వాడీ టీచర్లకు రెండు లక్షలు ఆయాలకు, లక్ష రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లిస్తామని అదేవిధంగా పెన్షన్ సదుపాయాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చి జీవో జారీ చేయకపోవడంతో ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పాత జీవనం అమలు జరపాలని ఆదేశించడం అంటే అంగన్వాడీ ఉద్యోగుల పోరాటాన్ని నీరుగా అర్చటమే అవుతుందని అన్నారు.  అదేవిధంగా ఇంకెప్పుడు జరిగిన పోరాటం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అంగన్వాడీ ధర్నా శిబిరాల వద్దకు వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను  పరిష్కరిస్తామని హామీ ఇచ్చి, ఎన్నికల మేనిఫెస్టోలో అంగన్వాడీ ఉద్యోగులకు 18 వేల వేతనం చెల్లిస్తామని ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఇవ్వటం జరిగింది. తీరా ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఉద్యోగులకు ఇచ్చిన హామీని మరిచిపోవటం సరైంది కాదని వారు అన్నారు. ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ 10ని వెనక్కి తీసుకోవాలని అంగన్వాడీ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బంగారు రిటైర్మెంట్ ప్రకటించిన అంగన్వాడీ ఆయాలు, టీచర్లు తమ ఆవేదనను వెలుగుచటం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడి యూనియన్ నాయకులు. జ్యోతి, గంగుబాయి, చిలుబై, తదితరులతోపాటు ఆయా మండలాల రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు.