– వామపక్ష పార్టీల పిలుపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో మైనార్టీల మీద బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ శక్తులు చేస్తున్న మతోన్మాద దాడులకు వ్యతిరేకంగా ఈనెల 17 నుంచి 25 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సదస్సుకు వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్ వీరయ్య, డీజీ నరసింహారావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈటి నరసింహా, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రమ, రామచందర్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె గోవర్ధన్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు ఎం శ్రీనివాస్, ఆకుల పాపయ్య, ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వనం సుధాకర్, ఎస్‌యూసీఐ(సీ) నాయకులు ధర్మతేజ, ఆరెస్పీ రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఓట్లు-సీట్లు పెరిగిన నేపథ్యంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు సంబంధించిన సంస్థలు మైనార్టీల మీద దాడులను మరింత విస్తృతంగా చేస్తున్నాయని విమర్శించారు. మెదక్ పట్టణంలో నాలుగు గంటలపాటు ఆస్తుల విధ్వంసం చేయడంతోపాటు, బక్రీద్ సందర్భంగా ఆదిలాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, జనగామ తదితర ప్రాంతాల్లో గోరక్షణ పేరుతో దాడులు చేశాయని తెలిపారు. ప్రజల్లో మతపరమైన భావోద్వేగాలు, ఘర్షణలను పెంచే వాతావరణం సృష్టిస్తున్నా యని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం శాంతియుతంగా ఉన్న వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయని విమర్శించారు. ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి రావడం, మోడీ మళ్లీ ప్రధాని కావడంతో దేశవ్యాప్తంగా ఇలాంటి ఘర్షణలను సంఫ్‌ుపరివార్ శక్తులు సృష్టిస్తున్నాయని తెలిపారు. తెలంగాణలోనే కాకుండా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌ఘడ్, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో మైనార్టీల మీద దాడులకు పాల్పడుతున్నాయని విమర్శించారు. ఈ క్రమంలో సమస్యల పరిష్కారం కోసం పేదలు ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ఇందుకు భిన్నంగా పేదల మధ్య మతంపేరుతో చిచ్చుపెట్టడం ప్రజా ప్రయోజనాలకు నష్టమని తెలిపారు. అందుకే రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడుకోవాలని కోరారు. రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని వాడుకునే ప్రయత్నాలను వ్యతిరేకించాలని పేర్కొన్నారు. ఇందుకోసం తెలంగాణ ప్రజానీకాన్ని చైతన్యపరిచేందుకు వామపక్ష పార్టీలు రాష్ట్రవ్యాప్తంగా క్యాంపెయిన్ చేయాలని నిర్ణయించాయని తెలిపారు. అందులో భాగంగానే ఈనెల 17 నుంచి 25 వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో సదస్సులు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.