
తెలంగాణ ప్రభుత్వంచే ఆయిల్ ఫెడ్ చైర్మన్ నామినేట్ అయిన జంగా రాఘవరెడ్డి బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం 37 కార్పొరేషన్లకు చైర్మెన్లను ఫిబ్రవరిలోనే ఎంపిక చేసింది. అయితే పార్లమెంట్ ఎన్నికలు నేపథ్యంలో నాడు తాత్కాలికంగా నిలిపివేసారు. ఈ క్రమంలో టీజీ ఆయిల్ ఫెడ్ కు ఆ పదవి భర్తీ అయింది. ఈ చైర్మెన్ గిరీకీ వరంగల్ చెందిన కాంగ్రెస్ నాయకులు, వరంగల్ డీసీసీబీ పూర్వ చైర్మెన్, టిఎస్ క్యాబ్ డైరెక్టర్ జంగా రాఘవ రెడ్డిని తెలంగాణ ప్రభుత్వం నామినేట్ చేసింది. ఈయన బుధవారం హైదరాబాద్ బషీర్ బాగ్ లోని ఆయిల్ ఫెడ్ రాష్ట్ర కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రారంభం నుండీ ఈ ప్రాంతంలో ఆయిల్ ఫాం సాగు ఉండటం, రాష్ట్రంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యధిక సాగుతో పాటు సంస్థకు చెందిన పరిశ్రమలు, ప్రాంతం నుండే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్ ఫాం సాగు విస్తరించడం.
ఇదే జిల్లాకు చెందిన భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా, తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ మంత్రిగా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవిన్యూ శాఖ మంత్రిగా ఉండటంతో ఈ ప్రాంతం నుండి వీరి అనుచర ఆయిల్ ఫాం సాగు దారులు, రైతు సంఘాల నాయకులు అనేకులు ఈ చైర్మెన్ గిరీపై ఆశలు పెట్టుకున్నారు. 2014లో తెలంగాణ ఏర్పాటు అయ్యాక నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2018 లో ఆయిల్ ఫెడ్ కు కార్పొరేషన్ ఏర్పాటు చేసి అదే పార్టీకి చెందిన యాదాద్రి భువనగిరి జిల్లా సీనియర్ నాయకులు కంచర్ల రామక్రిష్ణ రెడ్డిని చైర్మెన్ గా నియమించింది. రెండు సంవత్సరాల కాలపరిమితి గల ఈ పదవిలో ఆయన మూడు దఫాలు నామినేట్ అయ్యారు. నేడు ఈ చైర్మెన్ గిరీకి రెండో చైర్మెన్ గా జంగా రాఘవరెడ్డి విధుల్లో చేరనున్నారు. ఈ సందర్భంగా ఆయిల్ ఫెడ్ స్థానిక ఉద్యోగులు, ఆయిల్ ఫెడ్ డి.ఒ బాలక్రిష్ణ, అశ్వారావుపేట, అప్పారావు పేట పరిశ్రమల మేనేజర్లు ఎం.నాగబాబు, జి.కళ్యాణ్ గౌడ్ లు ఆయనకు పదవీ బాధ్యతల స్వీకార శుభాకాంక్షలు తెలిపారు.