కాంగ్రెస్‌ వేధింపులను తిరిగి వడ్డీతో సహా చెల్లిస్తాం : కేటీఆర్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో వాఆటిని మళ్ళీ వడ్డీతో సహా చెల్లిస్తామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా మేడ్చల్‌ జిల్లా పీర్జాదిగూడలో సోమవారం ప్రజలు కట్టుకుంటున్న ఇళ్లను అక్రమంగా కూలగొట్టిన తీరుపై ఆయన మండిపడ్డారు. ఆ ఘటన సమాచారాన్ని తెప్పించుకుని తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి సూచించారు. కాంగ్రెస్‌ నాయకులు అమ్మిన, రేవంత్‌ ప్రభుత్వం క్రమబద్ధీకరించిన చేసిన ప్లాట్లలో నిర్మించుకుంటున్న ప్రజల ఇండ్లను మేడ్చల్‌ మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఏం ఆశించి కూలగొట్టించాడో తేల్చాలని డిమాండ్‌ చేశారు. ‘ప్రజా పాలనలో ప్రజలకు మద్దతు ఇవ్వడానికి వెళ్లిన బీఆర్‌ఎస్‌ నాయకులను పోలీసులతో నిర్బంధిస్తారా..? మీకు అన్నగా ప్రచారం చేసుకుంటూ సుధీర్‌ రెడ్డి మేడ్చల్‌ అసెంబ్లీ పరిధిలో చేస్తున్న అరాచకాలపై మీరు ఇంటెలిజెన్స్‌ నివేదిక తెప్పించుకోండి’ లేదంటే ప్రజలు తిరగబడుతారని’ కేటీఆర్‌ హెచ్చరించారు. కాంగ్రెస్‌ నిర్బంధాలు ప్రజాగ్రహాన్ని నిలువరించలేవని తెలిపారు. అమాయక ప్రజలకు ఈ ప్లాట్లు అమ్మింది కాంగ్రెస్‌ నాయకుడు రాందాస్‌ గౌడ్‌, ఆ పార్టీకి చెందిన నాయకుడు జగదీశ్వర్‌ రెడ్డి, కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ అమర్‌ సింగ్‌ కుటుంబమని తెలిపారు. ఈ ప్లాట్లను 2008లో నాటి సీఎం రాజశేఖర్‌ రెడ్డి ప్రభుత్వం క్రమబద్ధీకరించిందని గుర్తు చేశారు. గతంలో రెవెన్యూ అధికారులు ఇది పట్టా భూమిగా ఎన్వోసీ జారీ చేశారనీ, ప్రభుత్వ నిబంధనలకు లోబడి మున్సిపల్‌ అధికారుల అనుమతి తీసుకుని ప్రజలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఇంటి నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. కానీ మేడ్చల్‌ మాజీ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి అధికారులను వేధించి అమాయక ప్రజల ఇండ్లను కూలగొట్టించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని సాయిప్రియ, సత్యనారాయణ పురం కాలనీ ప్లాట్ల యజమానుల సమస్యను శాశ్వతంగా తీర్చాలనే లక్ష్యంతో నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 118 జీవో పరిధిలో చేర్చి ప్లాట్‌ ఓనర్లకు మేలు చేసిందని తెలిపారు. కానీ ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ అసమర్థ ప్రభుత్వం అమాయకుల ఇండ్లను కూల్చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో బీఆర్‌ఎస్‌ మళ్ళీ అధికారంలోకి వస్తుందనీ, ఆ వెంటనే ఆ ప్లాట్‌ ఓనర్లకు న్యాయం చేస్తామని తెలిపారు. తాము ఇలా వేధించాలి అనుకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్‌ నామరూపాల్లేకుండా పోయేదన్నారు.