మంత్రి సీతక్క కార్యాలయంలో వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థ

– ప్రజాభవన్‌లో రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ సిస్టం ఏర్పాటు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర మంత్రి డాక్టర్‌ దనసరి అనసూయ (సీతక్క) హైదరాబాద్‌ ప్రజాభవన్‌లోని తన క్యాంపు కార్యాలయంలో వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. 13,600 చదరపు అడుగుల పైకప్పు విస్తీర్ణంలో ఉన్న ఈ నిర్మాణంలో ఏడాదికి సుమారు 1.15 మిలియన్‌ లీటర్ల వర్షపు నీటిని సంరక్షించుకోవచ్చు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క నీటి సంరక్షణ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. భూగర్భ జలాలను పెంచడానికి, పట్టణ వరదలను తగ్గించడానికి వర్షపు నీటి సంరక్షణలో అంతా చురుగ్గా పాల్గొనాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. ” దాహం వేసినప్పుడు బావిని తవ్వలేము, ఆకలి వేసినప్పుడు విత్తనాలు వేయడం వల్ల ఉపయోగం లేదు. ముందస్తు ప్రణాళికతోనే వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవాలి” అని అన్నారు. ఇటీవల బెంగుళూరు, ఢిల్లీ వంటి నగరాల్లో తలెత్తిన నీటి సంక్షోభాలను ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. మన రాష్ట్రం కూడా అలాంటి పరిస్థితిలో పడకూడదనుకుంటే అంతా వర్షపు నీటిని సంరక్షించుకోవాలని కోరారు. నీటిని సంరక్షించడం, పొదుపుగా వాడుకోవడమే సుస్థిరమైన మార్గమని ఆమె నొక్కి చెప్పారు. ప్రతి పౌరుడు నీటి సంరక్షణ ప్రయత్నాలకు సహకరించాలని, పర్యావరణ సమతుల్యతను పునరుద్ధరించడంలో తోడ్పాటునందించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా నీటి సంరక్షణ కార్యక్రమాలను ప్రోత్సహించడంలో వాక్‌ ఫర్‌ వాటర్‌ సంస్థ, దాని వ్యవస్థాపకుడు కరుణాకర్‌ రెడ్డి చేస్తున్న కృషిని మంత్రి సీతక్క అభినందించారు.