విశాఖపట్నం : వైజాగ్ స్టీల్‌ప్లాంట్ నష్టాల్లో కూరుకుపోవడం వల్లే కేంద్రం ప్రయివేటుపరం చేయాలని భావించిందని కేంద్ర ఉక్కు సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ అనడం సత్యదూరమని, ఆయన వ్యాఖ్యలు అత్యంత హేయమని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పేర్కొంది. స్టీల్‌ప్లాంట్ నష్టాలు పూడ్చడం ఏ ప్రభుత్వానికైనా కష్టమని అనడాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వ విధానం ప్రయివేటు వారికి కొమ్ము కాయడమేనని తేటతెల్లమైందని విమర్శించింది. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు సోమవారానికి 1343వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో స్టీల్ సిఒ అండ్ సిసిపి, కోకో ఒవెన్ కార్మికులు కూర్చున్నారు. వారినుద్దేశించి పోరాట కమిటీ నాయకులు ఎన్ రామారావు, డి ఆదినారాయణ మాట్లాడారు. ఈ ఏడాది కూడా విశాఖ స్టీల్ నష్టాల్లో ఉందని కేంద్ర సహాయ మంత్రి పేర్కొనడం దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా ఉందని అన్నారు. నష్టాలకు కేంద్ర బిజెపి ప్రభుత్వ ఆంక్షలే కారణమని తెలిపారు. 2021లో నికర లాభాల్లో ఉండి 28 వేల కోట్లు టర్నోవర్ చేసిన విశాఖ ఉక్కును అదానీకి, అంబానీకి అమ్మేందుకు చేస్తున్న కుట్రలను వివరించారు. ఉత్పత్తికి కావలసిన రా మెటీరియల్ కొనుగోలు చేయకుండా, అనేక విభాగాలను ఆపేసి, వైజాగ్ స్టీల్ బ్రాండ్ ఇమేజ్‌ని దెబ్బతీసింది ఎవరని ప్రశ్నించారు.